Begin typing your search above and press return to search.

పనబాక కుమార్తెకు కీలక పదవి.. టీడీపీ అధిష్టానం సంకేతాలు

తిరుపతి జిల్లా పరిషత్ మొదటి ఛైర్‌పర్సన్‌గా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె డాక్టర్ పనబాక చేతన పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   30 Oct 2026 7:00 PM IST
పనబాక కుమార్తెకు కీలక పదవి.. టీడీపీ అధిష్టానం సంకేతాలు
X

తిరుపతి జిల్లా పరిషత్ మొదటి ఛైర్‌పర్సన్‌గా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె డాక్టర్ పనబాక చేతన పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ మహిళకు రిజర్వు అయిన తిరుపతి జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిని చేతనతోపాటు మాజీ ఎమ్మెల్యే హేమలత ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే యవత, విద్యావంతురాలు అన్న ఆలోచనతో అధిష్టానం డాక్టర్ చేతన పేరుపై మొగ్గు చూపుతోందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే డాక్టర్ చేతన పేరును ఖరారు చేసిందని, అధికారిక ప్రకటన ఒక్కటే విడుదల చేయాల్సివుందని అంటున్నారు. సీనియర్ నాయకురాలు పనబాక లక్ష్మి సేవలు, సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తగిన న్యాయం చేయాలనే ఆలోచనతో టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తొలి ఛైర్‌పర్సన్‌గా చేతన

తిరుపతి జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత జిల్లా పరిషత్‌కు జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి జిల్లా పరిధిలోకి చేరడంతో జడ్పీ పరిధి కూడా విస్తరించింది. ఈ నూతన జిల్లా పరిషత్‌కు తొలి ఛైర్‌పర్సన్‌గా విద్యావంతురాలు, యువ నాయకురాలు డాక్టర్ పనబాక చేతన పేరును అధిష్టానం ఖరారు చేసేందన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. శ్రీకాళహస్తి రూరల్ జడ్పీటీసీ సభ్యురాలిగా చేతన ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయంలోకి కొత్తగా అడుగుపెట్టినప్పటికీ, మొదటి ప్రయత్నంలోనే జడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొంది తన సత్తా చాటారు. ఇప్పుడు అధిష్టానం అవకాశం ఇస్తే, తిరుపతి జిల్లా పరిషత్‌కు మొట్టమొదటి జడ్పీ ఛైర్‌పర్సన్గా చరిత్రకెక్కే అవకాశముందని అంటున్నారు.

పనబాక లక్ష్మి సీనియార్టీకి గుర్తింపు

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికలతో పాటు, ఆ తర్వాత జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ పట్ల ఆమె చూపిన నిబద్ధత, సీనియార్టీని గుర్తించిన అధిష్టానం ఆమెకు టిటిడి బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించింది. అయినప్పటికీ, ఆమె ఉన్నత స్థాయి రాజకీయ అనుభవానికి తగినంత గుర్తింపు ఇంకా దక్కలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పనబాక లక్ష్మి కుమార్తె చేతనకు జిల్లా స్థాయిలో అత్యున్నతమైన జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టడం ద్వారా పనబాక కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేయాలని టీడీపీ యోచిస్తోందని అంటున్నారు.

ఉన్నత విద్యావంతురాలు

డాక్టర్ పనబాక చేతన డెర్మటాలజీ (చర్మ వైద్యం)లో ఎండి చేసిన ఉన్నత విద్యావంతురాలు. కేంద్ర మంత్రిగా పనిచేసినా ఎప్పుడూ వినయం, సౌశీల్యం, మృదుభాషణ విడవని పనబాక లక్ష్మి పెంపకంలో పెరిగిన చేతన, అదే సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులు కూడా గౌరవించే వ్యక్తిత్వం పనబాక లక్ష్మి సొంతమని, అటువంటి విలువలున్న కుటుంబం నుంచి వచ్చిన చేతన టీడీపీకి అత్యంత గౌరవప్రదమైన అభ్యర్థి అవుతారనడంలో సందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో పనబాక లక్ష్మి తిరుపతి లోక్‌సభకు పోటీ చేసిన సమయంలో చేతన విస్తృత ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ స్వల్ప రాజకీయ అనుభవంతో ఏకంగా జడ్పీ ఛైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.