ఈ20 పెట్రోల్ భయం: లీటరు రూ.170 పెట్టి ‘స్వచ్ఛమైన’ ముక్తి పొందుతున్న వాహనదారులు
దేశంలో పచ్చదనం పెరగాలి... కాలుష్యం తగ్గాలి... చమురు దిగుమతులు తగ్గి దేశ సంపద మిగలాలి.
By: A.N.Kumar | 3 July 2026 8:55 AM ISTదేశంలో పచ్చదనం పెరగాలి... కాలుష్యం తగ్గాలి... చమురు దిగుమతులు తగ్గి దేశ సంపద మిగలాలి. ఎంత అద్భుతమైన ఆశయాలు.. ఇందుకోసం మన పాలకులు కనిపెట్టిన బ్రహ్మాండమైన ప్లానే E20 పెట్రోల్.. అదేనండీ... 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్. అయితే, పాలకుల పర్యావరణ ప్రేమేమో గానీ, రోడ్ల మీద 2023 కంటే ముందు తయారైన పాత బండ్లను వేసుకుని తిరిగే సామాన్యుడి గుండెల్లో మాత్రం ఇప్పుడు ‘ఇథనాల్’ రైళ్లు పరిగెడుతున్నాయి.
సాధారణ పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల ఇంజిన్ భాగాలు కరిగిపోతాయేమో మైలేజీ ముక్కలైపోతుందేమో, రేపో మాపో బండి నడిరోడ్డుపై మొరాయిస్తుందేమో అన్న భయంతో వాహనదారులు వణికిపోతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, రీల్స్ ఈ భయాన్ని కాస్తా ‘భీభత్సం’గా మార్చేశాయి. ఫలితంగా... ఇప్పుడు కొందరు వాహనదారులు ఒక వింత మార్గాన్ని ఎంచుకున్నారు. అదే లీటరు రూ.170 ధర పలికే సూపర్ ప్రీమియం 100 ఆక్టేన్ పెట్రోల్
లీటరు రూ.170... ఇంజన్ సేఫ్, జేబు గుల్ల!
"నా బండి ప్రాణం పోయినా పర్లేదు కానీ, నా పాత ఇంజిన్‌కు మాత్రం ఇథనాల్ సోకకూడదు" అనే రేంజ్‌లో ఖరీదైన కార్లు, స్పోర్ట్స్ బైకులు, సెంటిమెంట్ పాత బండ్లు ఉన్నవాళ్లు బంకుల ముందు క్యూ కడుతున్నారు. ఈ సూపర్ ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం ఉండదట.. ఇది అచ్చమైన, స్వచ్ఛమైన ‘అమృతం’ లాంటి పెట్రోల్ అట!
ట్విస్ట్ ఏంటంటే సామాన్యుడు లీటరు రూ.100 కట్టడానికే ఇల్లాలు తాళిబొట్టు తాకట్టు పెట్టాలా అని ఆలోచిస్తుంటే, ఇక్కడ ఇంజిన్ భద్రత కోసం లీటరుకు రూ.170 సమర్పించుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. "స్వచ్ఛమైన గాలి పీల్చాలన్నా, స్వచ్ఛమైన పెట్రోల్ కొట్టించాలన్నా... రేపు పొద్దున కిడ్నీలు అమ్ముకోవాల్సిందేలా ఉంది" అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
అసలు నిజం ఎంత? అపోహ ఎంత?
ప్రభుత్వ లక్ష్యాలు, పర్యావరణ ప్రయోజనాలు పక్కన పెడితే... ఈ20 పెట్రోల్ వల్ల పాత బండ్లన్నీ రేపే నాశనమైపోతాయనే ప్రచారంలో నిజం కంటే అతిశయోక్తే ఎక్కువ ఉందని ఆటోమొబైల్ నిపుణులు నవ్వుతున్నారు. ఈ20 వల్ల ప్రతి పాత వాహనానికి కచ్చితంగా నష్టం జరుగుతుందనేదానికి ఎలాంటి గ్యారెంటీ లేదు. కాకపోతే వాహనం మోడల్, దాని ఇంజిన్ కండిషన్‌ను బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చు. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఫేక్ ఫార్ములాలను నమ్మి లీటరుకు రూ.170 తగలేసే కంటే, మీ బండి ఏ కంపెనీదో... ఆ కంపెనీ ఇచ్చిన అధికారిక మార్గదర్శకాలను ఒక్కసారి చదివితే పుణ్యం ఉంటుంది.
ప్రభుత్వం ఏం చేయాలి?
ఇలాగే వదిలేస్తే సామాన్యుడు పెట్రోల్ కొనలేక బండిని ఇంట్లోనే షోపీస్‌లా పెట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు కేవలం "ఇథనాల్ కలిపాం... పండగ చేసుకోండి" అని ప్రకటించడమే కాకుండా పాత బండ్ల యజమానుల్లో ఉన్న భయాలను పోగొట్టేలా గట్టిగా అవగాహన కల్పించాలి. లేదంటే బంకుల్లో సాధారణ పెట్రోల్ కొట్టించేవాడిని పాపాత్ముడిలా రూ.170 ప్రీమియం పెట్రోల్ కొట్టించేవాడిని పుణ్యాత్ముడిలా చూసే విచిత్ర పరిస్థితి సమాజంలో తలెత్తడం ఖాయం!
