వివాదాల సుడిగుండంలో ఎన్నికల సంఘం.. ఎందుకిలా?
కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రస్తుతం వివాదాల సుడిలో చిక్కుకుంది. వాస్తవానికి ప్రస్తుతమే కాదు.. గత ఐదారేళ్ల నుంచి కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
By: Garuda Media | 8 Aug 2025 10:44 AM ISTకేంద్ర ఎన్నికల సంఘం.. ప్రస్తుతం వివాదాల సుడిలో చిక్కుకుంది. వాస్తవానికి ప్రస్తుతమే కాదు.. గత ఐదారేళ్ల నుంచి కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఎప్పటికప్పుడు ఈ సంఘం తమపై వస్తున్న విమర్శలకు ప్రతిదాడి చేయడమే తప్ప.. సమాధానం చెప్పకపోవడం గమనా ర్హం. ప్రస్తుతం బీహార్‌లో ఇటీవల జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) వ్యవహారం మరింత కాక రేపుతోంది. దీనిపై రాజకీయ పార్టీల మాట ఎలా ఉన్నా.. అసోసియేషన్ ఫర్ డెమొక్కటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఎస్ ఐఆర్ ను వ్యతిరేకిస్తూ.. ఏడీఆర్ సహా 12 సంస్థలు/ వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్నాయి. వీటిపై ఈ నెల 12 నుంచి రెండు రోజుల పాటు.. సుదీర్ఘ వాదనలు కూడా జరగనున్నాయి. దీనికి కారణం.. ఏకంగా ఒకేసారి 65 లక్షల పైచిలుకు ఓటర్లను అనర్హులుగా ప్రకటించి, వారిని ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల సంఘం తప్పించడమే. ఇలా ఎక్కడా ఇప్పటి వరకు జరగకపోవడం కూడా మరో ప్రధాన కారణం. ఇక, ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఇలా చేసిందన్న విమర్శలు వస్తున్నాయి.
ఇక, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం 11 రకాల ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒక దానిని సమర్పించడం ద్వారా ఓటు హక్కు పొందేందుకు అర్హులని ప్రకటించింది. మరి తొలగించిన 65 లక్షల ఓటర్లకు ఈ కార్డులు లేవా? అన్నది సమస్య. మరో చిత్రం ఏంటంటే.. తొలగించిన వారి వివరాలను ఎన్నికల సంఘం గోప్యంగా ఉంచడం. దీనిని ఎవరికీ ఇవ్వలేమని ప్రకటించడం. ఇక, ఈ ఒక్క వివాదమే కాదు. ఈవీఎంలపై వస్తున్న సందేహాలను కూడా నివృత్తి చేసే విషయంలో ఎన్నికల సంఘం ససేమిరా అంటోంది.
ఈవీఎంలు కరెక్టేనని, వాటిని ఎవరూ మార్చలేరని చెబుతోంది తప్ప.. శాస్త్రీయంగా వాటిని నిరూపించే ప్ర క్రియకు మాత్రం ముందుకు రావడం లేదు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పంజాబ్, ఢిల్లీ సహా.. అనేక రాష్ట్రాల్లో గత నాలుగేళ్లలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు ప్రశ్నలు అలానే ఉన్నాయి. నిజానికి టీఎన్ శేషన్ తర్వాత.. గిల్ వంటివారు ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్లుగా చేసినప్పుడు.. ఎక్కడ ఎలాంటి సందేహం వచ్చినా.. వెంటనే వివరణ ఇచ్చేవారు. నిరూపించేవారు కూడా.
కానీ, ఇప్పుడు ఆ స్ఫూర్తి కొరవడడంతోనే ఎన్నికల సంఘం వివాదాల సుడిలో చిక్కుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధమైన సంస్థపై ఇలా వివాదాలు రావడం.. సమాధానం చెప్పక పోవడం మాత్రం ఇదే తొలిసారి. దీనిపై సుప్రీకోర్టు ఈ నెల 12 నుంచిచేపట్టే విచారణపై దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు ఎదురు చూస్తున్నారు. మరి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
