స్పాన్సర్ అక్కర్లేదు.. జాబ్ ఆఫర్ అక్కర్లేదు! భారతీయుల కోసం దుబాయ్ కొత్త వీసా.. ఎలా అప్లై చేయాలంటే?
కానీ ఇప్పుడు ఎలాంటి ఉద్యోగం లేదా స్పాన్సర్‌షిప్ లేకుండానే దుబాయ్‌కి వెళ్లి నేరుగా ఉద్యోగం వెతుక్కునేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం 'దుబాయ్ జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ విజిట్ వీసా'ను అందుబాటులోకి తెచ్చింది.
By: A.N.Kumar | 13 Sept 2026 12:00 AM ISTయూఏఈలో ఉద్యోగం సాధించి స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ నిరుద్యోగులు, ప్రొఫెషనల్స్‌కు ఇది నిజంగా శుభవార్తే.. ఇప్పటివరకు అక్కడి కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ లేదా స్థానిక స్పాన్సర్ ఉంటేనే యూఏఈ ఎంట్రీ సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఎలాంటి ఉద్యోగం లేదా స్పాన్సర్‌షిప్ లేకుండానే దుబాయ్‌కి వెళ్లి నేరుగా ఉద్యోగం వెతుక్కునేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం 'దుబాయ్ జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ విజిట్ వీసా'ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్రత్యేక వీసా ద్వారా అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు లీగల్‌గా దుబాయ్‌లో అడుగుపెట్టి అక్కడి కంపెనీలను నేరుగా సంప్రదించవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరుకావడం, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను కలవడం మరియు స్థానిక జాబ్ మార్కెట్‌ను స్వయంగా పరిశీలించే వీలుంటుంది.
వీసా వ్యవధి ఎంతంటే?
అభ్యర్థులు తమ అవసరానికి తగినట్లుగా 60 రోజులు, 90 రోజులు లేదా 120 రోజుల వ్యవధితో కూడిన వీసాలను ఎంచుకోవచ్చు. వర్తించే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఈ వ్యవధిని మరికొన్ని రోజులు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ కాలపరిమితి గరిష్టంగా 180 రోజుల వరకు చేరే వెసులుబాటు ఉంది.
ఎవరెవరు అర్హులు?
ఈ వీసాను ప్రధానంగా నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం రూపొందించారు. దరఖాస్తుదారులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యాభ్యాసం పూర్తి చేసి ఉండాలి. యూఏఈ మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్.ఆర్ఈ) కేటాయింపుల ప్రకారం స్కిల్ లెవెల్ 1, 2 లేదా 3 కిందకు వచ్చే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలోని టాప్-500 యూనివర్సిటీల్లో గత రెండేళ్లలో డిగ్రీ పూర్తి చేసిన తాజా గ్రాడ్యుయేట్లకు కూడా కొన్ని నిబంధనలతో అర్హత లభిస్తుంది. దుబాయ్‌లో ఉన్నన్ని రోజులు సొంత ఖర్చులను భరించగలమని నిరూపించేందుకు బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఆర్థిక స్థోమత ఆధారాలు చూపాల్సి ఉంటుంది.
కావాల్సిన ముఖ్యాంశాలు.. డాక్యుమెంట్లు
కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉన్న ఒరిజినల్ పాస్‌పోర్ట్. ఇటీవల తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు... అధికారికంగా అటెస్టేషన్ చేయించిన విద్యా అర్హత పత్రాలు... జీడీఆర్ఎఫ్ఏ దుబాయ్ లేదా యూఏఈ ఐసీపీ అధికారిక పోర్టల్స్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత ఫీజు చెల్లించి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తే ఇ-వీసా జారీ అవుతుంది. ఈ వీసా కేవలం ఉద్యోగం వెతుక్కోవడానికి ఇచ్చే అనుమతి మాత్రమే తప్ప, ఉద్యోగానికి గ్యారెంటీ కాదు. కాబట్టి ప్రయాణానికి ముందే తగినంత ఆర్థిక సన్నాహాలు చేసుకోవడం మంచిది. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికే నకిలీ ఏజెంట్లను నమ్మి సొమ్ములు నష్టపోవద్దు. అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సమాచారాన్ని సరిచూసుకుని ముందడుగు వేయడం శ్రేయస్కరం.
