Begin typing your search above and press return to search.

చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి.. బ‌తికున్న వారివి పోయాయి.. యాగీ ఎందుకు: ఎన్నిక‌ల సంఘం

ఈ సంద‌ర్భంగా..బీహార్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆర్జేడీ నేత మనోజ్ ఝా దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు.

By:  Garuda Media   |   12 Aug 2025 8:17 PM IST
చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి.. బ‌తికున్న వారివి పోయాయి.. యాగీ ఎందుకు: ఎన్నిక‌ల సంఘం
X

ఓట‌ర్ల జాబితా వ్య‌వ‌హారంపై చిత్ర, విచిత్ర వాద‌న‌లు చేస్తున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా సుప్రీంకోర్టుకే సంచ‌ల‌న విష‌యా న్ని చెప్పింది. ``చ‌చ్చిపోయిన‌వారు బ‌తికున్నార‌ని, బ‌తికున్న‌వారు చ‌చ్చిపోయార‌ని ఓట‌ర్ల జాబితాలో ఉంది. ఇది మేం కూడా గుర్తించాం. అయితే.. దీనిపై ఎందుకు యాగీ చేయ‌డం..? ఇది మార్చుకోవ‌చ్చు. ఇది పెద్ద విష‌యంకాదు.`` అని లైట్ తీసుకుం ది. ఈ మేర‌కు సుప్రీంకోర్టులోనే తాజాగా ఎన్నిక‌ల సంఘం త‌ర‌ఫున సీనియర్ న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ వ్యాఖ్యానించారు. ఈ వాద‌న‌ల‌తో విస్తుబోయిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం.. అలా కూడా చేస్తారా? అని ప్ర‌శ్నించారు. అయితే.. మిమ్మ‌ల్ని సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.

ఏం జ‌రిగింది?

ఈ ఏడాది చివ‌ర్లో బీహార్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఇక్క‌డ ముసాయిదా ఓట‌ర్ల జాబితాను ప్ర‌క‌టించారు. దీనిలో 65 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ను తొల‌గించారు. ఇది స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లోనే తొలిసారి అని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. ఈక్ర‌మంలో .. ప‌లువురు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. ఈ వ్య‌వ‌హారం ఏంటో తేల్చాల‌ని కోరారు. దీనిపై విచార‌ణ‌కు మంగ‌ళ‌, బుధ‌వారాల‌ను కేటాయించిన సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం సాయంత్రం 3 గంట‌ల‌కు ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా..బీహార్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆర్జేడీ నేత మనోజ్ ఝా దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు.

``ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ముసాయిదా జాబితాలో ఓ నియోజకవర్గంలో 12 మంది చనిపోయారని పేర్కొన్నారు. కానీ, వారంతా జీవించే ఉన్నారు. ఈ నెల‌లో వారు రేష‌న్ కూడా తీసుకున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కూడా అందుకున్నారు. ఇదిగో వారి వివ‌రాలు`` అంటూ.. ధ‌ర్మాస‌నానికి రుజువులు స‌మ‌ర్పించారు. దీంతో అవాక్క‌యిన ధ‌ర్మాస‌నం విష‌యంఏంట‌ని.. ఎన్నిక‌ల సంఘం త‌ర‌ఫున న్యాయ‌వాది ద్వివేదీని ప్ర‌శ్నించింది. దీంతో ఆయ‌న చిత్ర‌మైన వాద‌న వినిపించారు. ``ఈ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉంటాయి. చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్లు, జీవించి ఉన్నవారిని చనిపోయినట్లు ప్రకటించడం సాధార‌ణం. దీనిని స‌రిచేయొచ్చు. యాగీ చేయాల్సిన అవ‌స‌రం లేదు.`` అని వ్యాఖ్యానించారు.

దీనిపై ధ‌ర్మాస‌నం తీవ్రంగా స్పందిస్తూ.. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోమంటారా? అని ప్ర‌శ్నించింది. ముసాయిదా జాబితా లో పేర్కొన్న వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. చ‌నిపోయిన వారి ఓట్లు ఉండ‌డం, బ‌తికి ఉన్న‌వారి ఓట్లు తీసేయ‌డం.. మీకే సాధ్య‌మైంద‌ని వ్యాఖ్యానించింది. పార‌ద‌ర్శ‌క‌త లేమి స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని.. వ్యాఖ్యానించింది. ఇలాంటి త‌ప్పుల‌తో ప్ర‌జాస్వామ్యానికి ముప్పుకాదా? అని ప్ర‌శ్నించింది. కాగా.. బుధ‌వారం ఈ విచార‌ణ కొన‌సాగ‌నుంది.