Begin typing your search above and press return to search.

బర్త్ డే వేళ... జగన్ కేసుల విచారణపై కీలక అప్ డేట్!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కేసుల విచారణ విషయంలో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.

By:  Raja Ch   |   21 Dec 2025 11:49 PM IST
బర్త్ డే వేళ... జగన్ కేసుల విచారణపై కీలక అప్ డేట్!
X

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కేసుల విచారణ విషయంలో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ కేసుల్లో నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న డాక్టర్ కే పట్టాభి రామారావు విచారణను ప్రారంభించనున్నారు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు సుమారు 130 డిశ్ఛార్జ్ పిటిషన్ లను దాఖలు చేయగా.. వీటిపై విచారణ పూర్తికావడం లేదు.

అవును... జగన్ పై సీబీఐ 11, ఈడీ 9 అభియోగపత్రాలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటు నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డితో పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మి, మజీ ఐఏఎస్ లు శామ్యూల్, మన్మోహన్ సింగ్, వెంకట్రామిరెడ్డి, బీపీ ఆచార్యతో పాటు పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, రాంకీ అయోధ్యరామిరెడ్డి, ఇండియా సిమెంట్స్ ఎన్ శ్రీనివాసన్ ఉన్న సంగతి తెలిసిందే.

అయితే 2013లో దాఖలైన ఈ కేసుల్లో వీరంతా కలిసి సుమారు 130 డిశ్ఛార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇప్పటివరకూ 8 మంది న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. అయినప్పటికీ అవి పూర్తికాకముందే వారు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ప్రస్తుతం సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న డాక్టర్ టి. రఘురాం.. గతేడాది మేలో బాధ్యతలు స్వీకరించారు. అయితే.. ఆయన బదిలీతో వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

వాస్తవానికి తొలుత 2024 ఫిబ్రవరి 15, ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్ 30 విచారణలు పూర్తి చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాలను హైకోర్టు ఆదేశించింది. అయితే.. 2024 ఏప్రిల్‌ లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 47 మంది జిల్లా జడ్జీల బదిలీల్లో భాగంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు. వారందరూ మే 1లోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలివ్వగా, అప్పటి సీబీఐ కోర్టు న్యాయమూర్తికి మాత్రం మినహాయింపునిస్తూ మే 1న రిలీవ్‌ కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో తీర్పును సిద్ధం చేయలేకపోయినట్లు ఆయన హైకోర్టుకు లేఖ రాసి రిలీవ్‌ అయ్యారు. అనంతరం వచ్చిన డాక్టర్‌ టి.రఘురాం డిశ్ఛార్జి పిటిషన్‌ లపై తిరిగి విచారణ ప్రారంభించి రోజువారీ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కూడా బదిలీ అవ్వడంతో.. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న డాక్టర్‌ పట్టాభి రామారావు మళ్లీ విచారణను ప్రారంభించనున్నారు.