రమ్యకు బిగ్ బాస్ లో అన్యాయం.. ఫైనల్ రావాల్సింది.. దువ్వాడ సంచలన కామెంట్స్
అయితే ఇప్పుడు విజేతల కంటే కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చి త్వరగానే వెళ్లిపోయిన రమ్య మోక్ష ఎలిమినేషన్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
By: A.N.Kumar | 22 Dec 2025 4:42 PM ISTఎంతో రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారంతో అధికారికంగా ముగిసింది. మాజీ ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకోగా.. సీనియల్ నటి తనూజ రన్నరప్ గా నిలిచారు. అయితే ఇప్పుడు విజేతల కంటే కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చి త్వరగానే వెళ్లిపోయిన రమ్య మోక్ష ఎలిమినేషన్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
ఫైర్ స్టార్మ్ ఎంట్రీ.. ఆపై వివాదాలు
ఐదోవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన రమ్య మౌక్ష.. తొలిరోజే తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిజికల్ టాస్క్ లలో మగ కంటెస్టెంట్లకు ధీటుగా పోరాడుతూ.. భరణి వంటి కంటెస్టెంట్లను సైతం ఈడ్చి పడేసి ‘ఫైర్ స్టార్మ్’ అనిపించుకుంది. అయితే ఆమె ప్రవర్తన.. నోటి దురుసుతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా కళ్యాణ్ పడాల-తనూజల రిలేషన్ పై ఆమె చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఆమెకు నెగెటివ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఫలితంగా హౌస్ లోకి వచ్చిన రెండో వారానికే ఆమె ఎలిమినేట్ అయ్యింది.
బిగ్ బాస్ మేనేజ్మెంట్ పై దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం
రమ్య మోక్ష ఎలిమినేషన్పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో బిగ్ బాస్ మేనేజ్ మెంట్ ఆమెకు తీరని అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. ‘రమ్య మోక్ష మొదటి వారంలోనే బయటకు రావడం నాకు చాలా బాధ కలిగించింది.ఆమె ఫైనల్ వరకూ ఉండాల్సిన కంటెస్టెంట్. అనవసరమైన వారిని హౌస్ లో ఎక్కువ రోజులు ఉంచి.. కష్టపడి పైకి వచ్చిన రమ్యకు అన్యాయం చేశారు.’ అని దువ్వాడ వ్యాఖ్యానించారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ.. ‘తండ్రి మరణం తర్వాత ఒంటరిగా పోరాడి తన కాళ్ల మీద తాను నిలబడిన రమ్య యువతకు ఆదర్శమని .. ఆమె పోరాట పటిమను గుర్తించడంలో బిగ్ బాస్ విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
రమ్యకు దివ్వెల మాధురి మద్దతు..
ఇదే అంశంపై దివ్వెల మాధురి సైతం స్పందించారు. తమ ఇంటికి వచ్చిన రమ్య, అలేఖ్య చిట్టీలతో పంచుకున్నారు. రమ్యకు మద్దతుగా నిలిచారు. ‘రమ్య చాలా స్ట్రాంగ్ అమ్మాయి. ప్రతీ విషయాన్ని ఎదురించే ధైర్యం ఆమెకు ఉంది. మేనేజ్ మెంట్ కావాలనే ఆమెను పంపించేసింది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. రమ్య గతంలో ఎదుర్కొన్న పికిల్స్ కాంట్రవర్సీలో కూడా ఆమె తప్పేమీ లేదని.. ఎదుటివారు ఎంతలా అవమానిస్తే ఆమె అంతలా స్పందించి ఉంటుందని దువ్వాడ, మాదురి సమర్థించడం విశేషం.
రమ్యకు అనుకూలంగా.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మద్దతుగా మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొందరు రమ్యకు మద్దతుగా.. ఇంకొందరు బిగ్ బాస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ కేవలం ఆట కాదని.. అది వ్యక్తిత్వ ప్రదర్శన అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సీజన్ ముగిసినా.. రమ్య మోక్ష ఎలిమినేషన్ ఎపిసోడ్ మాత్రం బిగ్ బాస్ చరిత్రలో ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది.
