గ్లోబల్ ఇమేజ్‌పై డిజిటల్ డ్యామేజ్.. ఒకరి చర్యలతో మొత్తం కమ్యూనిటీపై ప్రభావం
ఆధునిక డిజిటల్ ప్రపంచంలో వైరల్ అవ్వడమే ఏకైక లక్ష్యంగా మారడంతో క్రియేటర్లు తమ విలువలను, కనీస మానవ హక్కులను మర్చిపోతున్నారు.
By: Madhu Reddy | 23 Sept 2026 5:37 PM ISTసోషల్ మీడియాలో కొన్ని లైక్లు, వ్యూస్ కోసం హద్దులు దాటి ప్రవర్తించడం ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్‌గా మారింది. దుబాయ్ బీచ్‌లో బంగ్లాదేశ్ కంటెంట్ క్రియేటర్ ఇమ్రాన్ హొస్సేన్ ఓ విదేశీ మహిళను అనుమతి లేకుండా వీడియో తీస్తూ, ఆమెను కావాలనే తాకిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఒకరి వికృత చేష్టల వల్ల విదేశాల్లో నివసించే ఆయా దేశాల ప్రజల పట్ల, దక్షిణాసియా కమ్యూనిటీపై సోషల్ మీడియా సమాజం చూసే కోణమే మారిపోతోంది..ఆ వివరాలు చూద్దాం..
వ్యూస్ పిచ్చి తెచ్చిన విపత్తు:
ఆధునిక డిజిటల్ ప్రపంచంలో వైరల్ అవ్వడమే ఏకైక లక్ష్యంగా మారడంతో క్రియేటర్లు తమ విలువలను, కనీస మానవ హక్కులను మర్చిపోతున్నారు. దుబాయ్ లాంటి పటిష్టమైన చట్టాలున్న దేశంలో పబ్లిక్ బీచ్‌లోకి వెళ్లి మహిళల అనుమతి లేకుండా వీడియోలు తీయడం, కావాలనే వారి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించడం అత్యంత నిందించదగ్గ విషయం. ఇక ఇది కేవలం ఒక క్రియేటర్ చేసిన తప్పు మాత్రమే కాదు, డిజిటల్ దురాశ మనుషులను ఎంతలా దిగజార్చుతుందో చెప్పే చేదు నిజం.
ఒకరి తప్పు.. కమ్యూనిటీకి శిక్ష:
విదేశాల్లో పనిచేసే వలసదారులు లేదా టూరిస్టులు చాలా క్రమశిక్షణతో, కష్టపడి తమ గుర్తింపును నిర్మించుకుంటారు. కానీ ఇమ్రాన్ లాంటి ఒకరిద్దరు ఆకతాయిలు చేసే ఇలాంటి పనుల వల్ల అక్కడి స్థానికులలో, ప్రభుత్వం దృష్టిలో ఆ దేశానికి చెందిన మొత్తం పౌరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. "ఒక్క చుక్క విషం పాలు మొత్తాన్ని పాడుచేసినట్లు", ఒకరి వికృత చర్య వల్ల ఆసియా దేశాల నుంచి వచ్చిన మిగతా క్రియేటర్లు, టూరిస్టుల ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింటోంది.
చెరిగిపోని డిజిటల్ ఫుట్‌ప్రింట్:
నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడంతో ఆ క్రియేటర్ తన అకౌంట్ నుంచి వీడియోను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియా యుగంలో డిజిటల్ ఫుట్‌ప్రింట్ అనేది చాలా పవర్ ఫుల్. ఇక నెటిజన్లు ఆ వీడియోను స్క్రీన్ రికార్డ్ చేసి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని దుబాయ్ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని ఇది స్పష్టం చేస్తోంది.
గ్లోబల్ టూరిజంలో భద్రతా ముప్పు:
పర్యాటకరంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రత కలిగిన నగరంగా దుబాయ్‌కి మంచి పేరుంది. అయితే, ఇలాంటి సంఘటనలు విదేశీ మహిళలకు భద్రతా పరమైన ఆందోళనలను కలిగిస్తాయి. ఇక ఫలితంగా దుబాయ్ సైబర్ చట్టాల ప్రకారం ఇతరుల ప్రైవసీని దెబ్బతీసే వారిపై భారీ జరిమానాలు, జైలు శిక్షలు, దేశం నుంచి పంపించివేసే కఠిన నిబంధనలను మరింత పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
క్రియేటివిటీకి హద్దులు ఉండాలి:
సోషల్ మీడియా క్రియేటర్లు తమ వినోదం లేదా వ్యూస్ కోసం ఎదుటివారి స్వేచ్ఛను, గౌరవాన్ని బలిపెట్టడం ఎంత మాత్రం సరికాదు. గ్లోబల్ వేదికలపై మన ప్రవర్తనే మన దేశానికి, మన సంస్కృతికి అద్దం పడుతుంది. వ్యక్తిగత ప్రచార పిచ్చి కోసం కమ్యూనిటీ గౌరవాన్ని తాకట్టు పెట్టే క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే డిజిటల్ ప్రపంచంలో ఇతరుల ప్రైవసీకి రక్షణ దక్కుతుంది.
