నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది.. ట్రంప్ మాస్ వార్నింగ్
అమెరికా రాజకీయాల్లోనే కాదు.. ప్రపంచ వేదికపై కూడా తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే డొనాల్డ్ ట్రంప్.. మరోసారి వార్తల్లో నిలిచారు.
By: A.N.Kumar | 29 April 2026 6:56 PM ISTఅమెరికా రాజకీయాల్లోనే కాదు.. ప్రపంచ వేదికపై కూడా తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే డొనాల్డ్ ట్రంప్.. మరోసారి వార్తల్లో నిలిచారు. పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా తన సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఒక పోస్ట్ అగ్రరాజ్యం భవిష్యత్ వ్యూహాలకు అద్దం పడుతోంది.
అణు చర్చలపై అసహనం.. దౌత్యం విఫలమైతే కఠినమే!
గత కొంతకాలంగా ఇరాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్, ఇరాన్ తీరును తప్పుబట్టారు. అణు ఒప్పందం విషయంలో ఆ దేశానికి స్పష్టమైన అవగాహన లేదని.. వారు కేవలం సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. "ఇరాన్ తెలివిగా వ్యవహరిస్తే వారికే మంచిది. ఒకవేళ చర్చల ద్వారా పరిష్కారం లభించకపోతే.. అమెరికా కఠిన వైఖరిని అవలంబించడానికి ఏమాత్రం వెనుకాడదు. ఇకపై పరిస్థితులు వారి చేతుల్లో ఉండవు." అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ పట్ల అమెరికా అనుసరించబోయే "జీరో టాలరెన్స్" పాలసీని సూచిస్తున్నాయి.
సంచలనం సృష్టించిన సోషల్ మీడియా పోస్ట్
కేవలం మాటలతోనే కాకుండా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' లో ట్రంప్ షేర్ చేసిన ఒక ఫోటో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. చేతిలో రైఫిల్ పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. “ఇక మీదట నేను అంత మంచివాడిగా ఉండను” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ వెనుక ఉన్న అంతరార్థాన్ని రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. దౌత్యం విఫలమైతే సైనిక బలప్రయోగానికి కూడా సిద్ధమనే హెచ్చరిక ఇది.మునుపటి కంటే మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. చర్చల టేబుల్ వద్ద ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు చేస్తున్న మైండ్ గేమ్ ఇది.
పశ్చిమాసియా భద్రతపై ప్రభావం
ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఘర్షణలతో ఇప్పటికే పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. ఇరాన్ నేరుగా ఈ ఘర్షణల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందన్న ఆందోళనల మధ్య ట్రంప్ హెచ్చరికలు మంటల్లో ఆజ్యం పోసినట్లు అయ్యాయి. అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరిస్తే అది కేవలం ఆ రెండు దేశాల మధ్య సమస్యగానే కాకుండా ప్రపంచ ముడిచమురు సరఫరా, అంతర్జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
అంతర్జాతీయ సమాజం చూపు.. ఇరాన్ వైపు!
ట్రంప్ విసిరిన ఈ సవాల్‌కు ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు అత్యంత కీలకం. ఒకవేళ ఇరాన్ మెట్టు దిగి చర్చలకు అంగీకరిస్తే కొంతవరకు ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. అయితే, ఇరాన్ కూడా తన పంతాన్ని వీడకపోతే మాత్రం అగ్రరాజ్యంతో నేరుగా ఘర్షణ తప్పకపోవచ్చు.
"నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది" అన్న చందంగా ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. దౌత్యం ద్వారా సాధ్యం కానిది, తనదైన దూకుడుతో సాధించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఈ 'మాస్ వార్నింగ్' తర్వాత ఇరాన్ తన అణు వైఖరిని మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.
