Begin typing your search above and press return to search.

షిండే పెరిగితే బీజేపీ సీఎం కుర్చీకే ఎసరు ?

పెరుగుట విరుగుట కొరకే అని సామెత. రాజకీయాల్లో మాత్రం పెరుగుట అన్నది మరొకరి సీటుకు ఎసరు అని చరిత్ర పాఠం చెబుతోంది.

By:  Satya P   |   23 Jun 2026 9:16 AM IST
షిండే పెరిగితే బీజేపీ సీఎం కుర్చీకే ఎసరు ?
X

పెరుగుట విరుగుట కొరకే అని సామెత. రాజకీయాల్లో మాత్రం పెరుగుట అన్నది మరొకరి సీటుకు ఎసరు అని చరిత్ర పాఠం చెబుతోంది. అసలే రగిలిపోతున్న నాయకుడు ఆయన. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లకు పైగా రాజ్యం చేసి ఇపుడు ఉప ముఖ్యమంత్రి అని తీసి పక్కన పెడితే ఎలా ఉంటుంది. అచ్చం మహారాష్ట్రలోని ఏక్ నాధ్ షిండే మాదిరిగానే ఉంటుంది. ఈ కధ ఆయనదే. 2022 జూలై నెలలో ఆయనను ఎంతో గౌరవించి బీజేపీ 122 సీట్ల దాకా ఉన్నా కూడా సగం కూడా ఎమ్మెల్యేలు లేని ఆయనను నీవే ముఖ్యమంత్రి అన్నది బీజేపీ. నిజానికి ఆనాడు షిండే కూడా ఇంత పెద్ద ఆఫర్ తనకు వస్తుందని అనుకోలేదు. కానీ ఆయనే షాక్ తినేలా సీఎం ని చేశారు. ఇక 2024లో కూడా అదే జరుగుతుందని ధీమాగా ఉన్న షిండేకు కనీసం ఒక ఏడాది అయినా నీవు సీఎం అని బీజేపీ మాట వరసకైనా అనలేదు. ఉప ముఖ్యమంత్రి చాలు అంది. దాంతో ఆయన రగులుతున్నారు అని అప్పట్లోనే కాదు ఇపుడూ ప్రచారం ఒక వైపు సాగుతూ వస్తోంది.

పక్కా ప్లాన్ తోనే :

ఇక ఏక్ నాధ్ షిండే సమయం కోసం చూస్తున్నారు. ఆయన గడచిన ఏణ్ణర్థం కాలంగా అసంతృప్తితోనే ఉన్నారని కూడా కధనాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి ఆయనకు మధ్య గ్యాప్ ఉందని కూడా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఉద్ధవ్ థాక్రే మీద బాణం వేశారు. ఉరిమి ఉరిమి ఉద్ధవ్ మీడ షిండే పడ్డారేంటి అంటే అక్కడే షిండే రాజకీయ వ్యూహం దాగుందని అంటున్నారు. విపక్షంలో ఉన్న ఉద్ధవ్ థాక్రే ఎంపీలను దువ్వి మెల్లగా ఆరుగురిని తన వైపునకు ఏక్ నాధ్ షిండే తిప్పుకున్నారు. వారి మెడలో షిండే శివసేన కండువాలు వేశారు. దాంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో షిండే ఎంపీల బలం 13కి పెరిగింది. మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంది. దాంతో మూడో ప్లేస్ లో తొమ్మిది ఎంపీలతో బీజేపీ తగ్గినట్లు అయింది.

కేంద్రంలో అవసరమని :

ఇదిలా ఉంటే కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. పైగా రాజ్యాంగ సవరణ బిల్లులకు అయితే అసలు నంబర్ ఎక్కడా సరిపోవడం లేదు. దాంతో షిండే తెలివిగానే ఉద్ధవ్ ఎంపీలను తన వైపు తిప్పుకున్నారు అని అంటున్నారు. దాంతో బీజేపీకి కేంద్రంలో మరో ఆరుగురి మద్దతు లభిస్తుంది. అదే సమయంలో షిండేకు రాజకీయ బేరం ఆడే శక్తి కూడా వస్తుందని అంటున్నారు. ఇలా తెచ్చిన ఎంపీలలో ఒకరిద్దరికి కేంద్ర మంత్రి పదవులు కూడా ఆయన ఇప్పించుకుంటారు అని అంటున్నారు. అంతే కాదు మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే చక్రం తిప్పే రోజులు వస్తాయని అంటున్నారు.

సీఎం సీటు కోసమేనా :

మరోసారి మహారాష్ట్ర సీఎం కావాలని షిండే తపన పడుతున్నారు అని అంటున్నారు. అయితే ఈ టెర్మ్ లో కచ్చితంగా అవాలని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఒక వేళ కనుక కాకపోతే 2029 ఎన్నికల్లో అసలైన శివసేన తనదే అని పూర్తిగా ఆధిపత్యం చలాయిస్తే పొత్తు పేరుతో సీట్లు ఎక్కువ తీసుకుని మరీ సీఎం సీటు కోసం రాజకీయ బేరం ముందే కుదుర్చుకోవచ్చు అన్న ఎత్తుగడ కూడా ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక షిండే అమాంతం ఎదిగిపోవడం ఆయన పార్టీలోకి ఉద్ధవ్ ఎంపీలు రావడం అంటే భవిష్యత్తులో షిండే బీజేపీకి పక్కలో బల్లెంగా మారుతారా అన్న చర్చ అయితే సాగుతోంది.