Begin typing your search above and press return to search.

రూ.10వేల కోట్లకు ఆస్తుల అటాచ్ మెంట్స్.. అనిల్ అంబానీ కథ కంచికేనా?

రిలయన్స్ ఇన్ ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు దాదాపు రూ.17వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్టు ఆరోపణలున్నాయి.

By:  A.N.Kumar   |   5 Dec 2025 3:10 PM IST
రూ.10వేల కోట్లకు ఆస్తుల అటాచ్ మెంట్స్.. అనిల్ అంబానీ కథ కంచికేనా?
X

తినీ తినక తండ్రి ధీరూభాయ్ అంబానీ ‘రిలయన్స్’ అనే గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలోనే నంబర్ 1 గా నిలిపాడు. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ధీరూభాయ్ అంబానీ ప్రస్థానంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు చూసి ఉంటాడు. అందుకే అంత పెద్ద సంస్థను ఎక్కడా లాస్ కాకుండా నిలబెట్టాడు. మరి అంతపెద్ద సంస్థను తండ్రి అప్పనంగా అందిస్తే కొడుకులు ఏం చేయాలి.. దాన్ని మరింతగా విస్తరించాలి. ప్రపంచంలోనే మేటిగా నిలపాలి. అయితే ఒక కొడుకు అదే చేశాడు. రెండో కొడుకు నిండా మునిగి ఆస్తులన్నీ పోయి రోడ్డునపడ్డాడు. అందుకే అంటారుపెద్దలు కలిసి ఉంటే కలదు సుఖం అని.. అన్నయ్య ముఖేష్ అంబానీతో కలిసి ఉన్నన్నీ రోజులు అనిల్ అంబానీ దేశంలోని కోటీశ్వరుల్లో ఒకరు. విడిపోయి వేరుకుంపటి పెట్టుకొన్నాక అప్పుల పాలై ఇప్పుడు ఆస్తులన్నీ పాయి కోర్టులు, కేసులంటూ తిరుగుతూ సాధారణ జీవితం గడుపుతున్నాడు.

రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ కథనే ఇదీ.. ఆయన వ్యాపారాలు సవ్యంగా చేయలేక అప్పుల పాలయ్యారు. రిలయన్స్ ఇన్ ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు దాదాపు రూ.17వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్టు ఆరోపణలున్నాయి. కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్టు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈడీ కూడా మనీలాండరింగ్ కేసులు పెట్టింది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలోనే రిలయన్స్ గ్రూపులోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు చేసింది. పలువురు రిలయన్స్ అధికారులను, అనిల్ అంబానీని కూడా విచారింది. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది.

తాజాగా ఈడీ రూ.1120 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తాజాగా అధికారులు వెల్లడించారు. దాంతో ఈడీ ఇప్పటివరకూ ఆయనకు చెందిన రూ.10వేల కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసుకొని అనిల్ అంబానీని చావు దెబ్బ తీసినట్టైంది. ఈ అటాచ్ లో కీలకమైన ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్, ఫిక్స్ డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివి కూడా ఉన్నట్టు సమాచారం. అంటే అనిల్ అంబానీ వ్యక్తిగత సొమ్మును కూడా ఈడీ అటాచ్ చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఆస్తులన్నీ అటాచ్ కు పోయి అనిల్ అంబానీ నిండా మునిగారు. ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలోని అనిల్ అంబానీ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ కు చెందిన కొంత భూమిని ఈడీ అటాచ్ చేసింది. వీటితోపాటు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణే, ఠాణే, హైదరాబాద్, చెన్నై, తూర్పుగోదావరిలోని అనిల్ అంబానీ కంపెనీల నివాస, వాణిజ్య ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో అనిల్ అంబానీ మొత్తం ఆస్తులన్నీ ఈడీ గుప్పిట పట్టి ఆయనకు నిలువనీడలేకుండా చేసినట్టైంది.