ఆ ఖైదీకి బంగారు శవపేటిక!
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ముఠా నాయకుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ 'ఎల్ మెంచో' అంత్యక్రియలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
By: Madhu Reddy | 5 March 2026 12:12 PM ISTమెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ముఠా నాయకుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ 'ఎల్ మెంచో' అంత్యక్రియలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒక నేరగాడికి బంగారు శవపేటిక ఏంటి? ఐదు లారీల నిండా పూల గుచ్ఛాలు తరలించడం ఏంటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. కాల్పుల్లో గాయపడి మరణించిన ఈ డ్రగ్ లార్డ్ చివరి యాత్రలో జరిగిన హంగామా, ఆయన అనుచరులు ప్రదర్శించిన విలాసాలు చూస్తుంటే సామాన్యులకు మతిపోవాల్సిందే. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బంగారు శవపేటిక.. ఐదు లారీల పూల బొకేలు:
మెక్సికోలో డ్రగ్ నెట్‌వర్క్‌ను శాసించిన నెమెషియో ఒసెగుయెరా సెర్వాంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' మృతదేహాన్ని అత్యంత ఖరీదైన బంగారు శవపేటికలో ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఆయన మరణవార్త విన్న తర్వాత అనుచరులు భారీ ఎత్తున పూల గుచ్ఛాలను పంపారు. అవి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, వాటన్నింటినీ సమాధి దగ్గరకు చేర్చడానికి ఏకంగా ఐదు లారీలు అవసరమయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక నేర సామ్రాజ్యాన్ని ఏలిన వ్యక్తికి ఆయన ముఠా సభ్యులు ఇచ్చిన ఈ 'రాజ మర్యాదలు' చూసి అంతర్జాతీయ మీడియా సైతం విస్తుపోయింది.
కోడి ఆకారంలో పుష్పగుచ్ఛం.. వింత ఇష్టాలు:
ఎల్ మెంచోకు కోడిపందాలంటే విపరీతమైన ఇష్టం. అందుకే ఆయన జ్ఞాపకార్థం అంత్యక్రియల సమయంలో కోడి ఆకారంలో తయారు చేసిన ప్రత్యేక పుష్పగుచ్ఛాలను ప్రదర్శించారు. అంత్యక్రియల ఆచారాల్లో భాగంగా డ్రగ్ ముఠా నాయకులను ప్రశంసించే నార్కోకోరిడోస్ అనే పాటలను ప్లే చేశారు. ఇక మెక్సికో ప్రత్యేక దళాలు ఆయన్ను అరెస్ట్ చేసే ప్రయత్నంలో జరిగిన కాల్పుల వల్ల మరణించిన ఈయనను పట్టుకోవడానికి అమెరికా ప్రభుత్వం గతంలో 1.5 కోట్ల డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. అంటే మన కరెన్సీలో వందల కోట్లు అన్నమాట.
హింస మధ్య భారీ భద్రతతో అంత్యక్రియలు:
ఈ డ్రగ్ లార్డ్ మరణం తర్వాత మెక్సికోలోని సుమారు 20 రాష్ట్రాల్లో హింస చెలరేగింది. ముఠా సభ్యులు వాహనాలకు నిప్పు పెట్టడం, రోడ్లను బ్లాక్ చేయడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక ఈ క్రమంలో గ్వాడలహారా సమీపంలో జరిగిన అంత్యక్రియల వద్ద ప్రభుత్వం భారీగా భద్రతా దళాలను మోహరించింది. ఇక ఎక్కడ మళ్ళీ గొడవలు జరుగుతాయో అని పోలీసులు టెన్షన్ పడుతుంటే, అటు కార్టెల్ సభ్యులు మాత్రం తమ నాయకుడికి అత్యంత విలాసవంతంగా వీడ్కోలు పలికారు. నేర ప్రపంచంలో ఎల్ మెంచోకున్న పట్టుకు ఈ అంత్యక్రియలే ఒక సాక్ష్యంగా నిలిచాయి.
