Begin typing your search above and press return to search.

'గ్రూప్‌-1'పై ఈడీ న‌జ‌ర్‌.. మ‌నీలాండ‌రింగ్ కేసు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన గ్రూప్ -1 జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నం వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   16 Oct 2026 9:00 PM IST
గ్రూప్‌-1పై ఈడీ న‌జ‌ర్‌.. మ‌నీలాండ‌రింగ్ కేసు!
X

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన గ్రూప్ -1 జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నం వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే ఈ కేసుపై హైకోర్టులో విచార‌ణ పూర్తయింది. తీర్పును కోర్టు రిజ‌ర్వ్ చేసింది. వైసీపీ హ‌యాంలో ఏపీపీ ఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష జ‌రిగింది. అనంత‌రం.. ఈ ప‌త్రాల‌ను విజ‌య‌వాడ స‌హా.. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌(ప‌ర్యాట‌క ప్రాంతం)లో దిద్దారు. అయితే.. వీటిని దిద్దిన వారు.. అన‌ర్హుల‌ని, స్వీప‌ర్లు, అటెండ‌ర్లు సైతం జ‌వాబు ప‌త్రాల‌ను దిద్దార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

అదేస‌మ‌యంలో ఈ దిద్దుబాట్ల కార‌ణంగా అర్హులైన వారు అవ‌కాశాల‌ను కోల్పోయార‌న్న ఫిర్యాదులు వ‌చ్చాయి. వీటిపై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మించి.. విచార‌ణ చేయించింది. ప్ర‌స్తుతం ఈ కేసులపై హైకోర్టులోనూ విచార‌ణ పూర్త‌యింది. ఉద్యోగాలు పొందిన వారిని.. అప్రాధాన్యం పోస్టుల్లో నియ‌మించాల‌ని కూడా గ‌త ఏడాది హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఈ కేసులో ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ కూడా దృష్టి సారించింది. జ‌వాబు ప‌త్రాల దిద్దుబాటు క్ర‌మంలో భారీ ఎత్తున న‌గ‌దు కూడా చేతులు మారింద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ క్ర‌మంలో మ‌నీలాండరింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద ఈడీ అధికారులు శుక్ర‌వారం కేసులు న‌మోదు చేశారు. అప్ప‌టి ఏపీపీఎస్సీ అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన‌.. ఐపీఎస్ అధికారి తో పాటు ప‌లువురి పేర్ల‌ను కూడా ఈడీ అధికార‌లు కేసులో పేర్కొన్నారు. విజ‌య‌వాడ సూర్యారావుపేట పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగానే ఈ విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు ఈడీ అధికారులు తెలిపారు. జవాబు పత్రాలను 84 రోజుల పాటు ప్రైవేట్‌ ఏజెన్సీ వద్దే ఉంచార‌ని, అర్హత లేని 66 మందిని మూల్యాంకనంలో భాగ‌స్వాముల‌ను చేశార‌ని ఈడీ పేర్కొంది.

ముందే నిర్ణయించిన మార్కులను తగిన పర్యవేక్షణ లేకుండా వేసేశార‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో భారీగా సొమ్ములు చేతులు మారిన‌ట్టు అనుమానాలు ఉన్నాయ‌ని పేర్కొంది. దీంతో ఈ కేసును విచారించేందుకు తాము కూడా రెడీ అయ్యామ‌ని వివ‌రించింది.