‘35’ పరీక్షల్లో పాస్.. ఈ టెస్టులో మాత్రం ఫెయిల్.. జర జాగ్రత్త
సాధారణంగా పరీక్షల్లో కాస్త బ్యాడ్ స్టూడెంట్ ఎవరైనా ‘35’ మార్కులు వస్తే చాలురా భగవంతుడా అని ప్రార్థిస్తుంటారు
By: Garuda Media | 1 Jan 2026 1:57 PM ISTసాధారణంగా పరీక్షల్లో కాస్త బ్యాడ్ స్టూడెంట్ ఎవరైనా ‘35’ మార్కులు వస్తే చాలురా భగవంతుడా అని ప్రార్థిస్తుంటారు. ఈ మార్కులు వస్తే చాలు పరీక్ష గండం నుంచి తప్పించుకున్నట్లే. కానీ.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో మాత్రం సీన్ అందుకు భిన్నం. ఈ పరీక్షలో ‘35’ మార్కులు (బీఏసీ) అస్సలే రావొద్దు. పోలీసులు నిర్వహించే పరీక్షలో మాత్రం ఈ స్కోర్ వస్తే మాత్రం కేసులు. ఫైన్లు.. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
తరచూ మందుబాబులు చేసే తప్పుల్లో ఒకటి తాగేసి వాహనదారులు తరచూ చేసే తప్పులు డ్రైవింగ్ చేయటం. వీరు చేసే తప్పునకు వీరు మాత్రమే కాదు.. అమాయకులు సైతం బలి అవుతుంటారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు కారణమైన డ్రంకెన్ డ్రైవ్ ను అదుపు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు తరచూ ఈ పరీక్షలు చేయటం తెలిసిందే. ఈ అంశంపై ఎన్ని చర్యలు చేపట్టినా.. తాగి వాహనాలు నడిపే వాహనదారుల సంఖ్య పెరుగుతోంది. దీనికి సంబంధించిన కేసుల నమోదు కూడా ఏడాదికేడాది పెరుగుతూనే వస్తోంది.
2025 డిసెంబరు రెండో వారం వరకు హైదరాబాద్ మహానగరం పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ లో మొత్తం 13 వేల డ్రైవింగ్ లైసెన్సుల్ని రద్దు చేశారు. ఒక్క రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 5821 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ.. ఈ తీరుకు చెక్ పెట్టే చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి సజ్జన్నార్.. డ్రంకెన్ డ్రైవ్ అంశంపై వాహనదారులకు మరింత అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పరీక్ష నిర్వహించినప్పుడు 35 అస్సలు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ‘35’ టచ్ అయితే ఔట్ అయినట్లేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీపీ స్పష్టం చేస్తున్నారు. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిందేకు పెద్ద ఎత్తున డిసెంబరు 31న రాత్రి వేళ పూటుగా తాగేసే తీరు చాలామందిలో కనిపిస్తుంది.
ఇలాంటి వారికి సజ్జన్నార్ మార్కు వార్నింగ్ బాగానే పని చేసినట్లుగా చెబుతున్నారు. తాగి వాహనాల్ని నడిపే వారికి హెచ్చరికలు జారీ చేస్తూ.. ‘విద్యార్థి పరీక్షలో తప్పితే ఏడాది మాత్రమే పోతుంది.. అదే రోడ్డు మీద తేడా జరిగితే లైఫ్ ఆగం అవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు’ అని స్పష్టం చేస్తున్నారు. మందుబాబులకు ఒక్కసారి దిగేలా సజ్జన్నార్ తాజా మాటలు ఉన్నాయని చెప్పాలి. తాగి వాహనాలు నడిపే వారికి చేస్తున్న తాజా హెచ్చరిక అందరిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.
