తండ్రి అంత్యక్రియలకు ముందే మ్యాచ్ కోసం..
రెండు రోజుల కిందట ఆసియా కప్ టీ20 టోర్నీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడికి పెద్ద షాక్ తగిలింది.
By: Garuda Media | 21 Sept 2025 10:09 AM ISTరెండు రోజుల కిందట ఆసియా కప్ టీ20 టోర్నీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడికి పెద్ద షాక్ తగిలింది. శ్రీలంక యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే ఆ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే తన తండ్రిని కోల్పోయాడు. అతడి తండ్రి పేరు.. సురంగ వెల్లలాగే. ఆయన వయసు 54 ఏళ్లు. సురంగ సైతం ఒకప్పుడు క్రికెటరే కావడం గమనార్హం. కానీ శ్రీలంక జట్టుకు ఆడాలన్న ఆయన కల నెరవేరలేదు. దేశవాళీ క్రికెట్‌ను దాటి తన కెరీర్ ముందుకు సాగలేదు. ఐతే తన వల్ల కానిది కొడుకుతో సాధించాలనుకుకున్నాడు. దునిత్ తండ్రి కలను నెరవేరుస్తూ టీనేజీలోనే శ్రీలంక జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఆడే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఐతే అతను ఆఫ్ఘనిస్థాన్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్నపుడే.. సురంగ శ్రీలంకలో గుండెపోటుతో చనిపోయాడు.
మ్యాచ్ మధ్యలో ఈ న్యూస్ శ్రీలంక జట్టు వర్గాలకు తెలిసిందే. ఐతే మధ్యలో విషయం చెప్పడం ఎందుకని ఆగారు. మ్యాచ్ అయ్యాకు జట్టు కోచ్ సనత్ జయసూర్య.. వెల్లలాగేకే విషయం చెప్పాడు. దీంతో అతను విషాదంలో మునిగిపోయాడు. హుటాహుటిన వెల్లలాగే స్వదేశానికి బయల్దేరాడు. శుక్రవారం శ్రీలంకకు చేరుకున్న దునిత్.. తండ్రి పార్థివ దేహాన్ని సందర్శించాడు. కొన్ని గంటల పాటు ఇంట్లో గడిపిన అతను.. మళ్లీ యూఏఈకి బయల్దేరాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణం నేపథ్యంలో దునిత్ మళ్లీ ఆసియా కప్‌లో ఆడడనే అంతా అనుకున్నారు. కానీ అతను మాత్రం తండ్రి పార్థివ దేహం ఇంట్లో ఉండగానే.. అంత్యక్రియలు పూర్తి కాకముందే అక్కడ్నుంచి బయల్దేరిపోయాడు. తనను క్రికెటర్‌ను చేయడమే తండ్రి ఉద్దేశమని.. దేశానికి ఆడడాన్ని ఆయన గర్వకారణంగా భావిస్తాడని.. ఈ సమయంలో వెళ్లి శ్రీలంకకు ఆడడమే ఆయనకు తాను ఇచ్చే సరైన నివాళి అని భావించి దునిత్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
