Begin typing your search above and press return to search.

E20 పెట్రోల్ ముప్పు: 305 జిల్లాల్లో 44 వేల వాహనాల సర్వేలో తేలిన షాకింగ్ నిజాలు!

భారతదేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధన కార్యక్రమం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో E20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వినియోగం పాత వాహనాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తాజా సర్వే స్పష్టం చేస్తోంది.

By:  Sivaji Kontham   |   3 July 2026 1:00 AM IST
E20 పెట్రోల్ ముప్పు: 305 జిల్లాల్లో 44 వేల వాహనాల సర్వేలో తేలిన షాకింగ్ నిజాలు!
X

భారతదేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధన కార్యక్రమం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో E20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వినియోగం పాత వాహనాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తాజా సర్వే స్పష్టం చేస్తోంది. ఆ మేర‌కు ఇండియా టుడే ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం.. లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా 305 జిల్లాల్లో 2023 కంటే ముందు తయారైన పెట్రోల్ వాహనాలు కలిగిన 44,000 మందికి పైగా యజమానుల నుండి సేకరించిన స్పందనల ఆధారంగా ఈ కీలక వివరాలను వెల్లడించింది. గత 15 ఏళ్లలో దేశంలో అమ్ముడైన పెట్రోల్ వాహనాల్లో కేవలం 20 శాతం మాత్రమే ఇ20 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని థామ్సన్ రాయిటర్స్ కాంటెక్స్ట్ గతంలో నివేదించిన నేపథ్యంలో.. మిగిలిన 80 శాతం పాత వాహనాల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఈ సర్వే నివేదిక ప్రకారం... 2025 సంవత్సరం ప్రారంభం నుండి తమ వాహనాల అరుగుదల, మరమ్మతుల అవసరాలు గణనీయంగా పెరిగాయని 55 శాతం మంది యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక నెల క్రితం... మే 2026లో ఈ సంఖ్య 29 శాతంగా ఉండగా... జూన్ నాటికి అది అసాధారణంగా పెరగడం గమనార్హం. సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 24 శాతం మంది తమ వాహనాలకు జరిగిన నష్టాన్ని ప్రాబ్ల‌మేటిక్ అని వ్యాఖ్యానించ‌గా, 21 శాతం మంది కొద్దిగా స‌మ‌స్య‌లున్నాయి అని అభివర్ణించారు. మే నెల సర్వే కేవలం ప్రమాద ఘంటికలను మోగిస్తే.. జూన్ నెల ఫలితాలు పాత వాహనదారుల కష్టాలను, పెరుగుతున్న మెయింటెనెన్స్ ఖర్చులను కళ్లద్దినట్లు చూపిస్తున్నాయి.

ఈ మెకానికల్ సమస్యలకు ఇథనాల్ అంతర్గత రసాయన లక్షణాలే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇథనాల్ సహజంగానే వాతావరణంలోని తేమను సులభంగా ఆకర్షిస్తుంది. దీనివల్ల ఇంధన ట్యాంకులు, ఇంజెక్టర్లు, పంపులు, లోహపు ఇంధన లైన్లు త్వరగా తుప్పు పడతాయి. అంతేకాకుండా... ఇ20 ఇంధనాన్ని తట్టుకునేలా రూపొందించని పాత వాహనాలలోని రబ్బరు హోసులు, సీల్స్, ఓ-రింగ్‌లు , ప్లాస్టిక్ భాగాలను ఇది క్రమంగా తినేస్తుంది. ఫలితంగా మొదట్లో కేవలం ఇ5 లేదా ఇ10 ఇంధనం కోసం మాత్రమే ఇంజనీరింగ్ చేసిన పాత వాహనాల ఇంజన్ ఆరోగ్యం సైలెంట్‌గా దెబ్బతింటోంది.

వాహనాల అరుగుదలతో పాటు మైలేజీ పడిపోవడంపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సర్వేలో పాల్గొన్న 2023కు ముందు నాటి వాహనదారులలో 66 శాతం మంది తమ వాహనాల మైలేజీ 10 శాతానికి పైగా తగ్గిందని తెలిపారు. కేవలం ఒక నెల క్రితం ఈ సంఖ్య 45 శాతంగా మాత్రమే ఉండేది. ఇందులో 23 శాతం మందికి 20 శాతానికి పైగా మైలేజీ నష్టం ఎదుర్కోక త‌ప్ప‌లేదు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో లీటరుకు శక్తి సాంద్రత తక్కువగా ఉండటమే దీనికి కారణం. ఆధునిక ఇ-20 వాహనాల్లో ఉండే అడాప్టివ్ ఇంజన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల పాత ఇంజన్లు ఈ మార్పును తట్టుకోలేక అదే పనితీరు కోసం ఎక్కువ ఇంధనాన్ని మండిస్తున్నాయి.

ఈ చర్చ ఇప్పుడు ప్రయోగశాల అంచనాలకు.. వాస్తవ ప్రపంచానికి మధ్య ఉన్న అంతరాన్ని బహిర్గతం చేస్తోంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏ.ఆర్.ఏ.ఐ) E20 ఇంధనం వల్ల మైలేజీ కేవలం 1-6 శాతం మాత్రమే తగ్గుతుందని అంచనా వేయగా... వాస్తవంలో పాత వాహనాల్లో ఈ నష్టం 8-12 శాతానికి పైగా ఉందని స్వతంత్ర అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ఇప్పటికే ఇ22 నుండి ఇ30 వరకు అధిక ఇథనాల్ మిశ్రమాల కోసం ఇంధన ప్రమాణాలను అధికారికంగా నోటిఫై చేసింది. భవిష్యత్తులో ఇ30 ఇంధనం కూడా అందుబాటులోకి వస్తే పాత వాహనాల పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. అలాగే వినియోగదారులకు సాధారణ పెట్రోల్ ఎంచుకునే ప్రత్యామ్నాయం ఉంటుందో లేదో కూడా తెలియ‌ని గంద‌ర‌గోళం తీవ్ర ఆందోళ‌న‌కు దారి తీస్తోంది.