ఈ-20పై రగడ.. కేంద్రం వర్సెస్ కేజ్రీవాల్.. అసలేంటిది?
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం ఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా స్పందించింది.
By: Garuda Media | 5 Aug 2026 12:17 PM ISTసాధారణంగా వాహనాలకు వినియోగిస్తున్న ప్రెట్రోలు స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ-20 పెట్రోలును అమలు చేస్తున్న విషయం తెలిసింది. ఇది చెట్ల నుంచి వచ్చే ఇథనాలను కలిపి ప్రత్యేకంగా రూపొందిస్తారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు తగ్గుతుందని.. పెట్రోలు విషయంలో విదేశాలపై ఆధారపడకుండా చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అదేసమయంలో దేశవ్యాప్తంగా రైతు లకు కూడా మేలు జరుగుతుందని పేర్కొంటోంది. అయితే.. ఈ-20 పెట్రోలుతో వాహనాల జీవితకాలం పడిపోవడంతో పాటు.. వాహనాలు మొరాయిస్తాయని, మైలేజీ తగ్గిపోవడంతో వినియోగదారుల జేబు గుల్ల అవుతుందన్న ఆరోపణలు వున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మంగళవారం ఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా స్పందించింది. ఈ-20 పెట్రోలుతోనే మేలు జరుగుతుందని పేర్కొంది. దీని నుంచి వెనక్కి మళ్లేది లేదని స్పష్టం చేసింది. ఎవరు ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చని.. నిరసనలు కూడా చేసుకోవచ్చని కానీ, విధానపరమైన నిర్ణయాలు మార్చుకునేది లేదని స్పస్టం చేసింది. అంతేకాదు.. ఈ-20 పెట్రోలు వినియోగం ద్వారా రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందని, రైతులకు, యువతకు కూడా ఉపాధి లభిస్తుందని వివరించింది. 2030 నాటికి దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతోనే దీనిని తీసుకువచ్చామని పేర్కొంది.
అసలేంటీ వివాదం?
ఇథనాల్ కలిపిన పెట్రోలు వాడకం అనేది.. 2004 నుంచే దేశంలో అమల్లో ఉంది. అప్పట్లో పెట్రోలులో గరిష్ఠంగా 5 శాతం ఇథనాల్ కలిపేవారు. తర్వాత.. 10 శాతం పెంచారు. ఇలా.. 2030 నాటికి పెట్రోలులో ఇథనాల్ శాతాన్ని 30 శాతానికి చేర్చాలన్నది కేంద్రం లక్ష్యం. తద్వారా ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు.. 2030 నాటికి పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంధన సంస్థలు కూడా ఈ-20 పెట్రోలును విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఐచ్ఛికమే అయినా.. రానున్న రోజుల్లో దీనిని నిర్బంధంచేయనున్నారన్నది కేజ్రీవాల్ సహా ఇతర పార్టీల వాదన. దీనిపై కేంద్రం మౌనంగా ఉంది.
అసలు సమస్య ఏంటి?
ఇథనాల్ అనేది చెట్లు,చెరుకు నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా రైతులు ఇథనాల్‌ను విక్రయించి ఆదారం పొందుతారన్నది ప్రభుత్వంచెబుతున్నమాట. కానీ, విపక్షాల ఆందోళన వేరుగా ఉంది. ఇథనాల్ కొనుగోలు పేరుతో బడాబాబు లకు కేంద్రం అనుమతి ఇస్తోందని.. తద్వారా రైతులకు మేలు జరగదని అంటున్నారు. అదేసమయంలో వినియోగదారులకు( ప్రజలు) ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను భారీ ధరలకు విక్రయిస్తున్నారని.. దీనివల్ల అటు రైతులు... ఇటు ప్రజలు కూడా ఇబ్బంది పడతారని, పరోక్షంగా ప్రత్యక్షంగా బడాబాబులకు ప్రభుత్వం మేలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ వాదనలను కేంద్రం తోసిపుచ్చింది. ఈ-20 అమలు చేస్తామని తాజాగా తేల్చి చెప్పింది.
