Begin typing your search above and press return to search.

మీటింగ్‌లో ట్రంప్ కునుకు.. ‘నిద్ర’ వెనుక ఉన్న ఆ ‘అంతర్జాతీయ వ్యూహం’ ఏంటో?

ఈ వీడియో వైరల్ కావడంతో వైట్‌హౌస్ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రెసిడెంట్ ప్రతినిధి.. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

By:  A.N.Kumar   |   28 Jun 2026 9:36 AM IST
మీటింగ్‌లో ట్రంప్ కునుకు.. ‘నిద్ర’ వెనుక ఉన్న ఆ ‘అంతర్జాతీయ వ్యూహం’ ఏంటో?
X

ప్రపంచాన్ని శాసించే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఓ సంచలనమే. ఆయన మాట్లాడితే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడకపోతే అదో పెద్ద న్యూస్. అయితే ఈసారి ఆయన ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.. సంచలన నిర్ణయాలు తీసుకోలేదు. కానీ వైట్‌హౌస్‌లో జరిగిన ఒక హై-లెవెల్ మీటింగ్‌లో కేవలం కళ్లు మూసుకుని కూర్చున్న ఒక చిన్న వీడియో క్లిప్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అవును.. మన ట్రంప్ గారు మీటింగ్‌లో చిన్నగా ‘కునుకు’ తీశారంటూ నెటిజన్లు ఇప్పుడు తెగ ఆరా తీస్తున్నారు.

నెటిజన్ల క్రియేటివిటీ.. ఏం కలలు కన్నారో?

వైట్‌హౌస్ అధికారులు అత్యంత కీలకమైన విషయాలపై సీరియస్‌గా చర్చిస్తుంటే మన ప్రెసిడెంట్ గారు మాత్రం ప్రశాంతంగా కళ్లు మూసుకుని కనిపించారు. ఇక అంతే.. సోషల్ మీడియా ట్రోలర్లకు అంతకంటే ఏం కావాలి? మీమ్స్ పండగ మొదలైపోయింది. "ట్రంప్ గారు నిద్రపోవట్లేదు సామీ.. ఇరాన్‌ను ఎలా దెబ్బకొట్టాలా అని ఇన్‌సెప్షన్ రేంజ్‌లో కలల లోపలికి వెళ్లి మరీ వ్యూహాలు రచిస్తున్నారు" అని ఒకరు కామెంట్ చేశారు. "అది నిద్ర కాదు, అమెరికా భవిష్యత్తును మార్చే తీవ్రమైన ఆలోచన.. దాన్ని అర్థం చేసుకునే రేంజ్ మీకు లేదు" అంటూ కొందరు సెటైర్లు వేశారు. మరో దేశంపై ఆంక్షలు విధించే కలలు కంటున్నారేమో అంటూ ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు.

వైట్‌హౌస్ ఫైర్.. "ఆయన హిస్టరీలోనే మోస్ట్ యాక్టివ్ ప్రెసిడెంట్!"

ఈ వీడియో వైరల్ కావడంతో వైట్‌హౌస్ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రెసిడెంట్ ప్రతినిధి.. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. "డొనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత చురుకైన అధ్యక్షుడు. ఆయన రోజుకు వందల మీటింగ్‌లలో పాల్గొంటూ దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎవరో కావాలని ఒక చిన్న సెకను క్లిప్‌ను కట్ చేసి దాన్ని తప్పుడు కోణంలో ప్రచారం చేయడం సరికాదు" అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే.. ‘సార్ కేవలం రెప్ప వాల్చారు, మీరు దాన్ని నిద్ర అంటున్నారు’ అనే రేంజ్‌లో సమర్థించుకున్నారన్నమాట!

ఇది ‘కళ్ల మూత’.. లేక ‘నిజమైన నిద్ర’?

నిజానికి ప్రపంచ నాయకులు ఇలా మీటింగ్‌లలో కళ్లు మూసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎందరో దేశాధినేతలు ఇలా దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియా యుగంలో చిన్న తప్పు దొరికినా దాన్ని భూతద్దంలో చూపించడం కామన్ అయిపోయింది. ఈ వీడియోలో ట్రంప్ నిజంగానే నిద్రపోయారా లేక కేవలం అలసట వల్ల కొద్దిసేపు కళ్లు మూసుకున్నారా అనేదానిపై స్పష్టత లేదు.

కారణం ఏదైనా ట్రంప్ సపోర్టర్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తుంటే యాంటీ-ఫ్యాన్స్ మాత్రం ట్రోల్స్ ఆపడం లేదు. ఏదేమైనా ప్రపంచాన్ని వణికించే ట్రంప్ గారిని ఇలా ‘సైలెంట్ మోడ్’లో చూడడం నెటిజన్లకు మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది.