Begin typing your search above and press return to search.

ఆమె ఓడిపోయింది !

అవును ఆమె ఓడిపోయింది. ఈ సమాజంతో కలసి బతకలేక లోకాన్ని వీడిపోయింది. ఎంతో అందమైన భవిష్యత్తును ఊహించుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమె బతుకు అర్ధాంతరంగా నేల రాలింది.

By:  Satya P   |   10 Aug 2026 9:27 AM IST
ఆమె ఓడిపోయింది !
X

అవును ఆమె ఓడిపోయింది. ఈ సమాజంతో కలసి బతకలేక లోకాన్ని వీడిపోయింది. ఎంతో అందమైన భవిష్యత్తును ఊహించుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమె బతుకు అర్ధాంతరంగా నేల రాలింది. ఆమె డాక్టర్ ప్రియాంక. రాజమండ్రిలో ఒక మాల్ లో సినిమా చూసి బయటకు వస్తున్న ఆమెకు అక్కడే తనకు మృత్యువు రాసి పెట్టి ఉందని ఊహించి ఉండదు, ఎంతో ఆనందంగా తన స్నేహితుడితో కలసి సినిమా చూసి వస్తున్న ఆమెకు తన జీవితం కారు చక్రం కిందపడి చిద్రం అవుతుందని కలలో కూడా ఊహించి ఉండదు. ఇది తోడేళ్ళ సమాజం అని పక్కనే పొంచి ఉంటాయని కసిగా కాటు వేసి పోతాయని ఆమె అనుకుని ఉంటే కధ వేరేగా ఉండేదమో. కానీ సభ్య సమాజాన్ని నమ్మింది. పౌర సమాజం కదా అనుకుంది. నాగరీక లోకం అని పొరపడింది. కానీ చివరికి ఆమె నమ్మకం ఓడింది. ఆమె ఆశలు కూడా వీగిపోయాయి. ఆమె తనువు చాలించింది. ఇక ఈ లోకంతో పనిలేదంటూ సెలవు తీసుకుంది.

బరువెక్కిన హృదయం :

డాక్టర్ ప్రియాంక గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 22 నిముషాలకు తుది శ్వాస విడిచింది అన్న వార్త విన్న తెలుగు ప్రజానీకం గుండె ఒక్కసారిగా బరువెక్కింది. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరినీ ఇది ఎంతగానో కదిలించింది. ముక్కుపచ్చలారని జీవితం ఇలా ముగిసిపోవడం నిజంగా అత్యంత విషాదాన్ని తడి ఉన్న ప్రతీ గుండెలో నింపింది. ఆమె ఇక లేదు అన్నది విన్న తోటి స్నేహితులకు కూడా ఇది జీవిత కాలం మరచిపోలేని వార్త అనడంలో సందేహం లేదు.

ఎందుకిలా జరుగుతోంది :

నాగరీక ప్రపంచంలో ఉన్నామని అనుకుని భ్రమ పడుతున్నామా అని ఇలాంటి సంఘటనలు చూసినపుడు ఒక్కోసారి అనిపిస్తుంది. మనుషులుగా పైకి కనిపిస్తున్నా వెనక నీడలు భయంకరమైన రూపాలుగా మారి సాటి వారినే కబలించే దారుణమైన వ్యవస్థలో బతుకుతున్నామా అని కూడా అనిపిస్తోంది అంటే అంతా ఆలోచించాల్సిందే. ఇక్కడే కొన్ని మౌలికమైన ప్రశ్నలు అందరి మదిలోకి వచ్చి దొలిచేస్తున్నాయి. ఎవరైనా స్వేచ్చగా బయటకు రాకూడదా, వచ్చినా సవ్యంగా తిరిగి తమ ఇళ్లకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయా అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది.

తప్పు ఎవరిది అంటే :

ఇందులో తప్పు ఎవరిది అంటే మళ్ళీ సమాజం వైపు వేలెత్తి చూపించాల్సి ఉంటోంది. ఇందులో అందరి పాత్ర కూడా ఉంటోంది. తమ బిడ్డలను గారాబంగా పెంచుతూ వారికి ఏది కావాల్సి వస్తే అది అందిస్తూ వారి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే తల్లితండ్రుల నుంచి సమాజం పట్ల బాధ్యత నేర్పని చదువులు గురువులు బడులు గుడులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తలచుకోవాల్సి ఉంటుంది. అలాగే చట్టాల పట్ల భయం భక్తి కలిగేలా వ్యవస్థలు వాతావారణం ఏ మేరకు సహకరిస్తున్నాయన్నది కూడా మరో కొత్త చర్చ. ఇక మద్యపాన నిషేధం లేని రాజ్యం నాకు కావాలి అన్న మహాత్ముడి బొమ్మతో కరెన్సీని ముద్రించి అదే కరెన్సీని బార్ షాపులకు ఇస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల బారిన పడుతున్న భవిత ఇవన్నీ చూసినపుడు పౌర సమాజం ఎక్కడ ఉందో అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది.

నైతిక పతనంతోనే :

టెక్నినల్ గా ఎంత ఎదిగామన్నది కొలమానంగా చూస్తున్న వర్తమానంలో నైతికంగా ఎంత పాతాళానికి దిగజారుతున్నామన్నది కూడా తలచుకోవాలి. అపుడైనా ఏమైనా పరివర్తన వస్తుందేమో అన్నది పెద్దల మాట. ఏది ఏమైనా ఒక నిండు జీవితం బలి అయింది. ఒక యువతి బతుకు బూడిద అయింది. ఆ కుటుంబానికి ఈ సమాజం ఇచ్చిన బహుమతి ఇదా అని తలచుకుంటూంటేనే బాధ భయం కలుగుతోంది. ఎవరి జీవితాలను వారు హాయిగా గడిపేటంత స్వేచ్చను స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేని ఈ వాతావరణం మీద కూడా ఆవేదన కలుగుతోంది. ప్రియాంక మృతి ఒక హెచ్చరికగా చూడాలా అంటే ఏమో పౌర సమాజమే ఆలోచించాల్సి ఉంటుంది మరి.