Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో మందులకూ లొంగని స్క్రబ్ టైఫస్ మహమ్మారి.. డేంజర్ బెల్స్?

ఆంధ్రప్రదేశ్ లో మాయదారి మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇది ప్రాణాంతకంగా మారి ఉసురు తీస్తోంది.

By:  A.N.Kumar   |   11 Dec 2025 11:26 AM IST
ఆంధ్రాలో మందులకూ లొంగని స్క్రబ్ టైఫస్ మహమ్మారి.. డేంజర్ బెల్స్?
X

ఆంధ్రప్రదేశ్ లో మాయదారి మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇది ప్రాణాంతకంగా మారి ఉసురు తీస్తోంది. ఎంతలా అంటే ఇది మందులకూ లొంగకుండా ప్రాణాల మీదకు తెస్తోంది. దీంతో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని స్క్రబ్ టైఫస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరింత ఆందోళన కలిగించే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి చికిత్సకు ప్రధానంగా వాడే యాంటీబయాటిక్స్ ‘డాక్సీ సైక్లిన్’ అనే మందు ప్రభావం ఇప్పుడు చాలా కేసుల్లో పనిచేయడం లేదని వైద్య నిఫుణులు వెల్లడించారు. వ్యాధికారక క్రిములు ఔషధాలను తట్టుకునే శక్తి అంటే డ్రగ్ రెసిస్టెన్స్, పెంచుకోవడంతో చికిత్స క్లిష్టంగా మారుతోంది.

డ్రగ్ రెసిస్టెన్సే ఆందోళనకు కారణం..

స్రబ్ టైఫస్ కు కారణమయ్యే ఒరియెంటియా సుట్సుగముషి అనే సూక్ష్మ క్రిమి యాటీ బయాటిక్లకు ప్రతిస్పందించకుండా మారుతున్నట్టు వైద్యులు గుర్తించారు. సాధారణంగా డాక్సీ సైక్లిన్ ఈ వ్యాధిపై చాలా ప్రభావవంతమైన మందు. అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఉన్న రోగులలో ఈ మందు పనిచేయకపోవడం గమనార్హం.

జినోమ్ సీక్వెన్సింగ్ కు నమూనాలు

డ్రగ్ రెసిస్టెన్స్ ఎంత మేర పెరిగిందో తెలుసుకునేందుకు రోగుల రక్తనమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్టు అధికారులు తెలిపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత ఏ యాంటీ బయాటిక్స్ ప్రభావవంతంగా పనిచేయగలవో స్పష్టతకు వస్తుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. అవసరమైతే కొత్త ట్రీట్ మెంట్ ప్రొటోకాల్ ను కూడా రూపొందించే అవకాశం ఉంది.

పెరుగుతున్న మరణాలు

ఇప్పటివరకూ స్క్రబ్ టైఫస్ కారణంగా 11 మంది మరణించారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో పనిచేసేవారు పొదల్లో తిరిగే వారు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. జ్వరం, శరీర నొప్పులు, ఎస్కార్ చర్మం మీద నల్లటి మచ్చ లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రజలకు జాగ్రత్తలు

ముఖ్యంగా పొదలు, గడ్డి ప్రాంతాల్లో పనిచేసేప్పుడు పూర్తి చేతులున్న దుస్తులు ధరించడం ముఖ్యం. శరీరంపై పురుగుమందు లోషన్లు వాడాలి. ఇంటి చుట్టుపక్కల గడ్డి , చెత్తను తొలగించాలి. జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

డ్రగ్స్ రెసిస్టెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ ను ఎదుర్కోవడానికి ప్రజల అప్రమత్తతతోపాటు వైద్యరంగం ముందస్తు చర్యలు కీలకం. తక్షణ పరీక్షలు, సరైన చికిత్స, పరిశుభ్రత మాత్రమే ఈ వ్యాధిని నివారించగల మార్గాలుగా ఉన్నాయి.