Begin typing your search above and press return to search.

భాగ్యనగరానికి ఏమైంది? స్కూల్లోనే డ్రగ్స్ తయారీ!

కట్ చేస్తే.. తాజాగా అంతకు మించిన ఆరాచక ఘటన వెలుగు చూసింది. భాగ్యనగరి పరిధిలోని ఒక స్కూల్లో డ్రగ్స్ తయారీ దుకాణాన్ని పెట్టేసిన దుర్మార్గం వెలుగు చూసింది.

By:  Garuda Media   |   14 Sept 2025 9:32 AM IST
భాగ్యనగరానికి ఏమైంది? స్కూల్లోనే డ్రగ్స్ తయారీ!
X

హైదరాబాద్ మహానగరానికి ఏమైంది? ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగిందన్న వార్తలు.. ఈ వాదనకు బలం చేకూరేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తరచూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. డ్రగ్స్ ను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని చెబుతున్నప్పటికీ.. ఆ వేర్లు ఎంత లోతుగా పాతుకుపోయాయన్న విషయం ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. వారం క్రితమే హైదరాబాద్ మహానగర శివారులోని చర్లపల్లిలోని ఒక ఫార్మా కంపెనీ ముసుగులో డ్రగ్స్ ను భారీగా తయారు చేస్తున్న వైనం వెలుగు చూసి అవాక్కు అయ్యేలా చేసింది.

కట్ చేస్తే.. తాజాగా అంతకు మించిన ఆరాచక ఘటన వెలుగు చూసింది. భాగ్యనగరి పరిధిలోని ఒక స్కూల్లో డ్రగ్స్ తయారీ దుకాణాన్ని పెట్టేసిన దుర్మార్గం వెలుగు చూసింది. ఓవైపు స్కూల్ నడుపుతూనే.. మరోవైపు అదే స్కూల్లోనిరెండో అంతస్తులో మత్తుమందు తయారీ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్న విషయం పెను సంచలనంగా మారింది. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లిలోని మేధా ప్రైవేటు స్కూల్ ఈ దారుణానికి వేదికగా మారింది.

డ్రగ్స్ పై యుద్ధానికి రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీంలలో ఈగిల్ ఒకటి. డ్రగ్స్ తయారీకి సంబంధించి లభించిన విశ్వసనీయ సమాచారాన్ని అందుకున్న ఈ టీం స్కూల్ మీద దాడి చేయటంతో.. అల్ర్ఫాజోలం పెద్ద ఎత్తున తయారు చేస్తున్న వైనం వెలుగు చూసింది. పాఠశాల ఉన్న రెండో అంతస్తులోని ఒకవైపు ఉన్న రెండు గదుల్లో స్కూల్ ను నిర్వహిస్తున్న జయప్రకాష్ గౌడ్ అల్ర్పాజోలం తయారీ యంత్రాలతో మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. రెండేళ్ల క్రితం నుంచి సాగుతున్న ఈ అరాచకం తాజాగా వెలుగు చూసింది.

ఉదయం వేళల్లో ఎవరికి అనుమానం రాకుండా స్కూల్ ను నిర్వహిస్తూ.. ఇదే ఆవరణలోని రెండు గదుల్లో అల్ఫాజోలం తయారు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ఉన్న వారికి సైతం ఎలాంటి అనుమానం రాకుండా చేసిన ఏర్పాట్లు విస్మయానికి గురి చేస్తున్నాయి. ముడిసరుకును రసాయన దుకాణాల్లో కొనుగోలు చేసి.. ఆరు నుంచి ఏడు దశల్లో ప్రాసెస్ చేసి అల్ర్పాజోలంను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు.

తాజాగా నిర్వహించిన దాడుల్లో రూ.20 లక్షల మేర నగదుతో పాటు రూ.కోటి విలువ చేసే ఏడు కేజీల అల్ర్పాజోలంను స్వాధీనం చేసుకున్నారు. దీనికి కారణమైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. వీరి వెనుక ఉన్నదెవరు? వీరు తయారు చేసిన ఈ డ్రగ్ ను ఎక్కడికి సరఫరా చేస్తున్నారు? తయారీకి సంబంధించిన టెక్నాలజీ ఎలా డెవలప్ చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఏమైనా స్కూల్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీని సెట్ చేసిన వైనం చూస్తే.. హైదరాబాద్ లో మత్తుమందు మాఫియా ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.