Begin typing your search above and press return to search.

25 శాతం ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్ వేస్తే మైలేజ్ ప‌డిపోతుందా?

భారతదేశంలో ఇంధన వినియోగం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియ వేగవంతమైంది.

By:  Sivaji Kontham   |   25 March 2026 9:35 AM IST
25 శాతం ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్ వేస్తే మైలేజ్ ప‌డిపోతుందా?
X

భారతదేశంలో ఇంధన వినియోగం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియ వేగవంతమైంది. అయితే దీనివల్ల వాహనాల పనితీరు దెబ్బతింటుందని.. మైలేజ్ తగ్గుతుందని చాలా మంది వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 2023 తర్వాత తయారైన వాహనాలకు 25 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్ వాడినా ఇబ్బందుల్లో ప‌డ‌తార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే నిపుణుల ప్ర‌కారం.. ఇదేమీ పెద్దగా ఇబ్బందికి గురి చేసే అంశం కాద‌ని చెబుతున్నారు. తాజా వార్త‌ల‌ నేపథ్యంలో ఇథనాల్ మిశ్రమం వల్ల కలిగే లాభనష్టాలు, ఇంజిన్ సామర్థ్యంపై నెటిజ‌నుల్లో విస్త్ర‌త‌ చర్చ జరుగుతోంది.

ఇథ‌నాల్ క‌ల‌వ‌డం వ‌ల్ల మ‌నం భ‌య‌ప‌డినంత డ్యామేజీ ఏదీ ఉండదు. ఉదాహ‌ర‌ణ‌కు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను 2023లో కొనుగోలు చేస్తే... అది ఆధునిక ఓబీడీ-2 (ఆన్ బోర్డ్ డ‌యాగ్న‌స్టిక్స్) ప్రమాణాలకు అనుగుణంగా తయారై ఉంటుంది. అంటే ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 శాతం వరకు ఇథనాల్ కలిసిన పెట్రోల్‌ను (ఇ20) తట్టుకునేలా కంపెనీ దీనిని డిజైన్ చేసింది. ఇందుకోసం ప్రత్యేకమైన ఫ్యూయల్ లైన్లు, సీల్స్, ఇంజిన్ భాగాలను వాడటం వల్ల ఇథనాల్ వల్ల తక్షణమే ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు. కాబట్టి కొత్త మోడల్ బుల్లెట్ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే పాత వాహ‌నాల్లో మాత్రం 5-7 శాతానికి మైలేజ్ త‌గ్గే అవ‌కాశం ఉంది.

మైలేజ్ విషయానికి వస్తే.. ఇథనాల్‌లో పెట్రోల్ కంటే తక్కువ శక్తిని క‌లిగి ఉంటుంది. దీనివల్ల మైలేజ్ స్వల్పంగా అంటే సుమారు 3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నా కానీ.. అది బైక్ పనితీరుపై పెద్దగా ప్రభావం చూపదు. కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఇంజిన్లు ఈ వ్యత్యాసాన్ని సులభంగా సర్దుబాటు చేసుకుంటాయి. అయితే వాహనాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెడితే మాత్రం ఇథనాల్ తేమను ఆకర్షించి ట్యాంకు లోపల తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది. రెగ్యులర్‌గా వాడే వాహనాలకు ఈ సమస్య ఉండదు.

చాలా మంది వాహనదారులు సాధారణ పెట్రోల్‌లో ఇథనాల్ ఉంటుందని పవర్ లేదా ప్రీమియం పెట్రోల్‌లో ఉండదని పొరబడుతుంటారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం దొరికే అన్ని రకాల పెట్రోల్ వేరియంట్లలోనూ ఇథనాల్ కలుపుతున్నారు. పవర్ పెట్రోల్‌లో కేవలం ఆక్టేన్ నంబర్ ఎక్కువగా ఉండటం.. ఇంజిన్ లోపలి భాగాలను శుభ్రపరిచే అడిటివ్స్ ఉండటం వల్ల ఇంజిన్ స్మూత్‌గా నడుస్తుంది. కానీ అందులో ఇథనాల్ ఉండదని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే.

చివరగా ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనాన్ని వాడుతున్నప్పుడు వాహనదారులు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీ బైక్ ట్యాంక్ మూతపై లేదా మాన్యువల్‌లో ఇ20 అని ఉందో లేదో తనిఖీ చేయాలి. ఇథనాల్‌కు నీటిని త్వరగా ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి పెట్రోల్ ట్యాంకులోకి నీరు చేరకుండా మూతను ఎప్పుడూ టైట్‌గా ఉంచాలి. బుల్లెట్ లాంటి లాంగ్-స్ట్రోక్ ఇంజిన్లకు సాధారణ పెట్రోల్ సరిపోతుంది.. కేవలం మెరుగైన క్లీనింగ్ కోసం అప్పుడప్పుడు ప్రీమియం పెట్రోల్ వాడినా ఇబ్బంది లేదని నిపుణులు చెబుతున్నారు.