జగన్ బర్త్ డే వేళ రప్పా.. రప్పా ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ సీజ్
గోదావరి జిల్లాల్లో పెను సంచలనంగా మారిన ‘రప్పా రప్పా’ ఫ్లెక్సీ ఉదంతానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.
By: Garuda Media | 23 Dec 2025 10:27 AM ISTగోదావరి జిల్లాల్లో పెను సంచలనంగా మారిన ‘రప్పా రప్పా’ ఫ్లెక్సీ ఉదంతానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు.. పార్టీ కార్యకర్తలు.. నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తెలుగురాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని ప్రదర్శించే గోదావరి జిల్లాల్లో జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని భారీ ఎత్తున ఫ్లెక్సీల హోరు కనిపించింది.
ఇలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అత్యంత వివాదాస్పద ఫ్లెక్సీని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామానికి చెందిన జగన్ అభిమానులు ఏర్పాటు చేశారు. షాకింగ్ వ్యాఖ్యలతో కూడిన ఈ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది. హ్యపీ బర్త్ డే జగనన్నా పేరుతో జగన్ ఫోటోలతో పాటు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను ఇందులో ఏర్పాటు చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే ముగ్గురు అభిమానులు సైతం తమ ఫోటోల్ని ఈ ఫ్లెక్సీలో ప్రింట్ చేయించుకున్నారు.
ఈ ఫ్లెక్సీలో.. ‘‘2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని’’ అంటూ పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీ సదరు గ్రామంలో సంచలనంగా మారింది. దీనిపై పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పలువురు గ్రామస్థులు.. టీడీపీ నేతలు పోలీసులకు ఈ ఫ్లెక్సీ మీద ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫ్లెక్సీని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన రాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ లో తయారు చేసినట్లుగా గుర్తించారు.
దీంతో ఈ ఫ్లెక్సీని తయారు చేసిన ప్రింటర్స్ తో పాటు.. దాన్ని ఏర్పాటు చేసిన ఆరుగురి పైనా కేసు నమోదు చేశారు. ఈ ఫ్లెక్సీని తయారుచేసిన ప్రింటింగ్ ప్రెస్ ను సీజ్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీని ప్రింట్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లుగా ద్వారకా తిరుమల ఎస్ఐ వెల్లడించారు.
