రహస్య ఆపరేషన్, ప్రేమ కథ ట్విస్ట్… ఎల్ మెంచో హత్య వెనుక నిజాలు!
మెక్సికో డ్రగ్ సామ్రాజ్యానికి రారాజు, కరుడుగట్టిన నేరగాడు ఎల్ మెంచో శకం ముగిసింది. అగ్రరాజ్యం అమెరికా ఇంటెలిజెన్స్, మెక్సికో సైన్యం సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ రహస్య ఆపరేషన్‌లో ఈ డ్రగ్ కింగ్‌పిన్ హతమయ్యాడు.
By: Madhu Reddy | 24 Feb 2026 12:52 PM ISTమెక్సికో డ్రగ్ సామ్రాజ్యానికి రారాజు, కరుడుగట్టిన నేరగాడు ఎల్ మెంచో శకం ముగిసింది. అగ్రరాజ్యం అమెరికా ఇంటెలిజెన్స్, మెక్సికో సైన్యం సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ రహస్య ఆపరేషన్‌లో ఈ డ్రగ్ కింగ్‌పిన్ హతమయ్యాడు. ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా అండర్‌గ్రౌండ్‌లో తలదాచుకున్న మెంచో, చివరికి తన ప్రియురాలిని కలవాలనే చిన్న కోరిక వల్ల ప్రాణాలు కోల్పోయాడు. సినిమాను తలపించే ఈ హై-వోల్టేజ్ డ్రామా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. వివరాలు ఇలా వున్నాయి
ప్రియురాలితో భేటీ.. ఆచూకీ పట్టిన అమెరికా నిఘా:
వందల కోట్ల రివార్డు తలపై ఉన్నా, ఎల్ మెంచో ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలిసేది కాదు. కానీ, గతనెలలో అతడి ప్రియురాలు తన నమ్మకస్థుడైన అనుచరుడితో కలిసి మెంచోను కలవడానికి తపాల్పా వెళ్లడమే అతడి పతనానికి నాంది పలికింది. అమెరికా నిఘా వర్గాలు ఆమె కదలికలను కనిపెట్టి, కచ్చితమైన లొకేషన్‌ను మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖకు చేరవేశాయి. ఆమె అక్కడి నుంచి వెనుదిరిగిన వెంటనే, సైన్యం ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసింది. ఇన్నాళ్లూ కన్నుగప్పి తిరిగిన నేరగాడు, తన ప్రేమ కోసం చేసిన చిన్న తప్పుతో చిక్కుకుపోయాడు.
హెలికాప్టర్లతో ముట్టడి.. భీకర కాల్పుల మధ్య అంతం:
ఆదివారం తెల్లవారుజామున మెక్సికో ప్రత్యేక దళాలు ఆరు హెలికాప్టర్లతో మెంచో ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సైన్యాన్ని చూడగానే మెంచో అనుచరులు యధేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ భీకర పోరు జరుగుతుండగా, మెంచో తన ఇద్దరు బాడీగార్డులతో కలిసి అండర్‌గ్రౌండ్ సొరంగంలో దాక్కున్నాడు. ఇక అయితే, సైన్యం ఆ ప్రాంతాన్ని గుర్తించి దాడులు చేయడంతో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని గగన మార్గంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచినట్లు రక్షణ మంత్రి రికార్డో ట్రెవిల్లా అధికారికంగా ధ్రువీకరించారు.
పోలీసు నుంచి డ్రగ్ మాఫియా వరకు.. క్రూరమైన నేర చరిత్ర:
ఎల్ మెంచో అసలు పేరు నెమెసియో ఒసెగువెరా సెర్వంటెస్. విచిత్రం ఏంటంటే, ఈ నేరగాడు గతంలో ఒక పోలీసు అధికారిగా పనిచేశాడు. 2009లో 'న్యూ జనరేషన్ కార్టెల్' ఏర్పాటు చేసి, మెక్సికోలోనే అత్యంత భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇక 2015లో 20 మంది పోలీసుల తలలు నరికి చంపిన ఘటనతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. అమెరికా ఇతని తలపై 136 కోట్ల రూపాయల రివార్డును ప్రకటించింది. ఎంతటి క్రూరుడైనా చట్టం నుంచి తప్పించుకోలేడని మెంచో అంతం మరోసారి నిరూపించింది.
