మూలిగే నక్క మీద తాటికాయ... పాక్ కు ఇది కొత్త చావు దెబ్బ!
పాకిస్థాన్ తో సరిహద్దు పంచుకుంటూ, ఇటీవల సరిహద్దు ఘర్షణలు జరిగిన ఆఫ్ఘనిస్థాన్.. ఈ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉందన్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 1 Dec 2025 12:25 PM ISTపాకిస్థాన్ తో సరిహద్దు పంచుకుంటూ, ఇటీవల సరిహద్దు ఘర్షణలు జరిగిన ఆఫ్ఘనిస్థాన్.. ఈ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉందన్న సంగతి తెలిసిందే. దీని తలసరి జీడీపీ కేవలం 434 డాలర్లు మాత్రమే! ఇక ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ - 2025 ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో 64% కంటే ఎక్కువ మంది పేదరికంలో నివసిస్తున్నారు.
అలాంటి పేద దేశంపై పాకిస్థాన్ పెద్ద పెద్ద డైలాగులు చెప్పి, ఇప్పుడు ఊహించని స్థాయిలో కొత్త కష్టాలు కొని తెచ్చుకుంది. ఇందులో భాగంగా.. ఆ దేశ ఐ.ఎస్.పీ.ఆర్. డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. ఆఫ్ఘనిస్థాన్ ను హెచ్చరిస్తూ.. ‘రక్తం, వ్యాపారం కలిసి సాగలేవు’ అని అన్నారు. అయితే.. అది కాస్తా ఇప్పుడు బూమరాంగ్ అయ్యి, ఇస్లామాబాద్ ను ముప్పు తిప్పలు పెడుతుంది.
అవును... వెనకా ముందూ చూసుకోకుండా తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటూ భారీ భారీ స్టేట్ మెంట్లు ఇవ్వడం పాక్ ప్రభుత్వ పెద్దలకు అలవాటే! ఈ క్రమంలో స్వల్ప సరిహద్దు ఘర్షణ, ఆఫ్ఘాన్ జాతీయులను సామూహికంగా బహిష్కరించిన అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దిగజారిపోయి.. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం చెలరేగింది!
ఈ క్రమంలో దాని ప్రభావాలు పాకిస్థాన్ పై అసమానంగా పడుతున్నాయని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వాణిజ్యాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా ప్రభావితమైందని.. ఇది అన్ని రంగాలకూ బిగ్ షాక్ ఇస్తుందని చెబుతున్నారు.
వాస్తవానికి అక్టోబర్ 11న సరిహద్దు వాణిజ్య కేంద్రాలు మూసివేయబడినప్పటి నుంచీ ఇరాన్, భారత్, మధ్య ఆసియా రిపబ్లిక్స్ ద్వారా వాణిజ్యాన్ని దారి మళ్లించడాన్ని ఆఫ్ఘానిస్థాన్ త్వరగానే అలవాటు చేసుకుంది. అయితే.. పాకిస్థాన్ మాత్రం తీవ్రంగా దెబ్బతిందని తెలుస్తోంది. ఇలా సరిహద్దు వాణిజ్యాన్ని నిలిపివేయడం.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నా పాక్ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బగా పరిణమిస్తోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... ఇటీవల పాకిస్థాన్ వ్యాపారవేత్తల బృందం జామియత్ ఉలేమా ఇ ఇస్లాం చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ వద్దకు వెళ్లి కలిసింది. ఈ సందర్భంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆఫ్ఘాన్ తో వాణిజ్యాన్ని పునరుద్ధరించడానికి సహాయం చేయమని వేడుకుందని.. ఈ సందర్భంగా... డ్యూరాండ్ లైన్ క్రాసింగ్ లను 45 రోజుల పాటు మూసివేయడం వల్ల తాము ఇప్పటికే ట్రిలియన్ల రూపాయలు కోల్పోయినట్లు చెప్పారని స్థానిక మీడియా నివేదించింది.
ఈ ప్రతిష్టంభన గుమతులు, దిగుమతులు రెండింటికీ ఆఫ్ఘనిస్థాన్ పై ఆధారపడిన ప్రధాన పాకిస్థానీ పరిశ్రమలలో కొరత, ధరల పెరుగుదల, ఉత్పత్తి అంతరాయాలకు దారి తీసింది. దీనిపై పౌర సమాజం సైతం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది ఆఫ్ఘనిస్థానీలు.. కొనుగోలు దారులు లేక అమ్ముడుపోకుండా పడి ఉన్న ఉత్పత్తులను, పాకిస్థాన్ మండీల వీడియోలను పంచుకుంటున్నారు.
మరోవైపు ఈ మూసివేత తర్వాత పాకిస్థాన్ లోని సిమెంట్ పరిశ్రమ అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న వాటిలో ఒకటని.. ఆఫ్ఘాన్ బొగ్గు దిగుమతులు, సిమెంట్ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో.. పాక్ తయారీదారులు మొజాంబిక్, సౌతాఫ్రికా, ఇండోనేషియాల నుంచి చాలా ఖరీదైన బొగ్గుకు మారాల్సి వచ్చిందని పాక్ మీడియా నివేదించింది. అయితే ఈ పతనం బొగ్గు, సిమెంట్ తోనే ఆగలేదని.. ఈ ప్రభావం పాకిస్థాన్ అంతటా అనేక రంగాలకు వ్యాపించిందని చెబుతున్నారు.
