రత్న గర్భ....డాలర్ చుట్టూ పరుగులు !
ఉన్న ఊరుని కన్న తల్లిని వదిలి పోవాలని ఎవరూ అనుకోరు. ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది.
By: Satya P | 22 Sept 2025 8:53 AM ISTఉన్న ఊరుని కన్న తల్లిని వదిలి పోవాలని ఎవరూ అనుకోరు. ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది. అది నిరంతర భావోద్వేగ తరంగాలను వెదజల్లుతూనే ఉంటుంది. అయితే మనసు మాట వింటే బతుకు నావ ముందుకు సాగదు. అందుకే తమ వారికి దూరంగా జరిగి జీవన పోరాటంలో భూగోళాన్ని చుట్టబెడుతూ పరుగులు పెడుతోంది ఆధునిక తరం. ఒకనాడు పక్క ఊరికి పట్టణానికి మొదలైన ఈ వలసలు ఆ తరువాత రాష్ట్ర రాజధానులు దేశ రాజధానులు దాటి ఈ రోజుకు ఖండాంతరాలకు పాకిపోయింది.
మేధో వలసతో :
ఒకనాటి భారత దేశం రత్నగర్భ గా ఉండేది. ఇక్కడ విశ్వానికి చదువులు చెప్పే విద్యాలయాలు ఉండేవి. తక్షశిల అలాగే నలంద రెండూ ప్రాచీన భారతదేశంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి. నలంద బీహార్ లోనిది అయితే తక్షశిల ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యలకు ఈ విద్యాలయాలు ఎంతో ప్రాచుర్యం కల్పించాయి. అలాగే ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి భారత్ కి వలసలు వచ్చేవారు. అంటే విద్యా ఉపాధికి అప్పట్లో నిలయంగా ఉన్న భారత్ తరువాత కాలంలో పరాయి పాలనలోకి వెళ్ళడంతో అనేక ఇబ్బందులు పడింది. అయితే స్వాతంత్ర్యం వచ్చాక మాత్రం భారత్ స్వావలంబన స్వయం సమృద్ధి అన్నవి అందమైన నినాదాలుగా మారిపోయాయని విమర్శలు ఉన్నాయి.
ఇదంతా ఎవరి పాపం :
ఈ దేశంలో విద్య ఉపాధి అవకాశాలలో ప్రతిభకు ప్రోత్సాహం తగ్గిందన్న మాట అయితే ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్ విధానం మీద కూడా ఒక ఘాటైన చర్చ అయితే సాగుతోంది. తమ చదువుకు తగిన విద్యాలయాలు లభించవని ఇతర దేశాలను పడుతున్నారు. ఆ మీదట ఉపాధిని అక్కడే చూసుకుంటున్నారు. ఫలితంగా మేధో వలస మొదలైంది. అది కాస్తా గత యాభై ఏళ్ళలో పీక్స్ కి చేరింది. ఒకనాడు ఫారిన్ రిటర్న్ అని గొప్పగా చెప్పుకునేవారు ఇపుడు ప్రతీ ఇంటి నుంచి ఒకరు విదేశాలలో ఉంటున్నారు.
అవసరమైన వారికే దక్కాలి :
ఈ మాట అన్నది శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ కీలక నాయకురాలు ఎంపీ అయిన సుప్రియా సూలె. ఆమె తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె తాజాగా ఒక జాతీయ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజంగా అవసరం అయిన వారికే రిజర్వేషన్ల ఫలాలు దక్కాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రులు విద్యావంతులని అందుకే తాను ఎక్కడా రిజర్వేషన్లు అడగలేదని ఆమె చెప్పారు. రిజర్వేషన్ల తాను దరఖాస్తు చేసుకుంటే అది సిగ్గు చేటు అవుతుందని భావించానని ఆమె చెప్పారు. తల్లిదండ్రులకు చదువు లేక వెనకబడి ఉంటేనే పిల్లలకు రిజర్వేషన్లు దక్కాలని ఆమె సూచించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యల మీద ప్రస్తుతం చర్చ సాగుతోంది.
నినాదం కాదు విధానం :
దేశంలో మేధావులు ఉండాలని ప్రతిభ దేశం దాటరాదని అంతా కలసి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని నినాదాలు ఇవ్వడం వరకూ బాగానే ఉంది. కానీ ఎందుకు ప్రతిభ గడప దాటుతోంది అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు. సుదీర్ఘమైన ప్రయాణం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చేస్తున్న నేపథ్యంలో ఇకనైనా సరైన విధానాలు రూపొందిస్తే ప్రతిభ ఇక్కడే ఉంటుందని అంటున్నారు. ఆర్దికంగా వెనకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిభకు పట్టం కట్టాలని అలా కనుక చేస్తే ఇతర దేశాలకు మనవారు వెళ్ళేదే ఉండదని అపుడు ఈ వీసాల బెదిరింపులు ఈ ట్రంప్ కార్డు పాలిటిక్స్ ఏవీ ఉండవని అంటున్నారు డాలర్ వెంట పరుగులు తీయకుండా ఉండాలి అంటే విధానాలు సమగ్రంగా ఉండాలని సూచిస్తున్నారు.
