మోడీ వెళ్లకున్నా.. భారత్ కు వచ్చేందుకు ట్రంప్ ఓకేనట
ఇద్దరు తాము నమ్మినదానికి కట్టుబడి ఉండటమే కాదు.. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న దానికి బద్ధులై ఉంటారు.
By: Garuda Media | 13 Sept 2025 2:03 PM ISTఒకప్పటి సన్నిహితులు ఇప్పుడు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అవును.. మేం చెబుతున్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించే. వీరిద్దరి మధ్య స్నేహబంధం ఎంత గాఢమైనదో గతంలో చూశాం. అదే సమయంలో లెక్కల్లో తేడా వచ్చినప్పుడు అంతటి బలమైన స్నేహం కాస్తా.. దేశ ప్రయోజనాల కోసం బలహీనంగా మారటం చూస్తున్నదే. ఇద్దరు తాము నమ్మినదానికి కట్టుబడి ఉండటమే కాదు.. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న దానికి బద్ధులై ఉంటారు.
అయితే.. ఈ ఇద్దరిలో ట్రంప్ తో పోలిస్తే నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు స్థిమితంగా.. స్థిరంగా ఉంటాయని చెప్పాలి. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ట్రంప్ వ్యవహరిస్తే.. అందుకు భిన్నంగా మోడీ తీరు కనిపిస్తుంది. ఈ కారణంగానే ట్రంప్ ఎంతలా చెలరేగిపోయినా.. మౌనంగా ఉంటూ తగిన సమయం కోసం వెయిట్ చేసి.. తాను చెప్పాల్సిన విషయాల్ని చెప్పేసిన తీరును మోడీలో చూశాం. రష్యా దగ్గర ముడిచమురు కొంటున్న దానికి బదులుగా భారత్ మీద సుంకాల షాకిచ్చిన ట్రంప్ తీరుపై మోడీ తనదైన రీతిలో రియాక్టు కావటం.. తగిన రీతిలో సమాధానం ఇవ్వటం తెలిసిందే.
సుంకాల షాక్ తో భారత్ ను తమ దారికి తీసుకురావాలని ట్రంప్ భావిస్తే.. ఆయన అంచనాలకు భిన్నంగా భారత ప్రధాని మోడీ ఎలాంటి షాకిచ్చారో తెలిసిందే. అమెరికా కాదంటే తాము చైనాతో ఉంటామని.. రష్యాతో కలిసి డ్రాగన్ దేశంతో కొత్త బంధాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయటం తెలిసిందే. ఈ పరిణామానికి అగ్రరాజ్యం సైతం షాక్ కు గురైన పరిస్థితి. అదే సమయంలో అమెరికాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి హాజరు కావాల్సిన మోడీ.. తన పర్యటనను రద్దు చేసుకోవటం ద్వారా.. అమెరికా విషయంలో తాను తగ్గేదే లేదన్న విషయాన్ని భారత్ చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.
ఇలాంటి ధోరణిని ఊహించని అగ్రరాజ్యానికి మోడీ వరుస షాకులు ఇచ్చినట్లుగా చెప్పాలి. భారత్ తో తమ బంధాన్ని పునర్ నిర్వచించుకోవటానికి అగ్రరాజ్యం పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇలాంటి వేళ.. ఈ ఏడాది చివర్లో భారత్ లో జరిగే క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు కూడా హాజరు కావాల్సి ఉంది. మోడీ మాదిరితాను భారత్ కు రానని చెప్పని ట్రంప్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం ద్వారా భారత్ కు సానుకూల సంకేతాల్ని పంపినట్లుగా చెప్పాలి.
క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని భారత్కు అమెరికా రాయబారిగా ఇటీవల నియమితులైన సెర్గియో గోర్ వెల్లడించటం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ఈ సదస్సుకు హాజరుకావటమే కాదు.. క్వాడ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. భారత పర్యటనకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని వెల్లడించటం ద్వారా.. భారత పర్యటన కోసం ట్రంప్ ఎదురుచూస్తున్న సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. ఈ ఏడాది మొదట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ను కలవటం.. ఆ సందర్భంగా భారత్ లో జరిగే క్వాడ్ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సదస్సును అసరాగా చేసుకొని.. భారత్ పర్యటనకు తాను వస్తున్న సంకేతాల్ని ఇవ్వటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రీట్ మెంట్ లభిస్తుందన్నది ఆసక్తికర అంశంగా చెప్పకతప్పదు.
