Begin typing your search above and press return to search.

ఎన్నికల సంఘం సరికొత్త ఆలోచన.. ఇక ఈవీఎంలలో కలర్ ఫొటోలు..

భారత ఎన్నికల వ్యవస్థ ఎప్పటికప్పుడు సాంకేతికతను అనుసరించి ఓటింగ్ ను మరింత ఖచ్చితంగా నమ్మకంగా ఉండేందుకు దోహదం చేస్తోంది.

By:  Garuda Media   |   18 Sept 2025 3:37 PM IST
ఎన్నికల సంఘం సరికొత్త ఆలోచన.. ఇక ఈవీఎంలలో కలర్ ఫొటోలు..
X

భారత ఎన్నికల వ్యవస్థ ఎప్పటికప్పుడు సాంకేతికతను అనుసరించి ఓటింగ్ ను మరింత ఖచ్చితంగా నమ్మకంగా ఉండేందుకు దోహదం చేస్తోంది. తాజాగా బిహార్‌ ఎన్నికల నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లలో (ఈవీఎంలలో) అభ్యర్థుల కలర్‌ ఫొటోలు ప్రదర్శించాలని నిర్ణయించింది. నిర్ణయం ఈ దిశలో మరో ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. ఇప్పటి వరకు పార్టీ గుర్తులు, అభ్యర్థుల పేర్లతో పాటు నలుపు-తెలుపు ఫొటోలు ఉండగా, ఇకపై కలర్ ఫొటోలు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం సాంకేతిక అభివృద్ధి మాత్రమే కాక, ప్రజాస్వామ్య ప్రక్రియలో స్పష్టతను పెంచే చర్య.

గందరగోళం తగ్గించేందుకే..

గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులు తప్ప ఇతర సమాచారం ఓటర్లకు తెలియదు. చాలా మంది చదవలేని వారు కూడా ఉంటారు. వారికి కలర్‌ ఫొటోలు కనిపిస్తే తాము ఎన్నుకునే అభ్యర్థికే ఓటెస్తున్నామని తెలుస్తుంది. ఇది తప్పు బటన్‌ నొక్కే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. ఎన్నికల కమిషన్‌ దృష్టిలో ఇది ఒక సాధారణ మార్పు మాత్రమే అనిపించినా, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదన్న వాస్తవాన్ని గుర్తు చేస్తుంది. గందరగోళం తగ్గితే ఓటు విలువ మరింత బలపడుతుంది.

నమ్మకం పెంచే ప్రయత్నం

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రతపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓట్ల ట్యాంపరింగ్‌ ఆరోపణలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఈసీఐపై ఎప్పటికప్పుడు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో, కలర్‌ ఫొటోలు పెట్టడం వల్ల ఓటర్ల నమ్మకాన్ని పెంచవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. అభ్యర్థుల సీరియల్‌ నెంబర్లు మరింత స్పష్టంగా చూపించాలన్న నిర్ణయం కూడా పారదర్శకత పెంచే చర్య. ఈ మార్పులు చిన్నవి అనిపించినా, ఎన్నికల ఫలితాలపై అవి చూపే ప్రభావం గణనీయమనే చెప్పాలి.

ఈవీఎంలలో కలర్‌ ఫొటోలు మంచి ఆరంభం. కానీ ఎన్నికల వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసే అవసరం ఉంది. ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు, గ్రామీణ స్థాయిలో ఓటర్‌ ఎడ్యుకేషన్‌ క్యాంపులు, నగరాల్లో సాంకేతిక అవగాహన శిక్షణ అవసరం. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలుంటే, పారదర్శకంగా ఎదుర్కొని సమాధానం ఇవ్వడమే సరైన మార్గం. ఈసీఐ విశ్వసనీయత ఓటర్ల విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది.