Begin typing your search above and press return to search.

బీహార్ ఎల‌క్ష‌న్‌: కేంద్ర ఎన్నిక‌ల సంఘం '17-ఫార్ములా'

దేశ ఎన్నిక‌ల రంగంలో ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం(సీఈసీ) బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచే ఈ సంస్క‌ర‌ణ‌ల అమ‌లును ప్రారంభించింది

By:  Garuda Media   |   7 Oct 2025 6:00 AM IST
బీహార్ ఎల‌క్ష‌న్‌: కేంద్ర ఎన్నిక‌ల సంఘం 17-ఫార్ములా
X

దేశ ఎన్నిక‌ల రంగంలో ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం(సీఈసీ) బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచే ఈ సంస్క‌ర‌ణ‌ల అమ‌లును ప్రారంభించింది. ఇప్ప‌టికే SIR (స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌) పేరుతో ఓట‌ర్ల జాబితాను స‌మూలంగా ప్ర‌క్షాణ‌న చేసింది. సుమారు 67 ల‌క్ష‌ల ఓట్ల‌ను జాబితాల నుంచి తొల‌గించింది. ఇది పెనువివాదానికి దారితీసిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర‌నేత‌.. ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్ర‌స్థాయిలో ఎన్నిక‌ల సంఘంపై నిప్పులు చెరిగారు. ఉద్దేశ పూర్వ‌కంగానే కాంగ్రెస్ అనుకూల ఓటు బ్యాంకును త‌ప్పిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

`ఓట్ చోరీ` చేస్తున్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల సంఘం త‌న పంథాను మార్చుకోలేదు. సంస్క‌ర‌ణ‌ల‌ను కూడా వెన‌క్కి తీసుకోలేదు. పైగా.. ఇప్పుడు `17-ఫార్ములా`తో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింది. త‌ద్వారా బీహార్ ఎన్నిక‌ల‌ను అత్యంత శాంతియుత పంథాలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ వెల్ల‌డించారు. అంతేకాదు.. 17-ఫార్ములా క‌నుక స‌క్సెస్ అయితే. దేశ‌వ్యాప్తంగా దీనిని అమ‌లు చేస్తామ‌న్నారు. దీనికి సంబంధించి బీహార్‌ను ప్ర‌యోగాత్మ‌క రాష్ట్రంగా భావిస్తున్న‌ట్టు తెలిపారు.

ఏంటా సంస్క‌ర‌ణ‌లు..

1. ఓటరుగా రిజిస్టరైన 15 రోజుల్లో ఓటర్ కార్డు డెలివరీ.

2. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు(ఓట‌ర్ల‌ను ఫోన్ల‌తో బూతుల్లోకి అనుమ‌తించ‌రు)

3. ప్రతి బూత్లో ఓటర్ల సంఖ్య 1500 నుంచి 1200కు తగ్గింపు(మ‌రింత పార‌దర్శ‌కంగా ఓటు హ‌క్కు వినియోగించే చాన్స్‌)

4. EVMలపై అభ్యర్థి కలర్ ఫొటో, పెద్ద సైజులో అక్షరాలు( త‌ద్వారా ఓటు వేసే వారికిఎలాంటి ఇబ్బంది ఉండ‌దు)

5. బూత్ అధికారి అధికారిక ID కార్డుతో ఉంటారు(దీంతో ఎవ‌రు అధికారో.. ఎవ‌రు కాదో తెలుసుకునే అవ‌కాశం)

6. ప్రతి బూత్లో 100% వెబ్ కాస్టింగ్(ఫ‌లితంగా అక్ర‌మాల‌కు చోటు లేకుండా చేసే అవ‌కాశం.)

7. బూత్ లెవల్ ఏజెంట్లు అందరికీ ట్రైనింగ్(గ‌తంలో కూడా శిక్ష‌ణ ఇచ్చినా.. ఇప్పుడు డిజిట‌ల్ ప‌రంగా శిక్ష‌ణ ఇచ్చారు)

8. బూత్ ఓట్ల లెక్కింపులో తేడాలుంటే అక్కడి VVPATలు కూడా లెక్కిస్తారు(ఇది ఫ‌స్ట్ టైమ్ చేసిన సంస్క‌ర‌ణ‌)

9. BLO, BLO సుపర్వైజర్లకి ట్రైనింగ్(ఇది కూడా ఫ‌స్ట్ టైమ్ నిర్ణ‌యం)

10. శాంతి భద్రతల నిర్వహణపై పోలీసులకు సెషన్స్

11. అక్రమ ఓటర్లను తొలగించేలా SIR(ఇక నుంచి దేశ‌వ్యాప్తంగా అమ‌లు)

12. పోలింగ్ సిబ్బందికి రెమ్యూనరేషన్ పెంపు(ఇది స‌హ‌జంగానే జ‌రుగుతుంది)

13. పోలింగ్ స్టేషన్ సులువుగా గుర్తించేలా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ రీడిజైనింగ్(అధునాత‌న విధానం అవ‌లంబిస్తారు)

14. ECIకి గల 40 వేర్వేరు ప్లాట్ ఫాంలను ECI.NET అనే సింగిల్ డెస్టినేషన్‌గా మార్పు( త‌ద్వారా ఫిర్యాదులు ఈజీ)

15. బూత్‌ల‌ నుంచి అభ్యర్థుల టేబుల్స్ దూరం 200 మీట‌ర్ల‌ నుంచి 100మీట‌ర్లకు తగ్గింపు(ఇది ఎప్ప‌టి నుంచో ఉన్న డిమాండ్‌)

16. ఎన్నికల తర్వాత ఎంతమంది ఓటేశారు, వారిలో పురుషులు, మహిళలు, ఇతరులు ఎందరో తెలుసుకునేలా సైట్లో డిజిటల్ ఇండెక్స్ ఏర్పాటు.(దీంతో లెక్క ప‌క్కాగా తెలుస్తుంద‌ని అభిప్రాయం)

17. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యేది. ఇకపై EVMలతో లెక్కింపు మొదలుపెడతారు.(ఇది ఫ‌స్ట్ టైమ్ సంస్క‌ర‌ణ‌)