Begin typing your search above and press return to search.

విశాఖకు రాష్ట్రపతి...ఆ కార్యక్రమం ప్రత్యేకం

ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి లో విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్షను సమీక్షించడానికి రాష్ట్రపతి రెండోసారి వచ్చారు.

By:  Satya P   |   26 Jun 2026 6:00 AM IST
విశాఖకు రాష్ట్రపతి...ఆ కార్యక్రమం ప్రత్యేకం
X

భారత రాష్ట్రపతిగా 2022 జూలైలో బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము తన పదవీ కాలంలో ఇప్పటికి రెండు సార్లు విశాఖ సందర్శించారు. ముచ్చటగా మూడోసారి ఆమె ఈ నెల 30న విశాఖ వస్తున్నారు. దాంతో దేశ ప్రధమ పౌరురాలికి ఘన స్వాగతం పలికేందుకు విశాఖ సిద్ధం అవుతోంది. అంతే కాదు, రాష్ట్రపతి వస్తున్న తరుణంలో భద్రతను పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తున్నారు.

తొలి స్నాతకోత్సవంలో :

ఇదిలా ఉంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయనగరంలో ఏర్పాటు చేసిన గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాత కోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం విభజన తరువాత ఈ వర్శిటీని ఉత్తరాంధ్రాలోని విజయనగరానికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక తొలి స్నాతకోత్సవానికి ద్రౌపది ముర్మునే ఆహ్వానించాలని వర్శిటీ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. దాంతో ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రావడం విశేషంగానే చూస్తున్నారు. ఇక రాష్ట్రపతి ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆమె బెంగుళూరు వెళ్తారు.

గతంలో రెండు సార్లు :

ఇక రాష్ట్రపతి గతంలో రెండు సార్లు విశాఖ సందర్శించారు. రాష్ట్రపతి అయిన అయిదు నెలల తేడాలోనే 2022 డిసెంబర్ 4న విశాఖలో జరిగిన అంతర్జాతీయ నావికాదళ ఉత్సవాలకు రాష్ట్రపతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి లో విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్షను సమీక్షించడానికి రాష్ట్రపతి రెండోసారి వచ్చారు. ఇపుడు మూడోసారి ఆమె రాక కావడంతో తగిన విధంగా స్వాగత సత్కారాలకు విశాఖ ముస్తాబు అవుతోంది.

వచ్చే ఏడాది పదవీ విరమణ :

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే ఏడాది పదవీ విరమణ చేస్తారు. ఆమె అయిదేళ్ల పదవీ కాలం 2027 జూలైతో ముగుస్తోంది. ఒడిషాకు చెందిన ద్రౌపది ముర్ము ఈ అత్యున్నత పదవిని అందుకున్న దేశంలో తొలి ఆదివాసీ మహిళగా రికార్డు సృష్టించారు. తన పదవీకాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలలో ఆమె విరివిగా పర్యటించారు. విదేశీ యాత్రలు కూడా అనేకం చేశారు. ఆమె ఎక్కువగా విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు హాజరు కావడం విశేషం. తద్వారా దేశానికి అసలైన పెట్టుబడిగా ఉన్న యువతకు స్పూర్తివంతమైన సందేశం ఇస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కర్తవ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గిరిజన వర్శిటీ తొలి స్నాతకోత్సవం కూడా రాష్ట్రపతి రాక కోసమే గతంలో వాయిదా వేసుకున్నారు. ఆమె చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరగాలని నిర్వాహకులు కృత నిశ్చయంతో ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఏడాది మాత్రమే పదవీ కాలం ఉన్న రాష్ట్రపతి ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 4న జరిగే నేవీ డేకి అటెండ్ అవుతారు అని అధికారులు అంటున్నారు.