'దగ్గుబాటి'కి షాకిచ్చిన చంద్రబాబు.. కనువిప్పు కలిగేనా..!
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.. పేరు ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 11 Sept 2025 11:11 PM ISTఅనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.. పేరు ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీలోనే వివాదాలకు ఆయన కేంద్రంగా మారారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటితోపాటు.. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితోనూ వివాదాలు, విభేదాలు కొనసాగిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే.. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు సీఎం చంద్రబాబు పేషీ నుంచి దగ్గుబాటికి హెచ్చరికలు వెళ్లాయి.
కానీ, ఆయన పనితీరులో పెద్దగా మార్పు కనిపించలేదన్న వాదన వినిపించింది. దీంతో చంద్రబాబు దా దాపు ఆయనను పక్కన పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో కేవలం నామమాత్రపు ప్రాధాన్యమే దక్కిందని అంటున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమంపై పార్టీ పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసుకుంది. గత పది రోజులుగా దీనికి ఏర్పాట్లు కూడా సాగాయి. పైగా ఈ కార్యక్రమం నిర్వహించింది కూడా దగ్గుబాటి సొంత నియోజకవర్గంలోనే.
మరింత ప్రాధాన్యం ఉన్న కార్యక్రమంలో.. సొంత నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో వాస్తవా నికి ఎమ్మెల్యేకు ఎంత ప్రాధాన్యం ఉండాలి? ఎంత మేరకు.. ఆయన చేతుల మీదుగా కార్యక్రమం జరగాలి ..?అంటే.. దాదాపు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరగాలి. ఉదాహరణకు ఈ ఏడాది కడపలో నిర్వహించిన మహానాడుకు.. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త.. రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డికి స్వయంగా చంద్రబాబు బాధ్యత అప్పగించారు. ఎందుకంటే.. పార్టీ తరఫున ప్రజలను కలుస్తుండడం, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం వంటివి పార్టీకి మేలు చేస్తున్నాయి.
మరి అలాంటిది దగ్గుబాటికి ఎందుకు అప్పగించలేదు? అంటే.. ఆయన వివాదాల చుట్టూ తిరగడం.. పార్టీలో నాయకులతో కయ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం.. సంచలన వ్యాఖ్యలు చేయడం.. ఆధిపత్య ధోరణి వంటివి పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు.. దగ్గుబాటి ప్రస్తావన కూడా లేకుండానే సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చివరిగా కూడా.. దగ్గుబాటి గురించి ఎక్కడా మాట్లాడక పోవడం గమనార్హం. సో.. దీనిని బట్టి ఎమ్మెల్యేకు చంద్రబాబు గట్టి షాకే ఇచ్చినట్టు అయింది. మరి ఆయన తెలుసుకుని పరిస్థితిని మార్చుకుంటారో లేదో చూడాలి.
