Begin typing your search above and press return to search.

ఎల్‌నినో.. అంతిమంగా మన కొంపే ముంచుతోంది..

మన దేశంలో 'ఎల్‌నినో' అనే పేరు వినపడితే చాలు.. ఫైనాన్స్ కంపెనీల నుంచి సామాన్యుడి వంటగది వరకు అందరికీ చెమటలు పడుతుంటాయి.

By:  A.N.Kumar   |   17 July 2026 11:05 AM IST
ఎల్‌నినో.. అంతిమంగా మన కొంపే ముంచుతోంది..
X

మన దేశంలో 'ఎల్‌నినో' అనే పేరు వినపడితే చాలు.. ఫైనాన్స్ కంపెనీల నుంచి సామాన్యుడి వంటగది వరకు అందరికీ చెమటలు పడుతుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. వాతావరణంలో వచ్చిన మార్పులు మన జేబుల‌కు చిల్లు పెట్టడమే కాదు.. ఉచిత పథకాలకు కూడా గండి కొడుతున్నాయి. జేఎం ఫైనాన్షియల్ సంస్థ ఇచ్చిన తాజా రిపోర్ట్ చూస్తే.. ఇకపై సామాన్యుడు బతకాలంటే వాతావరణ శాఖ బులిటెన్లతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రోజుకోసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది.

ఉచితం అనుకుంటే.. ఊడ్చేసింది

తెలంగాణలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ‘గృహజ్యోతి’ పథకానికి ఇప్పుడు ఎల్‌నినో రూపంలో పెద్ద బ్రేక్ పడింది. నెలకి 200 యూనిట్ల లోపు వాడితే 'జీరో బిల్లు' వస్తుందని ఆశపడ్డ సామాన్యుడికి ప్రకృతి ఊహించని షాక్ ఇచ్చింది. వర్షాకాలంలో కూడా ఎండలు దంచికొడుతుండటంతో.. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రాత్రింబవళ్లు రయ్యిరయ్యిమంటూ తిరుగుతున్నాయి. ఫలితంగా కరెంట్ మీటర్లు కూడా ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరుగెడుతున్నాయి. ఫలితం 200 యూనిట్ల లిమిట్ కాస్తా దాటిపోవడంతో చేతికి జీరో బిల్లు రావాల్సింది పోయి, 'తడిసి మోపెడయ్యే' అసలు బిల్లు వస్తోంది.

ఉత్తర తెలంగాణ పరిధిలోనే జూన్ నెలలో దాదాపు 4 లక్షల మంది ఈ పథకానికి దూరమయ్యారంటే పరిస్థితి ఎంత హాట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉచితంగా వస్తుందనుకున్న కరెంట్, ఇప్పుడు ఉసూరుమనిపిస్తోంది.

ధరల దంచుడు.. అప్పుల తిప్పలు

జేఎం ఫైనాన్షియల్ లెక్కల ప్రకారం, ఎల్‌నినో దెబ్బకు సగటు వర్షపాతం ఏకంగా -10.65-% కి పడిపోయే ప్రమాదం ఉందట. వర్షాలు లేక పంటలు పండవు, మార్కెట్‌లో కూరగాయల నుంచి పప్పుల వరకు అన్నీ 'బంగారం' ధర పలుకుతాయి. ఉక్కపోత భరించలేక కరెంట్ వాడకం పెరిగి, పవర్ గ్రిడ్‌లు లాగలేక చస్తుంటే బిల్లులు చూసి జనం నీరసించిపోతున్నారు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల బాధలైతే వర్ణనాతీతం. వారికి బ్యాంకుల నుంచి లోన్లు దొరకడం కూడా గగనమేనని టాక్.

ఇకనైనా మారదామా?

నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, వాతావరణం మారినప్పుడు మనం కూడా మారక తప్పదు. ప్రభుత్వం పథకాల నిబంధనలు మారుస్తుందో లేదో పక్కన పెడితే మనమైతే ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు పొదుపుగా వాడుకోవడం బెటర్. లేదంటే ప్రకృతి ఇచ్చే షాక్‌లకి సామాన్యుడి బడ్జెట్ అట్టడుగుకి పడిపోవడం ఖాయం. ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ జూలైలో ఇంకెంతమందిని గృహజ్యోతికి దూరం చేస్తుందో చూడాలి.