Begin typing your search above and press return to search.

పార్లమెంటులో ఈ-సిగరెట్ రచ్చ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తృణమూల్ ఎంపీ!

పార్లమెంటులో ఈ-సిగరెట్ రచ్చ రాజేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఒకరు ఈ-సిగరెట్ తాగడాన్ని తాను చూశానంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ సభ దృష్టికి తీసుకువచ్చారు.

By:  Tupaki Political Desk   |   11 Dec 2025 6:53 PM IST
పార్లమెంటులో ఈ-సిగరెట్ రచ్చ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తృణమూల్ ఎంపీ!
X

పార్లమెంటులో ఈ-సిగరెట్ రచ్చ రాజేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఒకరు ఈ-సిగరెట్ తాగడాన్ని తాను చూశానంటూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ సభ దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా తృణమూల్ ఎంపీలు చాలా కాలంగా ఇదే పనిచేస్తున్నారని, సభా విలువలను దిగజార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పీకర్ ఓం బిర్లా కల్పించుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో రచ్చ చోటుచేసుకుంది. నిషేధిత ఈ-సిగరెట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు ఎలా వచ్చాయనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.

ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటులో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై సభ్యులు అంతర్గత సంభాషణల్లో విస్తృతంగా చర్చించుకున్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సిన పవిత్రమైన వేదికపై కూర్చొన్న సభ్యులు హుందా తనాన్ని మరచిపోతున్నారని, బాధ్యతారహితంగా నడుచుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. సభ జరుగుతున్నప్పుడు సెల్ ఫోన్లు చూసుకోవడం, అశ్లీల చిత్రాలు వీక్షించడం వంటివి గతంలో చోటుచేసుకున్నాయి. అదేవిధంగా తాజాగా ఈ-సిగరెట్లను తాగడం కూడా దుమారం రేపుతోంది.

నిజానికి పార్లమెంటులో ధూమపానంపైనే నిషేధం ఉంది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకంపైనా 2019 నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమలు చేస్తున్నారు. ఈ-సిగరెట్లు తయారీ, వాడకం, విక్రయం, పంపిణీ, నిల్వ చేయడం, ఈ-సిగరెట్లపై వ్యాపార ప్రకటనలు చేయడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యులు కొందరు పార్లమెంటు ఆవరణలో ఈ-సిగరెట్లు సేవించడంపై ఇతర సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

తృణమూల్ సభ్యులు ఈ-సిగరెట్లు తాగడాన్ని గమనించానని, వారికి మీరేమైనా అనుమతించారా? అంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పీకర్ ను ప్రశ్నించడం తీవ్ర చర్చకు తెరలేపింది. తాను అలాంటి చట్ట విరుద్ధమైన పనులను ప్రోత్సహించనని స్పీకర్ తేల్చిచెప్పడమే కాకుండా వెనువెంటనే లోక్ సభలో ఈ-సిగరెట్ల వాడకంపై రూల్ పాస్ చేశారు. ఇకపై సభలో ఎవరైనా సిగరెట్ తాగినట్లు తన దృష్టికి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటానని స్పీకర్ హెచ్చరించారు.