Begin typing your search above and press return to search.

ఎల్-నినో అంటే ఏంటి? ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ఏర్పడింది ‘సూపర్ ఎల్-నినో’నా?

నినో అనేది ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (ఈఎన్ఎస్ఓ) అనే సహజ వాతావరణ చక్రంలోని వేడి దశ.

By:  A.N.Kumar   |   23 Sept 2026 3:51 PM IST
ఎల్-నినో అంటే ఏంటి? ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ఏర్పడింది ‘సూపర్ ఎల్-నినో’నా?
X

వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు తరచుగా వినిపించే పదం ఎల్-నినో. పసిఫిక్ మహాసముద్రంలో మొదలయ్యే ఈ సహజ వాతావరణ ప్రక్రియ ప్రభావం మాత్రం ఒక్క సముద్రానికే పరిమితం కాదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, వర్షపాతం, తుఫానులు, కరువు వంటి పరిస్థితులపై దీని ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం 2026లో ఏర్పడుతున్న ఎల్-నినో మరింత బలపడుతున్న నేపథ్యంలో దీనిపై ఆసక్తి పెరిగింది. ఎన్.ఓఏఏ తాజా అంచనాల ప్రకారం 2026 చివరి నాటికి ఇది అత్యంత బలమైన ఎల్-నినోల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది.

ఎల్-నినో అంటే ఏంటి?

ఎల్-నినో అనేది ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (ఈఎన్ఎస్ఓ) అనే సహజ వాతావరణ చక్రంలోని వేడి దశ. సాధారణంగా భూమధ్యరేఖకు సమీపంలోని మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు ఎల్-నినో పరిస్థితులు ఏర్పడతాయి.

సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్‌లో తూర్పు నుంచి పడమర దిశగా వీచే వాణిజ్య గాలులు వెచ్చని నీటిని పశ్చిమ పసిఫిక్ వైపు నెట్టేస్తాయి. ఎల్-నినో సమయంలో ఈ గాలులు బలహీనపడటంతో వెచ్చని సముద్ర జలాలు మధ్య తూర్పు పసిఫిక్ వైపు కదులుతాయి. ఫలితంగా సముద్రం-వాతావరణం మధ్య ఉన్న సాధారణ సమతుల్యత మారుతుంది.

మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది?

ఎల్-నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు పెరిగే అవకాశం ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావం, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఆఫ్రికా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గే పరిస్థితులు కనిపించవచ్చు. అట్లాంటిక్‌లో హరికేన్ కార్యకలాపాలు కూడా సాధారణంగా తగ్గే అవకాశం ఉంటుంది.

భారత్‌పై ప్రభావం ఏంటి?

భారత్‌కు ఎల్-నినో ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది భారత రుతుపవనాలపై ప్రభావం చూపగలదు. ముఖ్యంగా ఎల్-నినో బలంగా ఉన్నప్పుడు భారత ఉపఖండంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఎల్-నినో వస్తే తప్పనిసరిగా భారత్‌లో కరువే వస్తుంది అని చెప్పలేం. ఎల్-నినోతో పాటు ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ), స్థానిక సముద్ర ఉష్ణోగ్రతలు, వాయు ప్రసరణ వంటి అనేక అంశాలు కూడా భారత వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. 2026లో పాజిటివ్ ఐఓడీ కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇప్పుడు ఏర్పడింది ‘సూపర్ ఎల్-నినో’నా?

ఇక్కడే అసలు విషయం ఉంది. ‘సూపర్ ఎల్-నినో’ అనేది అధికారిక శాస్త్రీయ వర్గీకరణ కాదు. వాతావరణ వంటి సంస్థలు సాధారణంగా ఎల్-నినోను బలహీన, మోస్తరు, బలమైన, అత్యంత బలమైన వంటి వర్గాల్లో వివరిస్తాయి.

అయితే ప్రస్తుత ఎల్-నినో మాత్రం సాధారణ స్థాయి కంటే చాలా బలంగా మారుతోంది. ఎన్ఓఏఏ తాజా సెప్టెంబర్ 2026 నివేదిక ప్రకారం ఉత్తర అర్ధగోళ శరదృతువు-శీతాకాలంలో అత్యంత బలమైన స్ట్రాంగ్ ఎల్ నినో ఏర్పడే అవకాశం 90 శాతానికి పైగా ఉంది. అక్టోబర్–డిసెంబర్ 2026 కాలంలో 1950 తర్వాత నమోదైన ఎల్-నినోలను మించే స్థాయికి చేరే అవకాశం 75 శాతంగా అంచనా వేసింది.

అందువల్ల ప్రస్తుతం దీనిని మీడియా, వాతావరణ విశ్లేషకులు ‘సూపర్ ఎల్-నినో’గా పిలుస్తున్నప్పటికీ శాస్త్రీయంగా చెప్పాలంటే 2026లో చాలా బలమైన, చారిత్రక స్థాయికి చేరే అవకాశం ఉన్న ఎల్-నినో అని చెప్పడం మరింత సరైనది.

మొత్తంగా చూస్తే.. ఎల్-నినో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పరిణామం కాదు. పసిఫిక్‌లో మొదలైనా వాతావరణ ప్రసరణలో మార్పుల ద్వారా ప్రపంచంలోని అనేక ప్రాంతాల ఉష్ణోగ్రతలు, వర్షపాతం, తుఫానులు, కరువు వంటి అంశాలపై ప్రభావం చూపగలదు. అయితే ప్రతి దేశంలోనూ ఒకే విధమైన ప్రభావం ఉండదు. ప్రస్తుతం బలపడుతున్న 2026 ఎల్-నినో కారణంగా రానున్న నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై మరింత నిశితంగా పరిశీలన అవసరం.