'తాగిన డ్రైవర్లు ఉగ్రవాదులు'... హైదరాబాద్ టాప్ కాప్ సంచలనం!
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ బస్సు కర్నూలు జిల్లాలో జాతీయ రహదారి 44పై ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 26 Oct 2025 6:00 PM ISTహైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ బస్సు కర్నూలు జిల్లాలో జాతీయ రహదారి 44పై ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా 19 మంది సజీవదహనం అయ్యారు. బస్సులో సీట్ల మధ్య మాంసపు ముద్దలుగా, బూడిద కుప్పలుగా మిగిలారు. ఈ ఘటనకు ప్రాథమికంగా బైకర్ మద్యం మత్తు కారణం అని చెబుతున్నారు.
శివశంకర్ అనే బైకర్, తన పల్సర్ బైక్ పై మద్యం మత్తులో వేగంగా వెళ్లి, డివైడర్ ను ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో అతని బైక్ రోడ్డుపై పడిపోయింది. ఈ సమయంలో అటుగా వేగంగా వెళ్తున్న కావేరీ బస్సు ఆ బైక్ ను ఢీకొని, సుమారు 200 మీటర్లు లాక్కుని వెళ్లిపోవడంతో రాపిడికి నిప్పు రాజుకుని బస్సు మొత్తం తగలబడిపోయింది.
దీంతో... మద్యం మత్తు రాసిన మరణ శాసనం అనే విషయం వైరల్ గా మారింది. ఒక్కవ్యక్తి తాగి బైక్ నడపడం వల్ల పదుల సంఖ్యలో తీవ్ర విషాదం, తీరని శోకం ఏర్పడిన పరిస్థితి. అందుకే తాగి వాహనాలు నడపరాదని పోలీసులు నిత్యం హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ పలువురు మారడం లేదు. ఈ సమయంలో ఈ సమయంలో వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ గా స్పందించారు.
అవును... కర్నూలులో బస్సు అగ్నిప్రమాదంలో 19 మంది మరణించిన ఘటన తరువాత.. తాగి వాహనం నడిపే వారు ఉగ్రవాదులు అని చెబుతూ.. మద్యం తాగి వాహనం నడిపే ఎవరిపై హైదరాబాద్ పోలీసులు కనికరం చూపరని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఉగ్రవాదుల చర్యలు మన రోడ్లపై జరిగే ఉగ్రవాద చర్యలకు తక్కువ కాదని తెలిపారు.
ఈ సందర్భంగా... 20 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న భయంకరమైన కర్నూలు బస్సు ప్రమాదం, నిజమైన అర్థంలో ప్రమాదం కాదు.. ఇది నివారించగల మారణహోమం. మద్యం మత్తులో ఉన్న బైకర్ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్ల జరిగింది. ప్రమాదం కాదు, నిర్లక్ష్యపు నేరపూరిత చర్య. ఇది క్షణాల్లోనే కుటుంబాలను నాశనం చేసిందని అన్నారు.
ఇదే సమయంలో... శివ శంకర్ గా గుర్తించబడిన బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం అని చెప్పిన సజ్జనార్... సీసీటీవీ ఫుటేజ్ లో అతను తెల్లవారుజామున 2:24 గంటలకు.. అంటే అది ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు తన బైక్ కు ఇంధనం నింపుకుంటున్నట్లు చూపిస్తుందని.. తాగి వాహనం నడపాలనే అతని నిర్ణయం అహంకార క్షణాన్ని ఊహించలేని స్థాయిలో విషాదంగా మార్చిందని సజ్జనార్ అన్నారు.
ఇదే క్రమంలో... 'తాగిన డ్రైవర్లు అన్ని విధాలుగా ఉగ్రవాదులే అనే నా ప్రకటనకు నేను గట్టిగా కట్టుబడి ఉన్నాను.. వారు జీవితాలను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తారు.. ఇలాంటి చర్యలను ఎప్పటికీ సహించను' అని సజ్జనార్ జోడించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారో చెప్పండని అన్నారు.
'మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?' అని ప్రశ్నించిన సజ్జనార్... సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి అని ప్రజలకు సూచించారు. ఇలాంటి వారి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండని ప్రజలను కోరారు. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారని హెచ్చరించారు!
