దుబాయ్ లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఇండియాపై భారం తప్పదా?
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.
By: Madhu Reddy | 9 March 2026 4:05 PM ISTపశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ గోల్డ్ మార్కెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎప్పుడూ లేని విధంగా అంతర్జాతీయ ధరల కంటే తక్కువకే బంగారాన్ని విక్రయించేందుకు అక్కడి వ్యాపారులు సిద్ధమయ్యారు. భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నా కొనుగోలుదారులు మాత్రం వెనకాడుతున్నారు.ఇక ఈ పరిణామాలు మన దేశంలోని సామాన్య వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం..
దుబాయ్‌లో ఆఫర్ల వెల్లువ.. ఎందుకీ నిర్ణయం:
యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో విమాన రాకపోకలు, నౌకా రవాణా పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో నిల్వ ఉన్న బంగారాన్ని అమ్మడం, తరలించడం దుబాయ్ వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అనిశ్చితిని అధిగమించడానికి ఔన్సు (సుమారు 28 గ్రాములు) బంగారంపై దాదాపు 30 డాలర్ల (సుమారు ₹2,800) వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆర్డర్ డెలివరీ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో, కస్టమర్లను ఆకర్షించేందుకు ట్రేడర్లు ఈ భారీ తగ్గింపును ప్రకటించారు. అయినప్పటికీ, యుద్ధ భయాల మధ్య కొత్త ఆర్డర్లు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
రవాణా కష్టాలు.. పెరగనున్న ఇన్సూరెన్స్ ఖర్చులు:
బంగారం ధర తగ్గినా, దానిని భారత్ వంటి దేశాలకు తరలించడం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. యుద్ధం వల్ల సముద్ర, వైమానిక మార్గాల్లో ముప్పు పెరగడంతో షిప్పింగ్ ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇక ఈ అదనపు భారం వల్ల దుబాయ్‌లో లభించే డిస్కౌంట్ ప్రయోజనం కస్టమర్లకు అందడం లేదు. ఫలితంగా, అక్కడి నుంచి తక్కువ ధరకు బంగారం తెచ్చుకోవాలని చూసే భారతీయ వ్యాపారులు మరియు పర్యాటకులు ఇప్పుడు డైలమాలో పడిపోయారు.
భారతీయులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది:
దుబాయ్‌లో డిస్కౌంట్లు ఉన్నప్పటికీ, మన దేశంలో బంగారం ధరలు తగ్గుతాయని ఆశించడం కష్టమే. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇక దీనివల్ల ఇక్కడ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే, పెళ్లిళ్ల సీజన్ నాటికి బంగారం సామాన్యుడికి భారంగా మారవచ్చు. దుబాయ్ వ్యాపారులు ఇస్తున్న ఆఫర్లను మన వాళ్లు అందిపుచ్చుకోలేకపోవడం వల్ల అంతిమంగా వినియోగదారులపైనే ఆ భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
