ఎల్నినో భూతం.. వంటింట్లో యుద్ధం.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ భయాలను తమ వ్యాపార లాభాలకు అనుకూలంగా మలుచుకుంటూ ట్రేడర్లు సరకులను గోదాముల్లో నిల్వ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Political Desk | 23 July 2026 8:00 PM ISTప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ పరిణామాలు ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుంటే, మరోవైపు వర్షాభావ పరిస్థితులు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులతో ఏర్పడిన ఎల్నినో ను అడ్డు పెట్టుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ భయాలను తమ వ్యాపార లాభాలకు అనుకూలంగా మలుచుకుంటూ ట్రేడర్లు సరకులను గోదాముల్లో నిల్వ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
బియ్యం ధరలు డబుల్!
ఎల్నినో పేరుతో గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్నబియ్యం ధరలు అకస్మాత్తుగా పెంచేశారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గత నెలతో పోలిస్తే సన్నబియ్యం రకాన్ని బట్టి క్వింటాకు ఏకంగా రూ.1300 నుంచి రూ.1600 వరకు పెరిగిందని చెబుతున్నారు. ప్రభుత్వాలు రేషన్ ద్వారా ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నప్పటికీ, అందులో నూకల శాతం ఎక్కువగా ఉంటోందన్న సాకుతో లబ్ధిదారుల్లో కొందరు వాటిని తక్కువ ధరకు విక్రయించి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు సన్నబియ్యం కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపార వర్గాలు ఎల్నినో సాకుతో బియ్యాన్ని భారీగా నిల్వ చేసి, మార్కెట్లో కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం బియ్యం మాత్రమే కాకుండా, అల్లం, వెల్లుల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల స్టోర్లు కిరాణా మార్కెట్లలో నాణ్యత పేరుతో వీటి ధరలను విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలో రూ.140 ఉన్న అల్లం ధర ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ.210 నుంచి రూ.230-330 వరకు పలుకుతోంది. ఇక వెల్లుల్లి పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చెబుతున్నారు. గతంలో రూ.140-160 మధ్య ఉన్న వెల్లుల్లి ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.210 నుంచి గరిష్టంగా రూ.450 వరకు అమ్ముడవుతూ సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తోంది.
గత నెల మొదటి వారంలో ఉన్న ధరలకు, ప్రస్తుత మార్కెట్ ధరలకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. అల్లం ధర గతంలో కిలో రూ.140 ఉండగా, ప్రస్తుతం రూ.210 - 230కి చేరిందని అంటున్నారు. వెల్లుల్లి ధర గతంలో రూ.140-160 ఉండగా, ప్రస్తుతం రూ.210 - 450 వరకు పలుకుతోంది. ఎండుమిర్చి ధర గతంలో రూ.230-245 ఉంటే, ప్రస్తుతం రూ.320కి చేరుకుంది. మినప్పప్పు గతంలో కిలో రూ.110 ఉండగా, ప్రస్తుతం రూ.140కి పెరిగింది. ఉల్లి ధర గతంలో రూ.22 ఉండగా, ప్రస్తుతం రూ.36కి, చింతపండు రూ.140 నుంచి రూ.180కి ఎగబాకినట్లు చెబుతున్నారు.
నిజానికి వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం కొంతమేర ప్రభావం ఎదుర్కొంటుందన్నది వాస్తవమే అయినప్పటికీ, ఆ పరిస్థితిని పూర్తిగా వ్యాపారులు తమకు అనుకూలంగా సొమ్ము చేసుకుంటున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. సరఫరాలో చిన్నపాటి వ్యత్యాసం రాగానే దాన్ని భూతద్దంలో చూపిస్తూ, నిత్యావసరాలను కృత్రిమంగా నిల్వ చేయడం వల్లనే ఈ ధరల మోత మోగుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, ఇంటి అద్దెలు, పిల్లల పాఠశాల ఫీజులు, వైద్య ఖర్చులు, పెట్రోలు, గ్యాస్ బండ ధరల మోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేతన జీవులు, పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఈ నిత్యావసరాల ధరల పెరుగుదల పిడుగులా పడింది. నలుగురు సభ్యులున్న సగటు కుటుంబానికి బియ్యం, పప్పులు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, చింతపండు వంటి కిరాణా సామాగ్రి రూపంలో అదనంగా నెలకు రూ.1,500 నుంచి రూ.2,120 వరకు భారం పడుతోంది. దీనికి గ్యాస్, పెట్రోల్ ధరల పెంపును కూడా కలిపితే ఈ అదనపు భారం సగటున నెలకు సుమారు రూ.2,500 వరకు ఉంటోందని అంచనాలు చెబుతున్నాయి.
