బీజేపీలోకి దువ్వాడ..? టీవీ చానల్ ఇంటర్వ్యూలో సంకేతాలు!
వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బీజేపీలో చేరనున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
By: Tupaki Political Desk | 1 Jan 2026 4:00 AM ISTవైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బీజేపీలో చేరనున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ భవిష్యత్తుపై దువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేసినా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని భక్తుడిగానే కొనసాగుతానని దువ్వాడ స్పష్టం చేశారు. జగన్ నుంచి తమ సొంత జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు తనను దూరం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం తాను ఇండిపెండెంట్ గానే ఉన్నానని, పొజీషన్ లోకి వచ్చాక జగన్ వద్దకే వెళ్తానని దువ్వాడ చెప్పారు. అయితే ఇదే సమయంలో ఆయన ప్రేయసి దివ్వెల మాధురి మాత్రం అవకాశం వస్తే బీజేపీలోకి వెళ్తామేమో అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దువ్వాడ శ్రీనివాస్ ఏపీ సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి. ఈ ఇద్దరు నేరుగా తలపడిన ప్రతిసారి అచ్చెన్నాయుడిదే పైచేయి అవుతోంది. దీంతో గత ప్రభుత్వంలో దువ్వాడకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ప్రోత్సహించారు మాజీ సీఎం జగన్. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మందిలో దువ్వాడ ఒకరు. జగన్ మాటను శిరసావహించే దువ్వాడ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాటకీయ పరిణామాలతో వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే పార్టీ వేటు వేసినా, ఆయన ఇప్పటికీ జగన్ అభిమానిగా సానుభూతి పరుడిగా కొనసాగడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదాల కారణంగా వైసీపీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు దువ్వాడ. ఆ తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ పూర్తిగా ఓపెన్ అయిపోవడం, యూట్యూబ్ లో దువ్వాడ వ్యక్తిగత వ్యవహారాలు వైరల్ కంటెంట్ అవుతుండటంతో ఇటీవల బాగా బిజీ అయ్యారు దువ్వాడ. ముఖ్యంగా ఆయన ప్రేయసి దివ్వెల మాధురితో కలిసి వస్త్రవ్యాపారంతోపాటు బిగ్ బాస్ సీజన్ 9లో మాధురి ఎంట్రీతో దువ్వాడ జంట సెలబ్రెటీ హోదా దక్కించుకున్నారు. ఇక తాజాగా తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్కెచ్ వేస్తున్నారంటూ శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేయడమే కాకుండా, అర్ధరాత్రి జాతీయ రహదారిపై హల్ చల్ చేసిన దువ్వాడ మరోసారి రాజకీయ దుమారం రేపారు.
ఈ క్రమంలో ఓ టీవీ చానల్ దువ్వాడను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ఆర్ తోపాటు ఆయన కుమారుడు వైసీపీ అధినేత జగన్ తో సంబంధాల విషయంపై వేసిన ప్రశ్నలకు దువ్వాడ ఆసక్తికర సమాధానాలిచ్చారు. తాను కాంగ్రెస్ నుంచి పీఆర్పీలో చేరానని, టెక్కలి ఉప ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సమయంలో మాజీ సీఎం వైఎస్ ను విమర్శించమని చెప్పినా, తాను అలా చేయలేదన్నారు. అదేవిధంగా జగన్ నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నా, తాను మాత్రం జగన్ అభిమానిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు దువ్వాడ. ఇదే సమయంలో కూటమి పార్టీల్లో ఏ పార్టీలో చేరతారని ప్రశ్నించగా, టీడీపీ, జనసేన పార్టీల్లో ఎట్టిపరిస్థితుల్లో చేరనని కుండబద్దలు కొట్టారు దువ్వాడ శ్రీనివాస్. అయితే బీజేపీలో చేరతారా? అంటూ ప్రశ్నించగా, దువ్వాడ ప్రేయసి మాధురి కల్పించుకుని అవకాశం వస్తే చేరతామేమో అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
