లోపల దువ్వాడ.... డదడలాడించిన దివ్వెల
ఇదిలా ఉంటే దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ బయట రచ్చ చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను స్టేషన్ లోపలికి రమ్మని పిలిచారు.
By: Satya P | 23 Jun 2026 6:47 AM ISTఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుని అరెస్టు చేశారు అంటూ ఆయన స్నేహితురాలు దువ్వాద మాధురి పోలీస్ స్టేషన్ బయట నిలబడి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రచ్చ చేశారు. కూటమి ప్రభుత్వం తీరు ఇదే అంటూ ఆమె మండిపడ్డారు. ఎపుడో రెండేళ్ల క్రితం కేసుని ఇపుడు తెచ్చి దువ్వాడ శ్రీనివాస్ ని స్టేషన్ లో గంటల కొద్దీ కూర్చోబెట్టారని ఆమె ఫైర్ అయ్యారు. ఉదయం పది గంటలకు తీసుకుని వచ్చి సాయంత్రం అయినా మంచి నీళ్ళ చుక్క ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు అని ఆమె విమర్శించారు.
సామాన్యుడి సంగతేంటి :
ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీకే ఇలా జరిగితే సామాన్యుడి సంగతేంటని ఆమె ప్రశ్నించడం విశేషం. రెండేళ్ళ ముందేపుడో పవన్ కళ్యాణ్ గురించి దువ్వాడ శ్రీనివాస్ విమర్శలు చేశారు అని ఇపుడు గుర్తు చేసుకుని ఈ కేసు కట్టడమేంటని ఆమె నిలదీశారు. ప్రశ్నిస్తే స్టేషన్ లో కూర్చోబెడతారా అని ఆమె అన్నారు. ప్రశ్నిస్తే తప్పా అని ఆమె గట్టిగా నిలదీశారు. నిన్న కాక మొన్న మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో దళితుడి ఇల్లు కూలగొట్టారని ఆమె ఆరోపించారు. అప్పట్లోనే 41 ఏ పేరుతో నోటీసు కూడా ఈ కేసులో పోలీసులు ఇచ్చారని ఇపుడు దాన్ని బయటకు మళ్లీ తీశారని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ధాన్యం కుంభకోణం మీద దువ్వాడ శ్రీను ప్రశ్నించారని పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టారని ఆమె ఫైర్ అయ్యారు. సామాన్య మానవుడి పరిస్థితులు ఏమిటి అని ఆమె అన్నారు.
స్టేషన్ ముందే రచ్చ :
ఇదిలా ఉంటే దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ బయట రచ్చ చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను స్టేషన్ లోపలికి రమ్మని పిలిచారు. రోడ్డు మీద ఇబ్బందులు సృష్టించవచ్చు అని పోలీసులు చెప్పడంతో ఆగ్రహించిన దువ్వాడ మాధురి పోలీస్ స్టేషన్ నా అత్తారిల్లా అని ఆవేశంతో ఊగిపోవడం విశేషం. రోడ్డు మీ జాగీరా అని ఆమె ఎదురు ప్రశ్నించారు. తాను ఇక్కడ ఉంటే తప్పేంటి తాను స్టేషన్ లోపలికి వచ్చే ప్రసక్తే లేదని తన నిరసనను రోడ్డు మీదనే కొనసాగించారు.
హై డ్రామాగా :
దువ్వాడ శ్రీనుని అరెస్టు చేశారా లేదా అన్నది పోలీసులు తెలియచేయకపోవడంతో పాటు ఆయనను రోజంతా నిర్భంధించారని దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేపట్టారు. ఒకసారిగా ఆమె బైఠాయించి పోలీసు జులుం నశించాలి అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దువ్వాడ శ్రీను ఫైర్ బ్రాండ్ అనుకుంటే ఆయనను మించి దివ్వెల మాధురి చేసిన ఈ రచ్చ చూస్తే కనుక టెక్కలి రాజకీయం ఒక్కసారిగా వేడిక్కిపోయింది అని చెప్పాలి.
