Begin typing your search above and press return to search.

'హౌస్‌వైఫ్' కాదు... భవిష్యత్తును మార్చే 'జనరేషన్'.. దుబాయ్ యువరాజు పోస్ట్ వైరల్

దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘హౌస్‌వైఫ్’ అనే పదానికి బదులుగా అధికారికంగా ‘జనరేషన్’ అనే పదాన్ని ఉపయోగించబోతున్నారనేది ఆ వార్త సారాంశం.

By:  A.N.Kumar   |   21 Jun 2026 7:00 PM IST
హౌస్‌వైఫ్ కాదు... భవిష్యత్తును మార్చే జనరేషన్.. దుబాయ్ యువరాజు పోస్ట్ వైరల్
X

దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘హౌస్‌వైఫ్’ అనే పదానికి బదులుగా అధికారికంగా ‘జనరేషన్’ అనే పదాన్ని ఉపయోగించబోతున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే యూఏఈ ప్రభుత్వం నుండి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ... ఈ వైరల్ పోస్ట్ వెనుక ఉన్న ఆలోచన మాత్రం సమాజంలో ఒక సరికొత్త, అద్భుతమైన చర్చకు తెరలేపింది. కేవలం ఒక పదంలో మార్పు గురించి కాకుండా, శతాబ్దాలుగా గృహిణుల పట్ల సమాజం చూపిస్తున్న దృక్పథాన్ని మార్చాల్సిన అవసరాన్ని దుబాయ్ యువరాజు గుర్తించినట్టుగా తెలుస్తోంది.

పదాలు మారాలి... ఆలోచనలు మారాలి

మనం నిత్యం ఉపయోగించే ‘హౌస్‌వైఫ్’ లేదా ‘హోమ్‌మేకర్’ అనే పదాలు కేవలం నాలుగు గోడల మధ్య జరిగే పనులను వంట చేయడం, ఇల్లు సర్దడం మాత్రమే ప్రతిబింబిస్తాయి. కానీ ఒక మహిళ ఇంట్లో ఉండి చేసేది కేవలం ఇంటి పని మాత్రమే కాదు. ఆమె ఒక తరాన్ని నిర్మిస్తోంది. పిల్లలకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పే తొలి గురువు అమ్మే. రేపటి తరం పౌరుల వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దేది ఆమే. మానసికంగా, శారీరకంగా దృఢమైన పిల్లలను అందించడం ద్వారా ఆమె పరోక్షంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తోంది. అందుకే ఆమెను కేవలం 'ఇంటికే పరిమితమైన స్త్రీ'గా చూడటం ఆమె అమూల్యమైన త్యాగాలను తక్కువ చేసి చూపించడమే అవుతుంది. దానికి బదులుగా 'జనరేషన్' లేదా 'జనరేషన్ బిల్డర్' అని పిలవడం ఆమె బాధ్యతకు, గౌరవానికి ఇచ్చే నిజమైన నివాళి.

నెటిజన్ల మనసు గెలుచుకున్న 'వైరల్' కాన్సెప్ట్

"ఇల్లు సర్దేది కేవలం ఒక వ్యక్తి కాదు.. సమాజ భవిష్యత్తును నిర్మించే ఒక అద్భుత శక్తి." యూఏఈ యువరాజు ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. "ఒకవేళ దుబాయ్ యువరాజు నిజంగా ఈ నిర్ణయం తీసుకోకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి" అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళలు ఆఫీసులకు వెళ్లి సంపాదిస్తేనే గుర్తింపు ఇచ్చే నేటి రోజుల్లో... 24 గంటలు విరామం లేకుండా కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే అమ్మల పాత్రను గుర్తించడానికి ఇదొక గొప్ప వేదికగా మారింది.

గుర్తింపు ఇంట్లోనే మొదలవ్వాలి

ప్రభుత్వాలు చట్టాలు చేయడం లేదా అధికారిక పదాలను మార్చడం ఒక ఎత్తయితే... మన ఇంట్లో ఉండే అమ్మకు, భార్యకు మనం ఇచ్చే గౌరవం మరో ఎత్తు. ఆఫీసు ఉద్యోగానికి సెలవులు, జీతాలు ఉంటాయి, కానీ గృహిణి పాత్రకు ఎలాంటి సెలవులు ఉండవు. ప్రతి గృహిణి ఒక 'జనరేషన్ క్రియేటర్' అనే సత్యాన్ని మనం ఒప్పుకోవాలి. వారి శ్రమను గుర్తించి, గౌరవించడం మనందరి బాధ్యత. పదాల్లోనే కాదు, మన ఆలోచనల్లో కూడా ఈ మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది.