ఈ సండే...వెరీ షార్ట్ డే...భూగోళం మ్యాజిక్
ఈ ఆదివారం అంటే జూలై 26వ తేదీ మిగిలిన రోజులతో పోలిస్తే చాలా చిన్న రోజుగా సైంటిస్టులు చెబుతున్నారు.
By: Satya P | 26 July 2026 8:05 AM ISTఈ ఆదివారం అంటే జూలై 26వ తేదీ మిగిలిన రోజులతో పోలిస్తే చాలా చిన్న రోజుగా సైంటిస్టులు చెబుతున్నారు. అంటే ఈ ఆదివారం ప్రతీ రోజు కంటే 0.65 మిల్లీసెకన్లు ముందుగానే ముగిసిపోతుంది అని అంటున్నారు. సాధారణంగా భూమి తన అక్షం చుట్టూ ఒక పూర్తి భ్రమణాన్ని చేయడానికి 24 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ఆదివారం మాత్రం ఆ ఇరవై నాలుగు గంటల కంటే 0.65 మిల్లీసెకన్ల తక్కువగా భూమి చక్రభ్రమణం వేగంగా పూర్తి అవుతుందని సైటిస్టులు చెబుతున్నారు.
అలా ఎందుకు అంటే :
ఇదిలా ఉంటే టైమ్ అండ్ డేట్.కామ్ నివేదిక ప్రకారం చూస్తే భూమి తన అక్షంపై వేగంగా తిరగడం వల్ల ఈ ఏడాది జూలై 26న అత్యంత తక్కువ కాలం ఉండే రోజుగా ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ డేటా వెల్లడించింది. భూభ్రమణ వేగంలో మార్పులు అంతర్జాతీయ భూభ్రమణ సర్వీస్ వేస్తున్న అంచనాల ప్రకారం చూస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మార్పులు వస్తున్నాయి అని సైంటిస్టులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రికార్డు స్థాయిలో రోజుల పొడవు తగ్గుతూ వస్తున్నప్పటికీ ప్రస్తుతం భూమి వేగం మళ్లీ మందగించే ధోరణిలో ఉంది అని వారు గుర్తు చేస్తున్నారు. అటామిక్ క్లాక్‌ల ద్వారా ఈ సూక్ష్మ కాల వ్యత్యాసాలను శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కొలుస్తారు. భూమి వేగంగా తిరగడం వెనుక ఉన్న కారణాలు అనేకం ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశీలనలలో వెల్లడి అయింది.
మనిషి గుర్తించలేడు :
అయితే 0.65 మిల్లీసెకన్లు ముందుగానే రోజు ముగుస్తుంది అన్నది మనిషి గుర్తించలేడు. ఎందుకంటే కంటి రెప్ప పాటు కంటే తక్కువ కాలం అది. కానీ ఈ ప్రభావాన్ని అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు గురిస్తాయి. ఆ విధంగా వాటిపైన దీని ప్రభావం ఉంటుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే భూ భ్రమణ వేగం ఎప్పుడూ స్థిరంగా ఉండదని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, అలాగే భూమి అంతర్భాగంలోని ద్రవ కదలికలు ఇంకో వైపు వాతావరణ పరిస్థితులు వంటి అనేక అంశాలు భూ భ్రమణం మీద నిరంతరం ప్రభావం చూపుతాయని అంటున్నారు.
భూమి వేగంలో హెచ్చు తగ్గులు :
ఇదిలా ఉంటే గత ఆరేళ్ళ భూమి తమ భ్రమణ వేగాన్ని బాగా పెంచుకుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2020 నుంచి చూస్తే అనేక సార్లు ఈ విధంగా చిన్న నిడివి కలిగిన రోజులు ఎక్కువగా నమోదు అయ్యాయని వారు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది భూమి వేగంగా తిరిగి రోజును ముగించిన తేదీగా 2025 జూలై 10ని సైటిస్టులు గుర్తించి నమోదు చేశారు. సాధారణ 24 గంటల కంటే కూడా 1.37 మిల్లీసెకన్లు తక్కువగా భూమి ఆ రోజును ఎండ్ చేసింది. కానీ ఈసారి అంటే 2026 జూలై 26న అంతకంటే ఎక్కువ తక్కువగానే భూభ్రమణం సాగుతోందని అందుకే ఏకంగా ఈసారి 0.65 మిల్లీసెకన్లు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతే కాదు గత దశాబ్దంలో అత్యధిక వేగాన్ని భూమి ఇప్పటికే దాటిందని మాస్కో స్టేట్ యూనివర్సిటీ నిపుణుడు లియోనిడ్ జోటోవ్ చెబుతున్నారు.
దీర్ఘకాలంలో వేగం తగ్గుతోంది.
ఈ రోజున భూమి వేగంగా తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నా దీర్ఘకాలంలో దాని భ్రమణ వేగం క్రమంగా తగ్గుతోందని కూడా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. దానికి వాతావరణ మార్పులతో పాటుగా ధ్రువాల వద్ద మంచు కరిగిపోవడం అలాగే ఆ నీరు భూమధ్యరేఖ వైపుగా విస్తరించడం కూడా కీలకమైన కారణాలుగా చెబుతున్నారు. ఇక ఈ మార్పు చూస్తే ప్రతీ శతాబ్దానికి 1.33 మిల్లీసెకన్ల చొప్పున జరుగుతోందని ఇక గత 3.6 మిలియన్ ఏళ్లలో ఇది అత్యధికమని వియన్నా జూరిచ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలుతున్న విషయంగా ఉంది. అయితే ఈ షార్ట్ డేస్ అలాగే భూ భ్రమణంలో వచ్చే మార్పుల వల్ల జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్ వంటి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌లు ప్రభావితం అవుతాయని అంటున్నారు. ఇవన్నీ కూడా భూమి కచ్చితమైన భ్రమణ స్థితిపై ఆధారపడి పనిచేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. అందువల్ల భూమి వేగంలో వచ్చే అత్యంత స్వల్ప తేడాలు కూడా వీటిలో పెను మార్పులకు దారితీస్తాయని అంటున్నారు.
