హైఅలెర్ట్ : పెద్దపులి వచ్చింది.. రాజమండ్రికి సెలవు తెచ్చింది..
మంగళవారం రాత్రి రాజమండ్రి శివారులోని విశాఖపట్నం–విజయవాడ నేషనల్ హైవే పక్కన పెద్దపులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
By: A.N.Kumar | 4 Feb 2026 9:53 AM ISTఏపీలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి ప్రస్తుతం రాజానగరం మండలం పరిధిలో రాజమండ్రికి ఆనుకుని తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కొన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
మంగళవారం రాత్రి రాజమండ్రి శివారులోని విశాఖపట్నం–విజయవాడ నేషనల్ హైవే పక్కన పెద్దపులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో పులిని చూసిన వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అనంతరం పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనతో పరిసర కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. పులి జాడను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైతే పుణే నుంచి నిపుణులను రప్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పులి కనిపించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న కొబ్బరి తోటలో నివసిస్తున్న కుటుంబాన్ని ఇంట్లోనే ఉండాలని సూచించి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
గత నెల 20న కొయ్యలగూడెం ప్రాంతంలో పెద్దపులి కనిపించిందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 31న గోదావరి నదిని దాటి సీతానగరం వైపు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నెల 1న సీతానగరం మండలంలోని తొర్రేడు గ్రామంలో రెండు ఆవులు, ఒక దూడపై దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. 2న రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో పులి పాదముద్రలు లభించడంతో సంచారం నిజమేనని అధికారులు నిర్ధారించారు. 3న ఉదయం గాడాల ప్రాంతంలో పులి జాడను గుర్తించగా రాత్రికి ఆటోనగర్ మీదుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కొబ్బరి తోటలోకి వెళ్లినట్లు సమాచారం.
పెద్దపులి సంచారంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని ముఖ్యంగా పిల్లలను బయటకు పంపవద్దని హెచ్చరించారు. పులిని పట్టుకునే వరకు భద్రతా చర్యలు కొనసాగుతాయని అటవీశాఖ స్పష్టం చేసింది.
