కార్లు బైకులు షెడ్డుకేనా...ఈ 20 షాకిస్తుందా ?
గల్ఫ్ యుద్ధం ముందు నుంచే కేంద్రం ఇంధనం దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవాలని నిర్ణయించింది.
By: Satya P | 31 March 2026 9:47 AM ISTగల్ఫ్ యుద్ధం ముందు నుంచే కేంద్రం ఇంధనం దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇపుడు గల్ఫ్ యుద్ధం జరుగుతోంది. దాంతో చమురు దిగుమతులకు ఎంతో కష్టం అవుతోంది. ఈ నేపధ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయాలను మరింత సీరియస్ గా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో గతంలోనే ఆమోదించి అమలు చేయాలని నిర్ణయించిన ఈ 20 పెట్రోల్ మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని పెట్రోల్ బంకులలో ఈ 20 పెట్రోల్ నే సరఫరా చేయబోతున్నారు. దాంతో ఈ 20 మీద రకరకాలైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఆందోళనలు కలుగుతున్నాయి.
వాహనాలకు దెబ్బేనా :
పెట్రోల్ వినియోగంలో భారీ మార్పు దిశగా అడుగులు వేయాలని కేంద్రం చూస్తోంది. దాంతో ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో కేవలం ఈ20 పెట్రోల్ మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో ఈ20 పెట్రోల్ వినియోగం పాత వాహనాలకు ఏ మాత్రం సరిపడదని ఆటోమొబైల్ ఫీల్డ్ కి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పాత వాహనాలలోని ఇంజన్లకు సమస్యలు వస్తాయని అంటున్నారు అయితే ఈ సమస్యలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ 20 పెట్రోల్ వైపే మొగ్గు చూపుతోంది అని అంటున్నారు.
అసలు తేడా ఏంటి :
ఈ 20 కి సాధారణ పెట్రోల్ కి మధ్య తేడా ఏంటి అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. ఈ 20 అంటే అందులో 80 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటే మిగిలిన 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్ ని చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి తీసే ఆల్కహాల్ మిశ్రమంగా చెబుతారు. నిజానికి చూస్తే ఇప్పటిదాకా మనం వాడే పెట్రోల్‌లో అయిదు నుంచి పది శాతం మాత్రమే ఇథనాల్ ఉంటుంది. అయితే ఈ శాతం నేరుగా 20కి పెంచడం వల్ల పెట్రోల్ యొక్క ఆక్టేన్ నంబర్ పెరుగుతుందని అంటున్నారు. ఇది మైలేజీని సుమారు 3 నుంచి 6 శాతం తగ్గించవచ్చు అని చెబుతున్నారు.
వాటికే సమస్యలు :
కొత్త వాహనాలు అంటే 2023 తరువాత మార్కెట్ లోకి వచ్చిన వాటికి ఈ 20 వల్ల ఇబ్బంది లేదు కానీ పాత వాహనాలకు మాత్రం ఇంజిన్ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ వాహనాలు ఈ 20 కోసం డిజైన్ చేయబడకపోవడమే దానికి ప్రధాన కారణంగా ఉంది పాత వాహనాలలోని ఇంజన్ ఇథనాల్ గాలిలోని తేమను త్వరగా పీల్చుకుంటుంది. దాంతో మెటల్ ట్యాంకులు, ఫ్యూయల్ లైన్లు తుప్పు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రబ్బరు భాగాలు దెబ్బతినడం జరుగుతుందని అంటున్నారు. ఇథనాల్ ఒక ద్రావణిలాగా పనిచేయడమే ఇందుకు కారణం. దాంతో పాత వాహనాల్లో ఉండే రబ్బరు గొట్టాలు అలాగే సీల్స్, గ్యాస్కెట్లు ఈ20 పెట్రోల్ వల్ల మెత్తబడడం లేదా గట్టిపడి త్వరగా పాడవడం జరుగుతాయని అంటున్నారు.
ఎన్నో ఇబ్బందులు :
అంతే కాదు ఇథనాల్ ట్యాంకులో పేరుకుపోయిన పాత వ్యర్థాలను కరిగించి ఫ్యూయల్ ఫిల్టర్ లేదా ఇంజెక్టర్ల దగ్గర అడ్డుపడేలా చేస్తుందని అంటున్నారు. దీంతో ఆయా వాహనాలు ఆగిపోవడం లేదా స్టార్టింగ్ ట్రబుల్ రావచ్చునని చెబుతున్నారు. అయినా సరే ఈ20 పెట్రోల్ పట్ల కేంద్రం మొగ్గు చూపడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఈ 20 పెట్రోల్ ని వినియోగిస్తే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. దేశంలోని ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి ద్వారానే వస్తోంది. అయితే పెట్రోల్ లో ఇథనాల్ కలపడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది అని చెబుతున్నారు. ఈ మొత్తంలో ఇప్పటికే సుమారు 1.44 లక్షల కోట్లు ఆదా అయినట్లు అంచనా ఉందిట.
రైతులకు మేలు :
అంతే కాదు దేశంలోని రైతులకు మేలు చేసేదిగా ఈ విధానం ఉంది అని అంటున్నారు. ఇథనాల్ తయారీకి చెరకు మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యం వాడతారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే ఇథనాల్ బ్లెండింగ్ వల్ల కార్బన్ ఉద్గారాలు 30 శాతం మేర తగ్గి పర్యావరణం కూడా బాగుంటుంది అని అంటున్నారు.
పాత వాహనాల సంగతి :
మరి కేంద్రం ఇంతలా పట్టుబట్టి ఈ 20 పెట్రోల్ ని తీసుకుని వస్తూంటే పాత వాహనదారులు ఏమి చేయాలి అంటే ఇబ్బందులు పెరగకుండా చూసుకోవడమే అని అంటున్నారు. పాత వాహనాలు కలిగిన వారు పెట్రోల్ ట్యాంకులో తేమ చేరకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంతే కాదు ఎక్కువ రోజులు వాహనాన్ని వాడకుండా ఉంచితే ఈ 20 పెట్రోల్ తో పార్టులు పాడయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పాత వాహనాలకు సంబంధించి ఇథనాల్ రెసిస్టెంట్' విడిభాగాలు మార్చుకోవడం కూడా మరో పరిష్కారం అని అంటున్నారు. ఈ రోజుకి ఈ 20 అంటున్న ప్రభుత్వం రేపు ఈ 25 అనవచ్చు. అంటే మరింతగా ఇధనాల్ శాతం పెంచడం అన్న మాట. దాంతో అందరూ ఈ 20 పెట్రోల్ వినియోగానికి అలవాటు అయినా పడాలి లేదా పాత వాహనాలు షెడ్డుకైనా తరలించాలని అంటున్నారు.
