హెలీకాప్టర్ ల్యాండ్ అవుతుండగా రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్!
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ లో అక్టోబర్ 22న శబరిమల ఆలయంలో దర్శనం, హారతి నిర్వహించడం ఉంటుంది.
By: Raja Ch | 22 Oct 2025 12:26 PM ISTకేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఉన్న స్థలం ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో.. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. హెలికాప్టర్ కిందకు దిగిపోకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
అవును... నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కేరళకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ఇందులో భాగంగా.. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్, కేరళలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన తర్వాత హెలిప్యాడ్ ఉపరితలం కొన్ని క్షణాల్లో పాక్షికంగా కూలిపోయింది. దీంతో.. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అలర్ట్ అయ్యి, ఆ హెలీకాప్టర్ ను ముందుకు నెట్టారు!
వివరాళ్లోకి వెళ్తే... నాలుగు రోజుల కేరళ పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తిరువనంతపురం వచ్చారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేసిన ఆమె.. బుధవారం ఉదయం శబరిమల ఆలయ దర్శనానికి బయల్దేరారు. ఈ క్రమంలో.. రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ దిగుతుండగా హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది.
దీంతో.. హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి కిందకు దించారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆమె పంబకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వాస్తవానికి రాష్ట్రపతి హెలికాప్టర్ పంబ సమీపంలోని నీలక్కల్ దగ్గర దిగాల్సింది కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ ను మార్చారు.
ఈ సందర్భంగా స్పందించిన ఓ అధికారి... కాంక్రీటు పూర్తిగా గట్టిపడలేదని, అందువల్ల హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు దాని బరువును అది తట్టుకోలేకపోయిందని.. చక్రాలు నేలను తాకిన చోట లోయలు ఏర్పడ్డాయని చెప్పారు.
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ లో అక్టోబర్ 22న శబరిమల ఆలయంలో దర్శనం, హారతి నిర్వహించడం ఉంటుంది. అక్టోబర్ 23న తిరువనంతపురంలోని రాజ్ భవన్ లో మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరిస్తారు. వర్కాలలోని శివగిరి మఠంలో శ్రీనారాయణ గురువు మహాసమాధి శత జయంతి ఉత్సవాలను ఆమె ప్రారంభిస్తారు.
అదేరోజు పాలైలోని సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఇక.. అక్టోబర్ 24న ఆమె షెడ్యూల్ లో ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడం ఉంది. అనంతరం ఆమె తిరిగి హస్తినకు బయలుదేరతారు.
కాగా... రాష్ట్రపతి ముర్ము కేరళ పర్యటన అక్టోబర్ 24న ముగుస్తుంది. ఆమె మంగళవారం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో... గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఆమెకు స్వాగతం పలికారు.
