ఏమిటీ ఈ20 రచ్చ? మోడీ సర్కారు చేస్తున్న తప్పేంటి?
తాజాగా ఇ20 పెట్రోల్ లో అధిక క్లోరైడ్ స్థాయిలు ఉన్నాయని.. దీని కారణంగా వాహన ఇంజిన్ భాగం శాశ్వితంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది.
By: Garuda Media | 5 Aug 2026 1:01 PM ISTబలంగా ఉన్నప్పుడు బలహీనతలు పక్కన పడి ఉంటాయి. ఎప్పుడైతే బలహీనతలు ఎక్కువ అవుతుంటాయి అప్పటివరకు వెన్నంటి ఉన్న బలాలు తగ్గిపోతుంటాయి. ఈ తీరు వ్యక్తుల విషయంలోనే కాదు వ్యవస్థల విషయంలోనూ కనిపిస్తుంది. అత్యంత శక్తివంతమైన ప్రభుత్వంలో జరిగే తప్పులు.. దొర్లే లోపాలు సదరు ‘శక్తి’ భారీగా ఉన్నంత కాలం ఫర్లేదన్నట్లుగా ఉంటాయి. ఎప్పుడైతే సదరు పవర్ ఫుల్ ప్రభుత్వంలో ‘పవర్’ తగ్గే కొద్దీ అప్పటివరకు నామమాత్రంగా ఉండే లోపాలు పెద్ద సమస్యలుగా మారి.. ప్రభుత్వానికి రావాల్సిన చెడ్డపేరుకు వంద రెట్లు ఎక్కువ డ్యామేజ్ ను తీసుకొస్తుంటాయి. పదమూడేళ్లు అప్రతిహతంగా సాగుతున్న మోడీ సర్కారు ఇప్పుడు అలాంటి ఫేజ్ లోకి అడుగు పెట్టిందా? అన్నది ప్రశ్నగా మారింది.
చూస్తుండగానే పేపర్ లీకేజీ ఇష్యూ ఎంతలా పెరిగి పెద్దదై.. చివరకు మోడీ సర్కారుకు ఊపిరి తీసుకోనట్లుగా మారిందో.. చాప కింద నీరు మాదిరి ఈ20 ఇష్యూ అలానే తయారవుతుందన్న వాదన మొదలైంది. ఇంతకూ ఈ ‘‘ఇ20’’ ఏంటి? కొంతకాలం క్రితం ఇ5గా ఉన్నప్పుడు లేని పంచాయితీ.. ఆ తర్వాత ఇ10గామారినప్పుడు లేని రచ్చ.. ఇప్పుడే ఎందుకు ఎక్కువ అవుతోంది? ఈ అంశాన్ని.. దాని కారణంగా రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను మోడీ సర్కారు సరిగా అంచనా వేస్తుందా? లేదా? అసలేం జరుగుతోంది? తీసుకోవాల్సిన చర్యలేంటి? సమస్య మూలాలేంటి? అన్న విషయంలోకి వెళితే ఎన్నో అంశాలు తెర మీదకు వస్తాయి.
ఇక్కడో విషయాన్ని మీకు చెప్పాలి. ఈ అంశాన్ని వివరించే క్రమంలో లోతైన సాంకేతిక అంశాల్లోకి వెళ్లకుండా.. సూటిగా.. స్పష్టంగా.. ఇట్టే అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాం. దీని కారణంగా అసలు సమస్యను ఇట్టే అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. దాదాపు 23 ఏళ్ల క్రితం పెట్రోల్ ను ముడి చమురు నుంచి శుద్ధి చేసి అమ్మేవారు. ఆ తర్వాత సదరు పెట్రోల్ లో ఒక మోతాదులో ఇథనాల్ ను కలిపి అమ్మే ప్రక్రియను తీసుకొచ్చారు. దాన్నే ఇ5 పెట్రోల్ అనేవారు. అంటే.. లీటరు పెట్రోల్ లో 5 శాతం ఇథనాల్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
పెట్రోల్ లో ఇథనాల్ ను కలపాల్సిన అవసరం ఏంటి? ఎందుకీ నిర్ణయాన్ని తీసుకున్నారు? అన్న ప్రశ్నకు కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయటం.. కాలుష్యాన్ని తగ్గించటం ద్వారా పర్యావరణానికి మేలు చేయటం.. ఇథనాల్ వినియోగం పెంచటం ద్వారా రైతులకు మేలు చేయటంగా చెప్పాలి. అంతేకాదు.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు దేశీయంగా ఇంధన లభ్యతను పెంచటమే లక్ష్యంగా 2003లో ఇ5 పెట్రోల్ పేరుతో దీన్ని అమ్మటం మొదలు పెట్టారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా 9 రాష్ట్రాలు.. నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5శాతం ఇథనాల్ కలిపేలా నిర్ణయం తీసుకున్నారు.
ఆ తర్వాత నేషనల్ పాలసీ ఆన్ బయో ఫ్యూయల్స్ 2018ని తీసుకొచ్చారు. దీని ప్రకారం 2030 నాటికి పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలపటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే.. ఇ20 పెట్రోల్ అన్నమాట. ముందుగా అనుకున్న 2030నాటి లక్ష్యాన్ని ఐదేళ్లు ముందుకు జరిపి.. 2025-26 నాటికి దేశ వ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండ్లింగ్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఆరంభంగా 2023లో బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో ఎంపిక చేసిన 11 రాష్ట్రాల్లోని 84 పెట్రోల్ బంకుల్లో ఈ ‘ఇ20’ పెట్రోల్ అమ్మకాల్ని అధికారికంగా ప్రారంభించారు. పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్ ఎలా చేస్తారు? అనే దాని కంటే ముందు.. ఇంతకూ ఈ ఇథనాల్ ను ఎలా తయారు చేస్తారు? అన్న విషయంలోకి వెళితే మరింత బాగా విషయాలు అర్థమవుతాయి.
ఇథనాల్ ను ప్రధానంగా చెరుకు రసం.. మొలాసిస్.. పాడైన తృణధాన్యాల నుంచి తయారు చేస్తారు. దీని కారణంగా రైతులకు తమ పంట వ్యర్థాలకు సైతం మంచి ధర లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు దోహదపడుతుంది. ఇంతకూ పెట్రోల్ లో ఇథనాల్ కలపాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైందన్న విషయంలోకి వెళితే 1826లో అమెరికాకు చెందిన శ్యామ్యయూల్ మోరీ అనే పెద్ద మనిషి ఆల్కహాల్ తో నడిచే ఇంజిన్ ను తయారు చేశారు. 1876లో ఆధునిక ఫోర్ స్ట్రోక్ ఇంజన్ పితామహుడు నికోలస్ ఒట్టో తన ఇంజన్ లో ఇథనాల్ ను ఇంధనంగా వాడారు.
కట్ చేస్తే.. 1908లో ప్రపంచంలోనే దిగ్గజ కార్ల తయారీదారు హెన్రీ ఫోర్డ్ తన ప్రసిద్ధ ‘మోడల్ టి’ కారును పెట్రోల్ తో పాటు ఇథనాల్ రెండింటితోనూ నడిచేలా రూపొందించారు. ఇదే ప్రపంచపు తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికిల్ గా చెప్పాలి. 1920 - 30లలో పెట్రోల్ లో ఇథనాల్ ను కలపటం ద్వారా ఇంజన్ నాకింగ్ తగ్గించొచ్చన్న ఆలోచన మొదలైంది. అయితే.. అధికారికంగా, చట్టబద్ధమైన నిబంధనలతో ఇథనాల్ బ్లెండింగ్ ను పెద్ద ఎత్తున ప్రారంభించటమే కాదు.. సక్సెస్ చేసిన తొలి దేశంగా బ్రెజిల్ ను చెప్పాలి.
ఇందులో భాగంగా 1931లోనే బ్రెజిల్ తన దేశీయ చక్కెర పరిశ్రమను ఆదుకోవటానికి దిగుమతి చేసుకునే పెట్రోల్ లో 5 శాతం ఇథనాల్ కలపటాన్ని తప్పనిసరి చేసింది. మనం ఈ దిశగా అడుగులు వేయటానికి 2003 వరకు పట్టింది. 1973లో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం వేళ.. బ్రెజిల్ 1975లో నేషనల్ ఆల్కహాల్ ప్రోగ్రాం ఒకటి షురూ చేసింది. బ్రెజిల్ సైంటిస్టులు కేవలం ఇథనాల్ తో నడిచే వాహనాల్ని.. పెట్రోల్ - ఇథనాల్ ఏ నిష్పత్తిలో ఉన్నా నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్ని విజయవంతంగా డెవలప్ చేశారు. ప్రస్తుతం బ్రెజిల్ లో అమ్మే పెట్రోల్ లో కనీసం 27 శాతం ఇథనాల్ అంటే ఇ27 పెట్రోల్ చట్టబద్దంగా ఉంది.
అయితే.. ఇంత బ్లెండ్ లో పెట్రోల్ లో ఇథనాల్ వినియోగించినప్పటికి ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేలా వాహన ఇంజన్లను తయారు చేయటం.. పెట్రోల్.. ఇథనాల్ బ్లెండ్ చేసిన తర్వాత వాటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పెట్రోల్ బంకుల్ని సిద్ధం చేశారు. మన దగ్గర ఈ రెండు అంశాలే అతి పెద్ద సమస్యగా చెప్పాలి. అప్పుడెప్పుడో.. అంటే దాదాపు యాభై ఏళ్ల క్రితం టెక్నాలజీ పరిమితంగా ఉన్నవేళలోనే విజయవంతంగా చేసిన పనిని.. మనం ఇప్పుడు చేయటానికి కిందా మీదా పడుతున్న దుస్థితి.
మళ్లీ మన వద్దకు వస్తే 2003లో ఇ5తో మొదలైన పెట్రోల్.. అది కాస్తా ఇ10కు పెంచారు. 2022 జూన్ నాటికి దేశ వ్యాప్తంగా అమ్మే పెట్రోల్ లో సగటున 10 శాతం ఇథనాల్ కలిపే ప్రక్రియను విజయవంతంగా అమలు చేశారు. ఆ తర్వాత దీన్ని 20 శాతానికి పెంచి ఇ20 పెట్రోల్ అమ్మేలా ప్లాన్ చేశారు. పెట్రోల్ లో ఇథనాల్ శాతం 5 నుంచి 10 శాతం ఉన్నంతవరకు వాహన ఇంజిన్లలో ఎలాంటి సమస్యలు రాలేదు. ఎప్పుడైతే ఇ20కు చేరువైందో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి.
దీనికి ప్రధాన కారణంగా 2023 ఏప్రిల్ కంటే ముందు తయారైన పాత వాహనాల ఇంజిన్లు ఇ20 ఇంధనాన్ని తట్టుకునేలా డిజైన్ చేయకపోవటమే అతి పెద్ద సమస్య. ఇథనాల్ ను సింఫుల్ గా చెప్పాలంటే ఒకలాంటి ఆల్కహాల్. దీన్ని పెట్రోల్ లో 20 శాతం వరకు వినియోగిస్తే.. ఆ పెట్రోల్ పోయించుకున్న తర్వాత పాత వాహనాల్లోని రబ్బరు పైపులు.. ప్లాస్టిక్ విడిభాగాలు త్వరగా కరిగేలా చేస్తుంది. అంతేకాదు స్పేర్ పార్ట్స్ ను తప్పు పట్టేలా చేస్తుంది. అన్నింటికి మించి 2023 ఏప్రిల్ ముందు తయారు చేసిన వాహనాలు ఏవీ బీఎస్6 ఫేజ్ 2 (ఈ20కు సూట్ అయ్యేలా ఇంజిన్ ఉండటం) నిబంధనల ప్రకారం తయారైన కొత్త వాహనాలు మాత్రమే ఈ ఇంధనానికి అనుకూలంగా ఉంటాయి.
అందుకు భిన్నంగా అంటే.. పాత వాహనాల్లో ఈ ఇ20 పెట్రోల్ పోయిస్తే.. నాణ్యతా లోపాలు తలెత్తే పరిస్థితి. దీంతో వాహనదారులు మాత్రమే కాదు.. భారతీయ ఆటో మొబైల్ రంగానికి చెందిన అత్యున్నత అధికారిక సంస్థను సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫాక్చరర్స్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భారతదేశంలో కార్లు.. బైకులు.. లారీలు లాంటి వాహనాలు.. వాటి ఇంజన్లను తయారు చేసే ప్రముఖ కంపెనీలన్నీ ఇందులో సభ్యులుగా ఉంటాయి.
తాజాగా ఇ20 పెట్రోల్ లో అధిక క్లోరైడ్ స్థాయిలు ఉన్నాయని.. దీని కారణంగా వాహన ఇంజిన్ భాగం శాశ్వితంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర పెట్రోలియం శాఖకు రాసింది. అదే సమయంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ రిటైల్ బంకుల్లో నాణ్యతా నియంత్రణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. సియామ్ ఆందోళనపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు క్రమం తప్పకుండా ఇంధన నాణ్యతను పరీక్షిస్తున్నట్లుగా వెల్లడించింది.
ఇ20 కారణంగా ఇంధన ఇంజెక్టర్లు.. ఇంధన పంపులు.. ఈజీఆర్ వాల్వులు.. ఎగ్జాస్ట్ వ్యవస్థలతో పాటు ఇతర విడి భాగాల్లో సమస్యలు తలెత్తుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సియామ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్దకు తరచూ సమస్యలతో వస్తున్న విడిభాగాల్ని పరీక్షించినప్పుడు మోతాదుకు మించిన క్లోరైడ్ శాతం ఉన్న విషయాన్ని తమ సిబ్బంది గుర్తించినట్లుగా పేర్కొంటూ ఈ ఇష్యూను వెంటనే పరిష్కరించాలన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇ20 అమలైన తర్వాతనే క్లోరైడ్ సంబంధిత సమస్యలు వస్తున్నట్లుగా సియామ్ ఆరోపిస్తోంది. ఇ20 పెట్రోల్ లో అదనపు తేమ శాతమే దీనంతటికి కారణంగా చెబుతున్నారు.
ఇథనాల్ కు ఒక అవలక్షణం ఉంటుంది. అదేమంటే.. దేనినైనా కరిగించే గుణం. ఈ కారణంగానే 2023 ఏప్రిల్ కు ముందు వాహన మోడల్స్ లో సాధారణ రబ్బరు గొట్టాలు.. ప్లాస్టిక్స్ సీల్స్.. కార్బ్యురేటర్లు ఇథనాల్ దెబ్బకు కరిగిపోయే లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత తయారు చేసిన వాటిని.. ఇథనాల్ కు తట్టుకునేలా రూపొందించారు. అంతకు ముందున్న వాహనాల్లో ఇ20 పెట్రోల్ పుణ్యమా అని పలు విడిభాగాలు కరిగిపోతూ ఇంధన వ్యవస్థలో అడ్డంకులకు కారణమై.. తరచూ రిపేర్లు అయ్యే పరిస్థితి.
సియామ్ ఆందోళనపై తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షలు జరుపుతున్నట్లుగా వెల్లడించింది. దేశంలో 87వేలకు పైనే ఉన్న బంకుల్లో రోజుకు 8-12 సార్లు నీటి శాతం పరీక్షలు జరుపుతున్నట్లుగా చెబుతూ.. 2వేలకు పైనే శాంపిళ్లలో క్లోరైడ్ సల్ఫైడ్ కారకాల కోసం పరీక్షిస్తే కేవలం రెండు కేసుల్లోనే క్లోరైడ్ అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. సదరు రెండు అవుట్ లెట్లలో పెట్రోల్ అమ్మకాలను తక్షణం నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. నాణ్యత విషయంలో రాజీ లేదని.. తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
ప్రభుత్వం మరింత కచ్ఛితంగా ఉన్నప్పుడు సమస్యలు ఎక్కడ వస్తున్నాయి? అన్న విషయంలోకి వెళితే.. బోలెడన్ని అంశాలు తెర మీదకు వస్తాయి. ఇథనాల్ సహజంగానే గాలిలోని తేమను.. నీటిని త్వరగా ఆకర్షిస్తుంది. పెట్రోల్ బంకుల్లోని అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో తేమ శాతం పెరిగితే ఫేజ్ సెపరేషన్ జరుగుతుంది. అంటే.. పెట్రోల్ నుంచి ఇథనాల్.. నీరు విడిపోయి ట్యాంక్ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఇలాంటి సందర్భంలో కొన్నిసార్లు కొన్ని బంకుల్లో పెట్రోల్ లో నీళ్లు కలిపి అమ్ముతున్నారంటూ ఆందోళనలు తెర మీదకు రావటం గుర్తుండే ఉంటుంది. నిజానికి ఏ పెట్రోల్ బంకు యజమాని పెట్రోల్ లో నీళ్లు పోసి అమ్మి.. సమస్యల్ని కొని తెచ్చుకోడు. అసలు సమస్య ఇప్పుడు చెప్పిందే. ఈ అంశం మీద అవగాహన లేక అలా మాట్లాడుతుంటారు.
ఇథనాల్ రవాణా.. నిల్వ చేసే ప్రక్రియలలో నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం తగ్గినా ఇంధనంలోని క్లోరైడ్ స్థాయిలు విపరీతంగా పెరుగుతుంటాయి. దీని కారణంగానే వాహనాల్లోని ఇంజిన్.. ఇతర విడి భాగాలు త్వరగా పాడై.. రిపేర్లకు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. మరో అంశం ఏమంటే.. సాధారణ పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ కు మండే శక్తి 27-35 శాతం తక్కువ. దీంతో ఇంధనం వేగంగా ఖర్చు అవుతుంది. ఫలితంగా మైలేజీ సమస్యలు తలెత్తుతాయి. ఇ20 పెట్రోల్ తర్వాత వాహన మైలేజీ పడిపోతుందన్న విమర్శలు భారీగా పెరగటం వెనుక అసలు కారణమిదేనని చెబుతారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు ఉన్నాయా? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఉన్నది ఉన్నట్లుగా చెబితే.. ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవటానికి.. లక్షల కోట్ల రూపాయిల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయటమే మోడీ సర్కారు ప్రాధాన్యతగా మారింది. ఈ లక్ష్యాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ.. అలా చేయటానికి ముందు.. తగిన ఏర్పాట్లు చేసుకోవటంలో జరిగిన ఆలస్యం.. వివిధ విభాగాల మధ్య తలెత్తిన సమన్వయ లోపం ఇప్పుడు మోడీ సర్కారుకు కొత్త తలనొప్పికి కారణంగా మారనుంది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇథనాల్ డిస్టలరీల ఏర్పాటుకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు.. సబ్సిడీలు ఇచ్చింది. దీంతో.. ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో చెరకు.. మొక్కజొన్న రైతులకు ఇథనాల్ ఒక పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఆ విధానాన్ని ఆపేస్తే మరో పెద్ద సమస్య. రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతోంది. మరెక్కడ తప్పు జరిగిందంటే.. ఇథనాల లో క్లోరైడ్ స్థాయిలు ఎంత ఉండాలన్న దానిపై నేటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పష్టమైన.. కఠినమైన పరిమితులను డిసైడ్ చేయలేదు. ఈ లొసుగును వాడుకొని చమురు కంపెనీలు నాణ్యత లేని ఇథనాల్ ను సరఫరా చేస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి.
అంతేకాదు.. ఇథనాల్ డిస్టలరీల నుంచి చమురు డిపోలకు రవాణా చేసే ట్యాంకర్లలో లోపాలు కూడా ఒక సమస్యగా మారింది. కెమికల్స్ రవాణా చేసే ట్యాంకర్లను సరిగా శుభ్రం చేయకుండా ఇథనాల్ నింపటంతో క్లోరైడ్ కాలుష్యం జరుగుతోంది. మరో పెద్ద సమస్య ఏమైంటే.. పెట్రోల్ బంకుల్లోని అండర్ గ్రౌండ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉంటుంది. కానీ.. అలా చేయకపోవటంతో పైప్ లైన్ లీకేజీలు.. వర్షపు నీరు.. తేమ ఇంధనంలోకి చేరి పలు సమస్యలకు కారణమవుతోంది. వీటిని తనిఖీ చేసే వ్యవస్థలు బలహీనంగా ఉండటం ఒక కీలక లోపంగా చెప్పాలి.
మరో కీలక సమస్య ఏమంటే.. పెట్రోల్ బంకుల్లో ఇ10 - ఇ20 పెట్రోల్ రెండింటిని వేర్వేరుగా అమ్మే ఏర్పాట్లు చాలా బంకుల్లో లేవు. దీంతో 2023 కంటే ముందు కొన్న పాత వాహనదారులు తెలియక ఇ20 పెట్రోల్ కొట్టిచ్చి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. పాత వాహనాల కోసం ప్రత్యేకంగా ఫ్యూర్ పెట్రోల్ లేదంటే ప్రీమియం పెట్రోల్ ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఆ అవగాహన చాలామంది లేకపోవటంతో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
మరి వీటికి పరిష్కారాలు లేవా? అంటే.. ఉన్నాయి. కానీ.. వాటిని ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయటం సాధ్యమయ్యే పని కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. అదెలా అంటే.. పెట్రోల్ బంకుల్లోని భూగర్భ ట్యాంకుల్లో డిజిటల్ సెన్సార్లను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే.. వీటిని ఏర్పాటు చేస్తే.. ఒక మిల్లీ లీటరు నీరు చేరినా.. ఇంధన నాణ్యత మారినా ఈ సెన్సార్లు వెంటనే కంఫ్యూటర్ స్క్రీన్ మీద అలెర్టు ఇస్తాయి. దీంతో.. వాటి అమ్మకాలు నిలిపే వీలు ఉంటుంది. దేశంలోని 87వేలకు పైగా ఉన్న బంకుల్లో ఈ సాంకేతికతను తీసుకురావటం విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. బంకు యజమానులు సైతం ఇంత ఖర్చుకు సిద్ధంగా లేరన్న మాట వినిపిస్తోంది.
అదే సమయంలో ఈ సాంకేతికతను చమురు కంపెనీలు అందించేందుకు సిద్ధంగా లేవు. ఈ ప్రక్రియ తమ మీద అదనపు భారం పడుతుందన్న ఉద్దేశంతో ముందుకు రావటం లేదు. మరోవైపు ప్రభుత్వ పాలసీ కూడా ఇప్పటి పరిస్థితికి కారణంగా చెప్పాలి. 2030లో ఇ20 పెట్రోల్ తీసుకురావాలన్న లక్ష్యాన్ని ఐదేళ్లకు కుదించేశారు. దీంతో తక్కువ వ్యవధిలో ఇప్పటివరకు ఉన్న ఇ10 స్థానే మరో పది శాతం అదనంగా ఇథనాల్ ను బ్లెండ్ చేయాల్సి రావటంతో.. ఇథనాల్ సేకరణ.. వాటి నిర్వహణ.. డిపోల్లో బ్లెండింగ్ మీద ఫోకస్ పెట్టాయి. అలాంటప్పుడు బంకుల్లో సెన్సార్ల ఏర్పాటు ఆఖరి ప్రాధాన్యత మాత్రమే అవుతుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి చమురు కంపెనీలు తమ సొంత క్వాలిటీ కంట్రోల్ అధికారులతో మొబైల్ ల్యాబ్ ల ద్వారా పెద్ద ఎత్తున ఆకస్మిక తనిఖీలు చేపడితే.. బంకు యజమానులు మరింత జాగ్రత్తగా ఉంటారు. దీంతో కొంత మేర సమస్యలు తగ్గే వీలుంది. అంతేకాదు.. ఇ20 పెట్రోల్ కు అనుగుణంగా మాత్రమే కాదు పూర్తిగా ఇథనాల్ తోనూ నడిచే వాహనాల్ని.. లేదంటే ఇ20 ఆపైన బ్లెండ్ చేసిన పెట్రోల్ తో పాటు.. పూర్తిగా ఇథనాల్ తో నడిచేలా ఇంజిన్ మార్పులపై దేశీయ వాహన కంపెనీలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం కొత్తగా టెక్నాలజీని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ తరహా ఇంజిన్లతో వాహనాల్ని సిద్ధం చేస్తున్నాయి వాహన కంపెనీలు. కాకుంటే.. సరైన విజన్.. దానికి తగ్గట్లు వ్యవస్థలు సిద్ధమయ్యేలా చేయాల్సిన బాధ్యత మోడీ సర్కారు మీద ఉంది. అప్పుడే ఇ20 పెట్రోల్ రచ్చ తగ్గుతుంది. లేనిపక్షంలో దేశం మొత్తంగా ఉన్న వాహనదారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని కేంద్రం విస్మరించకూడదు. మరి.. మోడీ మాష్టారు ఏం చేస్తారో చూడాలి.
