సుప్రీంషాక్: దిగొచ్చిన ఎన్నికల సంఘం.. బిగ్ రిలీఫ్!
అంటే.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(సర్)లో ఓటు కోల్పోయిన వారు ఉన్నారని అనుకుందాం.. వారు తిరిగి ఓటు హక్కు పొందడం ఎలా?
By: Garuda Media | 4 Nov 2026 1:32 PM ISTకాంగ్రెస్ పార్టీ సహా విపక్షాల ఆందోళనలు ఒకవైపు, సుప్రీంకోర్టు ఆదేశాలు, వ్యాఖ్యలు మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటోంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. ఫాం-6 కింద కొత్తగా ఓటరుగా నమోదయ్యేందుకు అవకాశం కల్పిస్తూనే.. ఇలాంటివారిపై సెక్షన్ 31 కింద ఎలాంటికేసులు కూడా పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ సెక్షన్.. కేసులు పెట్టేందుకు అవకాశంక ల్పిస్తున్నా.. అవి నకిలీ ఓటర్లకు మాత్రమే వర్తిస్తాయి. కానీ ఎన్నికల సంఘం తగుదనమ్మా.. అంటూ.. కొన్నాళ్ల కిందట ఈ సెక్షన్‌ను అందరికీ వర్తింప చేసింది.
అంటే.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(సర్)లో ఓటు కోల్పోయిన వారు ఉన్నారని అనుకుందాం.. వారు తిరిగి ఓటు హక్కు పొందడం ఎలా? అంటే.. ఫాం-6 మాత్రమే వారికి గతి!. అయితే.. ఈ విషయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రెండు మాసాల కిందట కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి సర్ ప్రక్రియలో ఓటు కోల్పోయిన వారు.. ఫాం-6 కింద కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేస్తే.. అలాంటి వారిని గుర్తించి సెక్షన్ 31 కింద క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. ఈ వ్యవహారం అప్పటికే సర్ ప్రక్రియ ముగిసిన పంజాబ్, ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలకు, ఉద్యమాలకు కూడా దారితీసింది.
దీనిపై సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్ ప్రక్రియ పక్కాగా నిర్వహించినా.. ఓటుకోల్పోయినవారు ఫాం-6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. ఇలా ఎందుకు కేసులు పెడుతున్నారని నిలదీసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కేసులను తీవ్రంగా పరిగణించి.. ఉద్యమించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పాత జాబితాలో ఓటు హక్కు కోల్పోయిన వారు కూడా ఫాం-6 కింద దరఖాస్తు చేసుకుంటే.. పరిశీలించి ఓటు హక్కు కల్పించాలని.. అలాంటి వారిపై కేసులు పెట్టరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు సర్ ప్రక్రియ పూర్తయిన అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
అలానే.. ఒక ఓటరుకు రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే.. వాటిపై కూడా కేసులు పెట్టరాదని తేల్చి చెప్పింది. దీనిపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించాలని సూచించింది. స్థానికంగా వారికి అర్ధమయ్యే భాషలో వివరించడంతోపాటు.. ఏదో ఒక నియోజకవర్గంలోనే ఓటును కొనసాగించుకునే స్వేచ్ఛను కూడా వారికి ఇవ్వాలని పేర్కొంది. ఈ విషయంలోతలెత్తే వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ఆదేశించింది. కేసుల జోలికి పోరాదని తేల్చి చెప్పింది. మొత్తంగా తీవ్ర వివాదానికి దారితీసిన ఫాం-6పై ఇప్పటికే రెండు రూపాల్లో తన నిర్ణయాలను కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఫాం-6 దాఖలు చేసే వారు 2002 నాటి జాబితాలోని తమ తాతలు, పెద్దల ఓట్లను ఇవ్వాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు జోక్యంతో గతంలో వెనక్కి తీసుకోగా.. ఇప్పుడు కేసులు పెట్టరాదని నిర్ణయించడం గమనార్హం.
