Begin typing your search above and press return to search.

బ్యాగులో దుప్పట్లు, పిల్లో కవర్లు వైరల్ అవుతున్న వీడియో.. ఇవన్నీ ఎక్కడివంటే?

వేల రూపాయలు పెట్టి ఏసీ కోచ్‌లలో ప్రయాణించే స్థాయి ఉండి కూడా.. వందల రూపాయల విలువైన రైల్వే దుప్పట్లను దొంగిలించడం అనేది మన సమాజంలోని వికృత పోకడలకు నిదర్శనం.

By:  Tupaki Political Desk   |   24 March 2026 1:29 PM IST
బ్యాగులో దుప్పట్లు, పిల్లో కవర్లు వైరల్ అవుతున్న వీడియో.. ఇవన్నీ ఎక్కడివంటే?
X

వేల రూపాయలు పెట్టి ఏసీ కోచ్‌లలో ప్రయాణించే స్థాయి ఉండి కూడా.. వందల రూపాయల విలువైన రైల్వే దుప్పట్లను దొంగిలించడం అనేది మన సమాజంలోని వికృత పోకడలకు నిదర్శనం. రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ వీడియో కేవలం ఒక వ్యక్తి చేసిన దొంగతనం మాత్రమే కాదు.. చదువుకున్న వారిలో కూడా ఉండాల్సిన కనీస నైతికత ఎలా లోపిస్తోందో అద్దం పడుతోంది. భారతీయ రైల్వే అనేది మనందరి ఆస్తి, కానీ ఇలాంటి పనులు రైల్వే ప్రతిష్టను, ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఇలాంటి ఘటనే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రయాణికుడు

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, సెకండ్ ఏసీ (2AC) కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని రైల్వే అటెండెంట్ పట్టుకున్నాడు. ఆ ప్రయాణికుడు రైలు దిగే ముందు రైల్వే శాఖకు చెందిన దుప్పట్లు, దిండు గలీబులను వ్యక్తి గత బ్యాగులో అమర్చుకున్నాడు. అయితే, అనుమానం వచ్చిన అటెండెంట్ ఆ బ్యాగును తనిఖీ చేయగా, లోపల రైల్వే సామగ్రి బయటపడింది. ఆ వస్తువులను బ్యాగు నుంచి ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్న దృశ్యం నెటిజన్లను విస్మయానికి గురి చేసింది. గతంలో 1st AC లో కూడా ఇలాంటి చోరీలే వెలుగుచూశాయి.

మరచిపోయి సర్దేశాం దొరికితే చెప్పే సాకులు!

వీడియోలో దొరికిపోయిన ప్రయాణికుడు తప్పును ఒప్పుకోకుండా, అవి పొరపాటున బ్యాగులోకి వచ్చాయని లేదా ఇంట్లోని వారు తెలియక సర్దేశారని సాకులు చెప్పడం కనిపిస్తుంది. అయితే, రైల్వే సిబ్బంది మాత్రం ఆ వాదనను తోసిపుచ్చారు. ‘ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీలో ప్రయాణిస్తూ ఇలాంటి చిన్న వస్తువుల కోసం దొంగతనానికి పాల్పడటం ఏంటి?’ అని సిబ్బంది నిలదీయడం ఈ వీడియోలో స్పష్టంగా వినబడుతోంది. ఒకటి కంటే ఎక్కువ సెట్ల బెడ్ షీట్లను బ్యాగులో పెట్టుకోవడం పొరపాటు ఎలా అవుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

రైల్వే శాఖకు తీరని భారం!

ప్రయాణికులు చేసే ఇలాంటి చిన్న దొంగతనాలు రైల్వే శాఖకు భారీ ఆర్థిక భారాన్ని మిగిలిస్తున్నాయి.

భారీ నష్టం: రైల్వే గణాంకాల ప్రకారం, ఏటా 3,08,505 కంటే ఎక్కువ టవల్స్,

18,208 కంటే ఎక్కువ బెడ్ షీట్లు, 2,796 కంటే ఎక్కువ బ్లాంకెట్లు, 19,767 కంటే ఎక్కువ పిల్లో కవర్స్ చోరీకి గురైటనట్లు రైల్వే శాక చెప్తోంది.

ఆర్థిక భారం: వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వేల పరిధిలోనే ఏడాదికి సుమారు రూ. 2.5 కోట్లకు పైగా విలువైన లినెన్ వస్తువులు చోరీకి గురవుతున్నాయి.

సిబ్బందిపై ప్రభావం: నిబంధనల ప్రకారం, కోచ్‌లో వస్తువులు మాయమైతే దానికి అటెండెంట్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆ నష్టాన్ని వారి జీతం నుంచి కూడా రికవరీ చేస్తారు.

కఠిన చర్యలు తప్పవు

రైల్వే ఆస్తులను దొంగిలించడం అనేది రైల్వే చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. ఇలాంటి దొంగతనాలకు పాల్పడితే భారీ జరిమానాతో పాటు, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. రైల్వే భద్రతా దళం ఇలాంటి ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక చోట్ల రైల్వే టాయిలెట్లలో మగ్గులను, ట్యాపులను కూడా చైన్లతో కట్టేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ప్రయాణికుల ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మనం లక్షల రూపాయల కార్లలో తిరుగుతూ, విలాసవంతమైన కోచ్‌లలో ప్రయాణిస్తూ.. కేవలం వందల రూపాయల దుప్పటి కోసం మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం శోచనీయం. ప్రభుత్వం మనకు సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు, వాటిని గౌరవంగా వాడుకుని తిరిగి అప్పగించడం కనీస పౌర ధర్మం. విదేశాలకు వెళ్లినప్పుడు భారతీయ ప్రయాణికుల ప్రతిష్టను ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలే దెబ్బతీస్తాయి. రైల్వే శాఖ తన వంతుగా భద్రతను పెంచినప్పటికీ, ప్రయాణికుల్లో నైతిక మార్పు వచ్చినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.