జగన్ గుండెల్లో ఉన్నారు...ఆ ఎమ్మెల్సీ వైసీపీలోకి ?
జగన్ భక్తుడిగా తనను తాను ఎన్నో సార్లు చాటి చెప్పుకున్నారు ఆయన. దానికి తగినట్లుగా జగన్ కూడా ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు.
By: Satya P | 12 Oct 2026 4:00 PM ISTజగన్ భక్తుడిగా తనను తాను ఎన్నో సార్లు చాటి చెప్పుకున్నారు ఆయన. దానికి తగినట్లుగా జగన్ కూడా ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇలా సాగిన అనుబంధానికి మధ్యలో ఆయన వ్యక్తిగత వివాదాల వల్ల ఇబ్బందులు పడడంతో వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయినా సరే జగన్ తనకు దేవుడనే అంటున్నారు. తాను వైసీపీలో చేరినా చేరకపోయినా జగన్ తనకు ఇష్టమైన నాయకుడు అంటున్నారు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఆయన తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని గురించి వివరించారు. నాటి వైఎస్సార్ నుంచి నేటి జగన్ వరకూ తన రాజకీయ అనుబంధాన్ని వివరించారు. వర్తమానంతో పాటు భవిష్యత్తు ఆలోచనలు కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.
వైఎస్సార్ నాటిన మొక్కను :
తాను రాజకీయాల్లో వైఎస్సార్ నాటిన మొక్కను అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. తనను పిలిచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వారు వైఎస్సార్ అని గుర్తు చేసుకున్నారు. 2006లో జెడ్పీటీసీగా గెలిపించారని ఆ తరువాత జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ గా చేశారు అని చెప్పారు. ఇక వైఎస్సార్ అనంతరం తాను 2010 నుంచి వైఎస్ జగన్ వెంట ఉన్నాను అని పార్టీ పునాదుల్లో నుంచి వైసీపీలో ఉన్న వాడిని అని ఆ పార్టీ మీద తనకు ఉన్న రాజకీయ అధికారాన్ని స్పష్టం చేశారు. జిల్లాలో 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన అభివృద్ధిలో తాను ముఖ్య పాత్ర పోషించాను అని చెప్పారు. మూలపేటలో పోర్టు విషయం కానీ పలాసలో కిడ్నీ రోగులకు ఆసుపత్రి కానీ రిసెర్చ్ సెంటర్ కానీ వీటి వెనక తాను ఉన్నాను అని దువ్వాడ చెప్పుకున్నారు.
జిల్లా రాజకీయాల వల్లనే :
తాను వైసీపీకి దూరం కావడం అన్నది జిల్లా రాజకీయాల వల్లనే జరిగింది అని ఆయన అంటున్నారు. జిల్లా వైసీపీలో కొందరి వల్లనే పార్టీ తనను పక్కన పెట్టిందని అన్నారు. అయినా సరే సస్పెన్షన్ పెద్ద విషయం కాదని ఆయన చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే వైసీపీలో తిరిగి చేరేది ఉందని ఆయన బలమైన సంకేతాలు ఇస్తున్నట్లుగానే భావించాలని అంటున్నారు. వైసీపీలోకి దువ్వాడను తీసుకుంటారా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు పూర్తిగా పార్టీ మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు. వారే జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. వారి ప్రమేయం కానీ ఆమోదం కానీ లేకుండా దువ్వాడను తీసుకోవడం సాధ్యపడుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
ఆ సామాజిక వర్గం కోసం :
అయితే శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గం వైసీపీ విషయంలో అసంతృప్తిగా ఉంది. సీనియర్ నేత అదే సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ని పక్కన పెట్టారని దువ్వాడను సస్పెండ్ చేశారని, వర్గ పోరు వల్లనే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీని వీడిపోయారని ఆ సామాజిక వర్గం నుంచి వినిపిస్తోంది. జిల్లాను ఒకనాడు శాసించి ఈనాటికీ అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో బలం ఉన్న కాళింగులు అయితే దువ్వాడను వైసీపీలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ రోజు కాకపోయినా ఎన్నికల వేళకు కచ్చితంగా దువ్వాడ వైసీపీలోకి వస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
