ఎల్ నినో ఎఫెక్ట్: పొలాలకు వెళ్లి కోతకు ముందే కొనేస్తున్నారు
విపత్తుల గురించి హెచ్చరికలు జారీ చేసినప్పుడు దాని ప్రభావం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని చాలా మంది పట్టించుకోరు.
By: Garuda Media | 13 Oct 2026 2:00 PM ISTవిపత్తుల గురించి హెచ్చరికలు జారీ చేసినప్పుడు దాని ప్రభావం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. కాలం గడుస్తున్న కొద్దీ.. చోటు చేసుకునే పరిణామాలు ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తాయి. ఇప్పుడు ఎల్ నినో విషయంలో అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు.. మనిషి చేసిన తప్పులకు శాపంగా ఎల్ నినో ఎదురవుతుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు సూపర్ ఎల్ నినో వచ్చి పడింది. చూస్తుండగానే దాని విశ్వరూపంలోని మొదటి అంకం ప్రజల అనుభవంలోకి వచ్చేసింది. వర్షాలు పడాల్సిన సమయంలో పడకపోవటం.. అక్టోబరులోకి వచ్చినా ఉష్ణోగ్రతల్లో మార్పు లేకపోగా.. చలి అన్నదే అడ్రస్ లేకుండా పోవటం మరో ఎత్తు. ఇదే సమయంలో వానలు లేని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి.
మరోవైపు.. సాగునీటికి మాత్రమే కాదు తాగు నీటికి సైతం ముప్పు పొంచి ఉందన్న వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఎల్ నినో ఎఫెక్టు రానున్న నెలల్లో మరింత ఎక్కువగా ఉండటమే కాదు.. ప్రజల మీద దీని ప్రభావం అమితంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించి.. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేయటం కోసం కసరత్తులు మొదలెట్టాయి. పంటలు వేయొద్దని కోరుతున్నాయి. క్రాప్ హలీడేను ప్రకటిస్తున్నాయి. చూస్తుండగానే బియ్యం ధరలకు రెక్కలు రావటమే కాదు కేజీ రూ.70 దాటేసిన పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకు ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనమన్నా కొనేవారుకాదు. కానీ.. ఇప్పుడు మద్దతు ధరకు రెట్టింపు పెట్టి కొనటం ఈ మధ్యన మొదలైంది. కట్ చేస్తే.. తాజాగా మరో షాకింగ్ పరిణామం మొదలైంది. అదేమంటే.. పంట కోసే వరకు ఆగకుండా కంకి దశలోనే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావటం చూస్తే.. రానున్న రోజుల్లో బియ్యం డిమాండ్ ఎంతలా ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలోని పలు ప్రాంతాలకు మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు వడ్లు కొనేందుకు తెలంగాణ పల్లెల్లో తిరుగుతున్న వైనం ఈ మధ్యన మొదలైంది. అంతేకాదు.. పంట నాణ్యత సంగతిని పక్కన పెట్టేసి.. కోతకు సిద్ధంగా లేని పంటకు సైతం ధరలు డిసైడ్ చేస్తూ.. అడ్వాన్సులు ఇచ్చేసి ఒప్పందాల మీద ఒప్పందాలు చేసుకుంటున్న పరిణామం చూస్తే.. రానున్న రోజుల్లో బియ్యం ధరలు.. డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటికే మార్కెట్ లో బియ్యం ధరలు కనిష్ఠంగా రూ.6వేలు (100 కేజీలు) నుంచి గరిష్ఠంగా రూ.8500 (వంద కేజీలు) ధరలు పలుకుతున్నాయి.
ఎల్ నినో ప్రభావంతో వరి పంట చాలా తక్కువమంది మాత్రమే వేస్తున్న వేళ.. బియ్యం ధరలకు రెక్కలు రావటం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన వ్యాపారులు రంగంలోకి దిగారు. గ్రామాల్లోకి వెళ్లి క్వింటాలు వడ్లకు రూ.4వేల నుంచి రూ.4600 వరకు ఇస్తామని చెబుతూ అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. నాణ్యత మాటేమిటి? అంటే.. ఆ సంగతి మేం చూసుకుంటామని చెప్పటం గమనార్హం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మద్దతు ధర రూ.2441 నుంచి రూ.2461` (ఏ గ్రేడ్) ఉండగా.. ఇందుకు దగ్గర దగ్గర 90 శాతం వరకు ఎక్కువగా డీల్స్ కుదుర్చుకోవటం విశేషం.అంతేకాదు.. తరుగుతో సంబంధం లేదని.. పండిన వడ్లను కోతలు కోసినంతనే తాము తీసుకెళ్లిపోతామని అభయమిస్తుండటం గమనార్హం. తేమ విషయాన్ని వదిలేయాలని చెబుతూ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్న వ్యాపారుల తీరు చూస్తే.. రానున్న రోజుల్లో బియ్యం ధరలు ఎంతలా మారతాయన్న దానికి తాజా పరిణామాలు శాంపిల్ గా చెబుతున్నారు. సో.. బీకేర్ ఫుల్ బాస్.
