Begin typing your search above and press return to search.

ఏజెన్సీ వైద్యానికి డ్రోన్ల సేవలు...వాటే ఐడియా !

ఇక ఈ తరహా కార్యక్రమం దేశంలో ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో విజయవంతంగా అమలు అవుతోంది. దాంతో అక్కడ సేవలు అందిస్తున్న రెడ్ వింగ్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

By:  Satya P   |   25 Dec 2025 8:15 AM IST
ఏజెన్సీ వైద్యానికి డ్రోన్ల సేవలు...వాటే ఐడియా !
X

ఏజెన్సీలలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కనిపించడం లేదు. మందూ మాకూ లేక ఎంతో మంది చనిపోతున్నారు. చాలా మంది కొండలు దిగి రావాలని అనుకున్నా రవాణా సదుపాయాలు లేక మధ్యలోనే మరణిస్తున్నారు. నిజంగా గిరిజన ప్రాంతాలలో వైద్యం ఒక సవాల్ గా మారింది. ప్రభుత్వాలు వెళ్ళి చేయలేకపోతున్నాయి. వారికి తగిన సదుపాయాలు అందడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ప్రైవేట్ సంస్థతో ఒప్పందం :

ఈ విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థతో వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా వైద్య సేవలు నిర్వహించేందుకు ప్రైవేట్ సంస్థ ముందుకు వచ్చింది. దాంతో మారు మూల ప్రాంతాలకు కూడా ఇక మీదట వైద్యం సత్వరమే అందే సదుపాయం ఏర్పడుతోంది.

కొత్త ఏడాది నుంచి :

ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడైనా మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు వీలు అవుతుంది. ఈ దిశగా వైద్యాన్ని గిరిజన ప్రాంతాలకు దగ్గర చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ అనే సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూర ప్రదేశాలలోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు ఇక మీదట అందుతాయి. అంతే కాకుండా బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేసేందుకు సైతం ఈ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

మొదట ఉచితంగానే :

ఇక ఈ తరహా కార్యక్రమం దేశంలో ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో విజయవంతంగా అమలు అవుతోంది. దాంతో అక్కడ సేవలు అందిస్తున్న రెడ్ వింగ్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలా రాష్ట్రంలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఏపీలో ఆరేడు నెలల ఉచితంగానే ఈ డ్రోన్ల సేవలు అందించడానికి ఈ సంస్థ అంగీకరించిందని చెబుతున్నారు. ఇక ఈ ఒప్పందం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్ రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి మధ్య కుదిరినట్లుగా చెబుతున్నారు.

పాడేరు కేంద్రంగానే :

ఈ ఒప్పందం ప్రకారం పాడేరును ప్రధాన కేంద్రంగా చేసుకుని ఆ సమీపంలోని ఏకంగా 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్‌ సేవలు అందుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ డ్రోన్లలో మందులు వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం కూడా ఉంటుంది అలాగే, ఒక్కో డ్రోన్ సుమారు రెండు కేజీల బరువును మోసుకెళ్ళే సామర్థ్యంతో పనిచేస్తుందని అంటున్నారు. ఇక ఈ డ్రోన్లు కేవలం మందులు తీసుకెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు తీసుకొస్తాయి. ఇక వచ్చే నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభమ‌వుతాయని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్ తెలిపారు.

కేజీహెచ్ నుంచి నేరుగా :

అంతే కాదు అల్లూరి జిల్లాలోని గిరిజన కొండ ప్రాంతాలలోని రోడ్డు మార్గాల ద్వారా మందులు పంపడం కష్టతరమైన క్లిష్టతరమైన పనిగా ఉంటుంది. టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. దాంతో అత్యవసర సమయాలలో రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా డ్రోన్ల వినియోగంపై కూట‌మి ప్ర‌భుత్తం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ‌ కేజీహెచ్ నుంచి పాడేరుకు మందుల రవాణాకు కూడా విస్తరింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఏజెన్సీకి మందులు వైద్యం సరఫరా చేయడం అన్నది గొప్ప ఆలోచనగా చెబుతున్నారు. దీని వల్ల గిరిజనులకు మంచి మందులు సకాలంలో వైద్యం అందుతాయని అంటున్నారు.